Bollywood Drugs Case: డ్రగ్స్ కేసులో నటి రియా చక్రవర్తిపై అభియోగాలు నమోదు.. నేరం రుజువైతే పదేళ్లు జైలు
Sushant Singh Rajput Drugs Case: నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు మరో 34 మందిని నిందితులుగా పేర్కొంటూ ఛార్జిషీట్ దాఖలు చేసింది. రియా చక్రవర్తి గంజాయిని కొనుగోలు చేసి సుశాంత్ సింగ్‌కు డెలివరీ చేసినట్లు అభియోగాలు మోపారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో పురోగతి చోటుచేసుకుంది. 2020లో మరణించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేశినట్లు అతని ప్రియురాలు నటి రియా చక్రవర్తిపై అభియోగాలు నమోదయ్యాయి. ఆ మేరకు నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఆమెతో పాటు మరో 34 మందిని నిందితులుగా పేర్కొంటూ ఛార్జిషీట్ దాఖలు చేసింది. రియా చక్రవర్తి గంజాయిని కొనుగోలు చేసి సుశాంత్ సింగ్‌కు డెలివరీ చేసినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసులో ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా నిందితుడిగా చేర్చారు. రియా చక్రవర్తి ఎవరి దగ్గరి నుంచి గంజాయి కొనుగోలు చేసిందో వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. డ్రగ్స్ కొనుగోలు చేసి సమకూర్చినందునే సుశాంత్ ఈ అలవాటుకు బానిసైనట్లు ఛార్జిషీటులో పేర్కొన్నారు. అయితే తనపై ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదంటూ రియా చక్రవర్తి ఇది వరకే కొట్టిపారేశారు. కోర్టులో ఎన్సీబీ మోపిన అభియోగాల మేరుకు నేరం రుజువైతే మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద రియా చక్రవర్తికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఈ కేసులో రియా చక్రవర్తి 2020 సెప్టెంబర్‌లో అరెస్టయ్యారు. ఆమె అరెస్ట్ అయిన దాదాపు నెల తర్వాత బాంబే హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 14, 2020న సబర్బన్ బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో నటుడు సుశాంత్ సింగ్ (34) మరణించాడు. ప్రాధమికంగా అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు భావించినా..దీనిపై సుశాంత్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. సుశాంత్ సింగ్‌ది ఆత్మహత్యేనని ముంబై పోలీసులు పేర్కొనగా.. అనుమానాస్పద మరణంగా పరిగణిస్తూ ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అటు డ్రగ్స్ కారణంగానే సుశాంత్ మరణించాడన్న విమర్శల నేపథ్యంలో బాలీవుడ్, హిందీ టెలివిజన్ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగంపై NCB దర్యాప్తు ప్రారంభించింది.
మరిన్ని సినిమా వార్తలు చదవండి