
సాధారణంగా భారతీయ సినీ పరిశ్రమలో ట్రాన్స్‌జెండర్స్ గురించి అనేక సినిమాలు వచ్చాయి. వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు.. జీవితంలో గెలిచిన తీరును ప్రేక్షకులకు తెలియజేస్తూ అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. కానీ నిజ జీవితంలో ఇప్పటికీ వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సామాన్యులే కాకుండా సెలబ్రెటీలు కూడా అనేక చేదు ఘటనలు చూస్తున్నారు. తాజాగా మరాఠీ నటి ప్రణీత్ హట్టేకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. మహారాష్ట్రకు చెందిన తొలి ట్రాన్‌జెండర్ హీరోయిన్ ఆమె. తనకు ఎదురైన పరిస్థితిని చెబుతూ ఓ వీడియోను షేర్ చేసింది ప్రణీత్ హట్టే. తాను ట్రాన్స్‌జెండర్ అయినందుకే తన బుకింగ్‌ను క్యాన్సిల్ చేసిందని ఓ హోటల్‌పై ఆరోపణలు చేసింది.
ఇటీవలే ఓ షోలో పాల్గోనేందుకు నాసిక్ వెళ్లింది ప్రణీత్ హట్టే. అక్కడ ఉండేందుకు ఆన్ లైన్ లో హోటల్ గదిని బుక్ చేసుకుంది. తీరా ఆ హోటల్ కు వెళ్లి డాక్యుమెంట్స్ చూపించగా.. ట్రాన్స్‌జెండర్ కావడంతో ఆమె బుకింగ్ క్యాన్సిల్ అయిందని అక్కడి సిబ్బంది తెలిపారు. దీంతో సదరు సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేసింది ప్రణీత్ హట్టే. తాను ట్రాన్స్‌జెండర్ కావడం అనే ఒకే ఒక్క కారణంతో హోటల్ యజమానులు తన రూమ్ బుకింగ్ క్యాన్సి్ల్ చేశారని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. సమాజంలో పరిస్థితి ఇలా ఉంటే ట్రాన్స్‌జెండర్లు ఎక్కడ బతికాలి.. ? ఎక్కడ ఉండాలి ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రణీత్ హట్టే షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
దీంతో నెటిజన్స్ ప్రణీత్ హట్టేకు మద్దతు తెలుపుతూ హోటల్ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సదరు హోటల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రణీత్ హట్టే మరాఠీలో కరభారి లయభరి సీరియల్లో గంగ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన హడ్డీలో కూడా కనిపించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.