ప్రముఖ మలయాళ నటుడు మిథున్ రమేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేదు. కానీ మలయాళ బుల్లితెర ఆడియెన్స్‌కు ఈయన చాలా సుపరిచితం. సినిమాల్లో నటిస్తూనే పలు టీవీ షోస్‌లకు హోస్ట్‌గా వ్యవహరించాడు. రేడియో జాకీగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే 42 ఏళ్ల మిథున్ కొన్ని నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. బెల్స్ పాల్సీ అనే వ్యాధి బారినపడ్డారీ ట్యాలెంటెడ్ యాక్టర్. దీనినే ఫేషియల్ పెరాలసిస్ అని కూడా అంటారు. ఈ వ్యాధి బారిన పడిన వారి ముఖాల్లో కండరాలు సరిగా పని చేయవు. అంటే మాట్లాడినా, నవ్వినా ముఖం వంకరగా కనిపిస్తుంది. ఆ సమయంలో మిథున్ సతీమణి లక్ష్మీ ఆయనకు ఎంతో అండగా నిలిచింది. దగ్గరుండి అన్నీ సేవలు చేసింది. తన భర్తకు త్వరగా నయమైతే తిరుమలకు వచ్చి శ్రీవారికి తల నీలాలు సమర్పిస్తానని మొక్కుతుంది. లక్ష్మీ ప్రార్థనలను తిరుమల ఏడుకొండల స్వామి ఆలకించాడు. రమేష్ బెల్ ఫాల్సీ నుంచి దాదాపుగా కోలుకున్నాడు.
ఈక్రమంలో మొక్కు ప్రకారం.. తిరుమల శ్రీవారికి తల నీలాలు సమర్పించింది మిథున్ సతీమణి లక్ష్మి. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు మిథున్.’బెల్స్ పాల్సీ వ్యాధితో నేను ఎంత ఇబ్బంది పడ్డానో అందరికీ తెలుసు. మీ అందరి ప్రార్థనల వల్ల నేను మళ్లీ మామూలు మనిషినయ్యాను. ముఖ్యంగా నా భార్య లక్ష్మి అయితే ఆ దేవుడిని ప్రార్థించని రోజంటూ లేదు. ఈ వ్యాధి నుంచి బయటపడితే తాను తలనీలాలు ఇస్తానని తిరుపతి శ్రీవారికి మొక్కుకుంది. ఇదిగో.. ఇప్పుడు ఆ మొక్కే తీర్చుకుంది. ఇంతకంటే ఆమెను నేను ఏమని అడగాలి. నాపై ఇంతటి ప్రేమ, త్యాగం, నమ్మకం చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు’ అని ఎమోషనల్ అయ్యాడు మిథన్. ఇందులో గుండుతో కనిపించింది మిథున్ భార్య. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మిథున్ సతీమణిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.