Nithya Menen: సినిమాలు, టీవీషోలతో బిజీబిజీగా ఉండే నిత్యామేనన్ (Nithya Menen) గత కొద్దికాలంగా వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ముఖ్యంగా ఇటీవల ఆమె ఓ వ్యాపారవేత్తతో ఏడడుగులు నడవనున్నారంటూ పుకార్లు షికార్లు కొట్టాయి. ఎంతో కాలం నుంచి ఆమె అతనితో ప్రేమలో ఉన్నారని, పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కనున్నారని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవాలేనంటూ ఒక వీడియో సందేశంతో తన పెళ్లిపై వచ్చిన పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టింది. కాగా తాజాగా 19 (1)(A) ప్రమోషన్‌లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ మరోసారి తన పెళ్లి వార్తలపై స్పందించింది. దీంతో పాటు ఓ వైరల్ ఫిల్మ్ రివ్యూవర్ సోషల్ మీడియాలో ఆరేళ్లుగా తనను వేధిస్తున్నాడంటూ సంచలన విషయాన్ని బయటపెట్టింది.
‘గత కొన్నిరోజులుగా నా పెళ్లి గురించి నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టడానికి ప్రధాన కారణం సంతోష్ వర్కీ అనే వైరల్ యూట్యూబర్. అతను గత ఆరేళ్లుగా సోషల్ మీడియాలో నన్ను వేధిస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని కూడా చెప్పాడు. ఆరోజు నుంచే ఈ వార్తలు వెలువడుతున్నాయి. సంతోష్ నన్నే కాదు, నా కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. దీంతో ప్రతి ఒక్కరూ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించాను. కానీ నేను ఓపికతో వ్యవహరించాను. వేర్వేరు నంబర్లతో అమ్మానాన్నలకు కాల్ చేసేవాడు. అతడి మానసిక స్థితి బాగోలేదనుకుంటా.. వదిలేద్దాం అని ఇంట్లో వాళ్లకు చెప్పాను. ఒకసారి అమ్మ తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా సంతోష్ ఫోన్ చేసి వేధించాడు. ఎప్పుడూ శాంతంగా, సౌమ్యంగా ఉండే నాన్న ఆరోజు ఎంతో కోప్పడ్డాడు. వెంటనే నంబర్లన్నీ బ్లాక్ చేయమన్నారు. అలా అతనివి దాదాపు 30 ఫోన్ నంబర్లు బ్లాక్ చేశాను. కానీ అతను ఇంకా మారలేదు. నా పెళ్లి గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు’ అని చెప్పుకొచ్చింది నిత్య.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..