Shruthi Haasan: లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రుతి హాసన్ (Shruthi Haasan). కేవలం నటిగానే కాకుండా సింగర్‌గానూ సత్తాచాటింది. మధ్యలో వ్యక్తిగత సమస్యలతో సినిమా ఇండస్ట్రీ నుంచి విరామం తీసుకున్నా క్రాక్ సినిమాతో మళ్లి ఫాంలోకి వచ్చింది. ఆతర్వాత పవర్ కల్యాణ్ వకీల్‌సాబ్‌తో మరో ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఈ అమ్మడు బిజీగా ఉంది.. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ సినిమాలో హీరోయిన్ ఆద్య పాత్రలో నటిస్తోంది శ్రుతి.. అలాగే బాలయ్య, గోపిచంద్ మలినేని, మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనూ కథానాయికగా అలరించనుంది.. ఇలా వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఈ సొగసరి.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈ అందాల తార పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కాగా జిమ్‌లో కఠినమైన వర్కవుట్లు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శ్రుతి.. ‘ప్రస్తుతం నేను పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్ వంటి హార్మోన్లకు సంబంధించిన సమస్యల్ని ఎదుర్కొంటున్నా. దాని నుంచి బయటపడేందుకు పోరాటం చేస్తున్నాను. సరిగ్గా తినడం.. బాగా నిద్రపోవడం.. నా పనిని ఆస్వాదించడం ద్వారా నా మనసును దృఢంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. హర్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే సమస్యల నుంచి బయటపడడం ఓ సవాల్ అని మహిళలందరికీ తెలుసు. అయితే నేను దీనిని ఓ సమస్యగా చూడకుండా మహిళల్లో జరిగే ఓ సహజ ప్రక్రియగా భావిస్తున్నాను. ఇప్పుడు శారీరకంగా నేను పర్‌ఫెక్ట్‌గా లేను. అయితే మానసికంగా చాలా దృఢంగా ఉన్నాను’ అని మహిళలకు స్ఫూర్తినిచ్చేలా చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..