ఆరో దశకం ఆరంభం. పిల్ల తెమ్మరగా సాగిపోతున్న హిందీ సినీ సంగీతంలోకి పాతికేళ్లు కూడా దాటని ఓ యువకుడు ప్రవేశించాడు.. వస్తూనే అలజడి సృష్టించాడు. సంప్రదాయపు సంకెళ్లను తెంచాడు. పాటను పరుగులు పెట్టించాడు. వెస్ర్టన్ మ్యూజిక్‌కు సంప్రదాయ సంగీతపు మధురిమలు జోడించాడు. ఆ కొత్తదనానికి కుర్రకారు మంత్రముగ్ధులయ్యింది. అతను స్వరపరిచిన పాటలకు ఊగిపోయింది. మత్తుగా గమ్మత్తుగా వున్న సంగీతానికి పడి చచ్చిపోయింది. ఆ స్వరకర్త ఎవరో కాదు. ఎన్నేళ్లయినా, ఎన్నాళ్లయినా మర్చిపోవడం సాధ్యపడని రాహుల్‌దేవ్ బర్మన్. అభిమానులంతా ప్రేమగా పంచమ్‌దాగా పిలుచుకునే ఆ సంగీత దర్శకుడి జయంతి ఇవాళ.
బాలీవుడ్ పాటలపై పంచమ్‌దా గాఢమైన ముద్ర వేశారు. దాన్ని అనుసరించాలని, అనుకరించాలని ఎంతో మంది ప్రయత్నించారు కాని సక్సెస్ కాలేకపోయారు. ఆర్డీ స్టయిల్‌ను పట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఎన్నెన్నో కొత్త వాయిద్యాలను, ధ్వనులను, నడకల్లో విరుపులనూ ప్రవేశపెట్టాడు ఆర్డీ. పాతవాటితో మొహంమొత్తిన సినీ సంగీతాభిమానులకు అవన్నీ గొప్పగా అనిపించాయి. ఆనందాన్ని ఇచ్చాయి. ఇవే అనతి కాలంలోనే ఆయన్ను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ను చేశాయి.
తీస్రీమంజిల్ సినిమాతో, అందులోని పాటలతో రాహుల్ ఓవర్‌నైట్ స్టారయ్యాడు. అంతకు ముందు చేసిన సినిమాల్లో పాటలు తక్కువేం కావు…కాకపోతే రాహుల్‌కు బ్రేక్ త్రూ రాలేదంతే. సచిన్‌దేవ్ బర్మన్ కొడుకు కావడం వల్లే సంగీతం డిఫాల్ట్‌గా వచ్చేసింది. ఎంతగా అంటే తొమ్మిదేళ్ల వయసులోనే పాటను కంపోజ్ చేసేటంతగా. ప్యాసాలో బాగా పాపులరైన సర్ జో తేర చకరాయె పాటను కూడా పిల్లకుంకగా వున్నప్పుడు బర్మన్ ట్యూన్ చేసిందేనట! బాగుంది కదా అనేసి సచిన్‌దేవ్ ఆ సౌండ్‌ట్రాక్‌ను యాజిటీస్‌గా వాడేశారు. ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ దగ్గర శాస్త్రీయ సంగీతాన్నినేర్చుకున్న రాహుల్ మౌత్ ఆర్గాన్ వాయించడంలో ఘటికుడు. తండ్రి సంగీతాన్ని అందించిన కొన్ని సినిమాలకు వాయించాడు కూడా. రాహుల్‌లో బోలెడంత టాలెంట్ వుంది కానీ ఏం లాభం? అవకాశాలు వస్తేగా..! గురుదత్ తన రాజ్ సినిమాలో అవకాశం ఇచ్చాడు కానీ అది సగంలోనే ఆగిపోయింది. ఆ తర్వాత మెహమూద్ తన చోటే నవాబ్‌లో అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత పెద్దగా ఛాన్సులేమీ రాలేదు. కొంత కాలం తండ్రి దగ్గరే అసిస్టెంట్‌గా కొనసాగాడు. మళ్లీ మెహమూదే భూత్‌బంగ్లా సినిమాతో రెండో అవకాశం కల్పించాడు.. అందులోని జాగో సోనేవాలో పాట పెద్ద హిట్టయింది.. ఆర్డీ అంటే ఎవరూ అని ఆరా తీయించింది. తీస్రీమంజిల్ సినిమాతో ఆర్డీ బాలీవుడ్‌లో కాంక్రీట్ వేసుకోగలిగాడు..
చిన్నప్పుడు రాహుల్ ఏడుపు అచ్చంగా పంచమ స్వరంలా వుండేదట! అలాగే వినిపించేదట! అందుకే ఆయన్ను పంచమ్‌దా అనేది. నిజానికి ఈ పేరే ఎక్కువ పాపులరైంది కూడా. మీరు గమనించారో లేదో కానీ ఆర్‌డి పాటల్లో సౌండ్ కంటే సోలే ఎక్కువగా వుంటుంది. అది ఫాస్ట్ బీటైనా…క్లాసికల్ సాంగైనా, ఫోక్ అయినా వినసొంపుగా వుండేది అందుకే… ఎప్పుడైనా మీరు పంచమ్‌దా పాటను హమ్ చేసుకుంటూ వెళ్లండి… ఆటోమాటిక్‌గా పాట మొత్తం మిమ్మల్ని చుట్టే తిరుగుతూ వుంటుంది. జ్ఞాపకాల మేళాను వెంటేసుకొస్తుంది..
సచిన్‌దేవ్ బర్మన్ కుమారుడే అయినా ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ పెద్దగా లేదు. కుర్రకారుకేం కావాలో వారు కోరుకుంటున్నదేమిటో ఆర్‌డికి బాగా తెలుసు! యువతకు కావాల్సిందేమిటో అదే అందించాడు. ఆర్‌డి తొలి సినిమాలన్నీ మ్యూజికల్ హిట్సే. ఎవరన్నా కాదన్నా రాజేశ్ ఖన్నా సూపర్‌స్టార్‌డమ్‌ను నిలబెట్టింది కూడా పంచమ్‌దా పాటలే! మహ్మద్ రఫీ, కిశోర్ కుమార్, ఆశాభోంస్లేలలో ఆర్డీ చేయని ప్రయోగం లేదు.. ఏ పాటను ఉదహరించినా ఇంకో పాటకు అన్యాయం చేసినట్టు అవుతుంది..పంచమ్‌దాలో ఓ అద్భుతమైన గాయకుడున్నాడు.. ఎలాంటి భావాన్ని అయినా పలికించగల గళమది. తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన కళో, సంగీతమంటే విపరీతమైన అభిమానమో తెలియదు కానీ పంచమ్ దా పాడిన అన్ని పాటలు వినసొంపుగా, చెవులకు ఇంపుగా వుంటాయి. బందినీ సినిమాలోని ఓరే మాఝీ సున్‌మెరే బంధూరే పాట సచిన్‌దేవ్ బర్మన్‌కు ఎంతటి పేరు తెచ్చిపెట్టిందో ఇంచుమించుగా ఆర్‌పార్ సినిమాలోని ఓ మాఝీ తేరేనయ్యా సే చూటా కినారా పాట ఆర్డీ బర్మన్‌కు అంతటి పేరు ప్రఖ్యాతులను తెచ్చి పెట్టింది. ఆర్టీ గొంతు ఆయన సంగీత దర్శకత్వంలో పాడిన గాయకులంత గొప్పది కాకపోవచ్చుగాక కానీ ఆయన గళంలో సాహిత్యంలోని భావం అద్భుతంగా పలికేది. తను సంగీత దర్శకత్వం వహించిన పాటల్లో ముఖ్యమైన చరణాలు కొన్ని పాడి ఆ పాటలకు సొగసు తెచ్చినప్పటికీ తన పేరు టైటిల్ కార్డ్స్‌లో వేసుకోవాలని, క్రెడిట్ సంపాదించాలని ఏనాడూ అనుకోలేదు. బాలికాబధు సినిమాలో బడే అచ్చే లగ్‌తే హై పాట వినే ఉంటారు. ఆ పాటను అమిత్‌కుమార్ పాడాడు. అమిత్ గొంతు రాహుల్ గొంతు దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఈ పాటలో రాహుల్ ఓ చరణంలో తన గొంతు కలిపాడు. కానీ ఆయన ఏ చరణం పాడాడు అన్నది కనుక్కోవడం చాలా కష్టం. మామూలు శ్రోతలకు అది సాధ్యం కాదు కూడా! కార్‌వాన్ సినిమాలో ఆశా పాడిన పియాతో అబ్తో ఆజా పాట ఉంది కదా! అందులో మోనికా ఓ మై డార్లింగ్ అంటూ ఆర్డీ కేకలు పెడతాడు కదా! ఒక్కసారి వాటిని పక్కన పెట్టేసి పాటను విని చూడండి.. అస్సలు బాగోదు. అందుకు కారణం ఆర్డీ చేసిన మ్యూజిక్కే సారీ మ్యాజిక్కే కారణం. రీమిక్స్‌లు, దానికి మిక్సింగులు .ఇలా ఆ పాట ఇంకో యాభై ఏళ్ల తర్వాత కూడా వినిపిస్తూనే ఉంటుంది.
షోలేలోని మహబూబా పాట గురించి ఏం చెబుతాం? షోలే ఎంత హిట్టయిందో అంతకు మించి ఈ పాట హిట్టయింది. ఎస్‌డి బర్మన్‌కు మాత్రం ఇలాంటి పాటలు, అరుపులు, కేకలు ఇష్టముండేవి కావు. కానీ ప్రేక్షకులు మాత్రం పడి చచ్చిపోయారు.. అక్కడితో ఆగాడా… ఆశాతో కలిసి క్యాబరేలనే గ్లామర్ పాటలకు గ్రామర్‌ను సృష్టించాడు. ఏడో దశకంలో రాహుల్ పాడిన సోలోలు, డ్యూయెట్లు బాగా పాపులరయ్యాయి. రఫీతో కలిసి షాన్‌లో యమ్మా యమ్మా పాట పాడాడు. సపన్ చక్రవర్తితో కలిసి గోల్‌మాల్‌లో టైటిల్ సాంగ్ పాడాడు. కిశోర్‌కుమార్‌తో కలిసి పుకార్‌లో ఓ పాటపాడాడు. విషాదాన్ని రాహుల్ గొప్పగా పలికించగలడు. హమ్‌కిసీసే కమ్ నహీ సినిమాలోని తుమ్ క్యాజానో మొహబ్బత్ క్యా హై పాట, జమానాకో దిఖానాహై లోని దిల్ లేనా ఖేల్ హై పాటలు వినిచూడండి. రాహుల్ బాధను ఎంత బాగా పలికించాడో మీకే అర్థమవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు. గుల్జార్ తీసిన లిబాస్ లోని క్యా భలా హై క్యా బురా హై పాట ఒక ఎత్తు. ఈ సినిమా విడుదలకు నోచు కోలేదు కానీ పాటలు మాత్రం బాగా పాపులరయ్యాయి. తన జీవితంలో ఎవరితో కలిసి పాడటానికి జంకాడో ఆమెతో కలిసి మొదటి సారిగా ఈ పాట పాడాడు రాహుల్. ఆమె ఎవరో కాదు. లతా మంగేష్కర్.
ఆంధ్రపత్రిక ఎడిటోరియల్‌ను కూడా అందమైన పాటగా తీర్చదిద్దగలవాడట మన మహదేవన్. ఆర్డీ కూడా అలాంటివాడే. ఏ టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్‌నో, మరో పసందైన సెంటెన్స్‌లనో పంచమ్‌దాకు ఇస్తే అద్భుతమైన పాటగా మలచేవాడు. గుల్జార్ తీసిన ఇజాజత్‌లో ఈ పాట చూడండి. కేవలం పదాలే వుంటాయి. అవే పదాలు లక్షలాది మంది పెదాలపై నర్తించాయి. నటించిన అనురాధ పటేల్‌కు ఫ్యాన్ మెయిల్ పెరిగింది. పాడిన ఆశాకు, రాసిన గుల్జార్‌కు అవార్డులను తెచ్చిపెట్టింది…
దాదాపు రెండు దశాబ్దాల పాటు పంచమ్‌దా మ్యూజిక్ ఫీల్డ్‌ను ఏలాడు. ఆర్‌డి కోసం బడా బడా నిర్మాణ సంస్థలన్నీ కాచుకుని వుండేవి. స్టార్లు, సూపర్‌స్టార్లు ఎదురుచూసేవారు. షోలే, షాలీమార్, బర్నింగ్ ట్రయిన్ వంటి భారీ సినిమాలే కాదు. చిన్న సినిమాలకు కూడా అదే శ్రద్ధతో సంగీతాన్ని అందించేవాడు. ఆర్డీ పాటలన్నీ హిట్ కావడానికి ఇదే కారణం. ఓ గొప్ప వింతేమిటంటే ఆర్డీ బర్మన్‌కు ఒక్క నేషనల్ అవార్డు కూడా రాలేదు కానీ ఆయన పాటలతో ప్రత్యేకంగా తీసిన డాక్యుమెంటరీలకు నేషనల్ అవార్డులు రావడం. సెమీ క్లాసికల్, సెమీ ఫిలాసఫికల్ టచ్ వున్న సాంగ్స్ అంటే రాహుల్‌కు చాలా ఇష్టం. ఎన్ని పాటలు కంపోజ్ చేశాడనీ, ఎన్ని పాటలు పాడాడనీ.
రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్‌లో చెదిరిపోని ముద్రను వేసిన ఆర్డీకి ఎనిమిదో దశకం మధ్య నుంచి కష్టాలు మొదలయ్యాయి.. అవకాశాలు రావడం తగ్గాయి. అప్పటికే లక్ష్మీకాంత్ ప్యారేలాల్, బప్పీలహరీలు దూసుకుపోసాగారు. పెద్ద నిర్మాతలు మొహం చాటేయసాగారు. రామ్‌లఖన్ చిత్రానికి ఛాన్సిస్తానన్న సుభాష్ ఘాయ్ కూడా హ్యాండిచ్చాడు. ఇచ్చిన మాటను కాదని లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌ను తీసుకున్నాడు. పంచమ్‌దాకు ఊహించని పెద్ద షాక్. అదే గుండెపోటుకు దారి తీసింది. చివరి రోజుల్లో ఆర్డీ చాలా కష్టపడ్డాడు.. ఓ పక్క షుగర్. మరో పక్క గుండెజబ్బు అతడిని కుంగదీశాయి..అవకాశాలు లేకపోవడం చికాకును పెంచాయి. దాంతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. చివరి దశల్లో సంగీతాన్ని అందించిన 1942 ఎ లవ్ స్టోరీ పాటలను ఎవరైనా మర్చిపోగలరా? ఆయన చనిపోయాక చాలా కాలం తర్వాత కేవలం ఆయన పాటలతోనే దిల్ విల్ ప్యార్ ప్యార్ సినిమా వచ్చింది. ఆ క్రెడిట్ ఒక్క బర్మన్‌కే దక్కుతుంది.
పంచమ్‌దా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. తెలుగులో చిన్నికృష్ణుడు, అంతం సినిమాలకు సంగీతాన్ని అందించింది బర్మనే!
మరే ఇతర సంగీత దర్శకులకు లేని వైవిధ్యం, నవ్యత పంచమ్‌దాలో వుంది. ఇప్పటికీ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఏదో రకంగా ఆర్డీని తల్చుకుంటూనే వున్నారు. ఆ మధ్యన దమ్ మారో దమ్ పాటను రీమిక్స్ చేశారు. అంతకు ముందు బచ్‌నా యే హసినో పాట ఇలాగే వచ్చింది. పంచమ్‌దాపై ఆర్‌డి బర్మన్-ది మ్యాన్-ది మ్యూజిక్ బయోగ్రఫీ అనే పుస్తకం వస్తే ఒక్క నెలలోనే మూడు వేల కాపీలు అమ్ముడయ్యాయట! పుస్తకానికే అంత డిమాండ్ వుంటే పాటల సీడీలకు ఎంత ఉండాలి? తరాలు మారినా…ఆర్‌డి పాట మాత్రం నిలిచే వుంటుంది… యూత్‌కి ఆయన పాటలే దిక్కు-మొక్కు. ఆర్డీ బర్మన్. ఫరేవర్!
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.