ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: సినీ జర్నీపై మనోజ్ బాజ్‌పేయ్

తాను సినీ జర్నీని ప్రారంభించిన తరువాత ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్‌ బాజ్‌పేయ్‌ చెప్పుకొచ్చారు.

  • Tv9 Telugu
  • Publish Date - 11:25 am, Thu, 2 July 20
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: సినీ జర్నీపై మనోజ్ బాజ్‌పేయ్

తాను సినీ జర్నీని ప్రారంభించిన తరువాత ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్‌ బాజ్‌పేయ్‌ చెప్పుకొచ్చారు. ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సినీ జర్నీలో తాను పడ్డ కష్టాలను వివరించారు.

”బీహార్‌లోని ఓ గ్రామంలో నేను పుట్టి పెరిగా. మా నాన్న వ్యవసాయం చేసేవారు. పల్లెటూరులో ఓ చిన్న స్కూల్‌లో నేను చదువుకున్నా. అమితాబ్‌ బచ్చన్‌ అంటే నాకు చాలా ఇష్టం. అలా 9 ఏళ్ల వయస్సులో నటుడు అవ్వాలని నాలో ఆశ మొదలైంది. అదే నా గమ్యం అని ఫిక్స్ అయ్యా. కానీ అప్పట్లో అది సాధ్యం కానీ పని అనిపించి, చదువుపై దృష్టి పెట్టా. అయినా నటుడు అవ్వాలన్న కోరిక నా మనసులో అలానే ఉండిపోయింది. దీంతో 17వ సంవత్సరంలో డీయూను వదిలేసి, థియేటర్‌లో శిక్షణ తీసుకున్నా. ఈ విషయం మా ఇంట్లో వాళ్లకు మొదట తెలియదు. ఆ తరువాత నేను మా నాన్నకు లేఖ రాసి, అందులో నటనపై శిక్షణ తీసుకుంటున్నట్లు వివరించా. అందుకు మా నాన్న కోప్పడతారని అనుకున్నా. కానీ ఆయన నా కోసం 200రూపాయల ఫీజును పంపారు.

నేను అవుట్‌ సైడర్‌ని కావడంతో ఇండస్ట్రీలోకి వచ్చేందుకు చాలా కష్టపడ్డా. ఇంగ్లీష్, హిందీపై పట్టు సాధించా. ఆ తరువాత ‘నేషనల్ స్కూల్ ఆఫ్‌ డ్రామా’కు మూడు సార్లు అప్లై చేశా. కానీ రిజక్ట్ అవ్వడంతో ఆత్మహత్య ప్రయత్నాలు చేశా. ఆ సమయంలో నా ఫ్రెండ్స్ నాకు తోడుగా నిలిచారు. ఎప్పుడు నా పక్కనే ఉంటూ ధైర్యం చెప్పారు. మొదట్లో నేను చాలా కష్టాలు పడ్డా. ఇంటి రెంట్‌ కూడా కట్టుకోలేకపోయా. నాలుగు సంవత్సరాల కష్టం తరువాత మహేష్ భట్, ఓ సిరీస్‌లో అవకాశం ఇచ్చారు. ఒక్కో ఎపిసోడ్‌కి నాకు రూ.1500 ఇచ్చేవారు. ఆ తరువాత నా టాలెంట్‌తో త్వరగానే సినిమాల్లో అవకాశం దక్కించుకున్నా. సత్యతో నాకు బ్రేక్ వచ్చింది. నిదానంగా సొంత ఇంటిని కొనుగోలు చేశా. 67 సినిమాల తరువాత ఇదుగో ఇలా ఉన్నా. మనం కన్న కలలు నెరవేరినప్పుడు మనం పడ్డ కష్టం పెద్దగా కనిపించదు” అని మనోజ్‌ తెలిపారు. కాగా హిందీలో పలు సినిమాల్లో నటించిన మనోజ్, తెలుగులో హ్యాపీ, వేదం వంటి చిత్రాల్లో మెరిశారు. సత్య సినిమాకు గానూ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు.