
Chiranjeevi: ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందు హీరోలు ఎన్నో రకాల ఆలోచనలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో తమకు కథ అంతగా నచ్చకపోయినా దర్శకుడు చెప్పిన విధానానికి ఇంప్రెస్ అయి కూడా సినిమాలు చేస్తుంటారు. ఇక ఆ కథ తమకు సరిపోదని తెలిసినా దర్శక, నిర్మాతల ఒత్తిడి మేరకు ఓకే చేస్తుంటారు. తన కెరీర్‌లో కూడా ఇలాంటి ఓ సంఘటనే జరిగిందని చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. చిరు హీరోగా సురేశ్ కృష్ణ దర్శకత్వంలో 2001లో వచ్చిన ‘డాడీ’ సినిమా బాక్సాఫీస్ ముందు మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఈ సినిమా ఆకట్టుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదిలా ఉంటే మొదట డాడీ సినిమా కథ విన్న సమయంలో చిరు ఈ సినిమాలో తనకంటే వెంకటేశ్ హీరోగా నటిస్తే బాగుండేదని చెప్పారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డాడీ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషాయాలను పంచుకున్నారు. ఇంతకీ చిరు ఏమన్నారంటే.. ‘డాడీ కథను మొదటి సారి విన్నప్పుడు ఈ కథకు నాకంటే వెంకటేశ్ అయితే న్యాయం చేయగలడనుకున్నాను. రచయిత భూపతి రాజుకు కూడా ఇదే విషయాన్ని చెప్పాను. అయితే దీనికి స్పందించిన భూపతి రాజు.. వెంకీకి మామూలుగా ఉంటుంది. నాకైతే ఫ్యామిలీమెన్‌గా కాస్త వెరైటీగా ఉంటుందని నన్ను ఒప్పించాడు. దీంతో నేను కూడా సినిమాను బలవంతగానే ఒప్పుకున్నాను. చివరికి ఫలితం కూడా అలాగే వచ్చింది. కథ విన్నప్పుడు అనుకున్నదే జరిగింది’ అని చెప్పుకొచ్చారు.
ఇక సినిమా విడుదల తర్వాత వెంకటేశ్ చిరుకు ఫోన్ చేసి.. ‘భలే సినిమా అండీ. నేను నటించి ఉండే ఇంకా బాగా ఆడేదండీ’ అని చెప్పారట. దీనికి చిరు స్పందిస్తూ.. ‘నేను కూడా ఇదే విషయాన్ని చెప్పాను. కానీ వినలేదు’ అంటూ బదులిచ్చారట. ఇలా చిరు డాడీ సినిమా విషయంలో చోటు చేసుకున్న సంఘటనను పంచుకున్నారు. డాడీలాంటి ఫెయిల్యూర్స్ కూడా తన జీవితంలో ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బిజీగా ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..