Actor Manchu Mohan Babu on BJP: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్ మంగళవారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. తిరుపతిలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మోహన్ బాబు, విష్ణు, మనోజ్ పాదయాత్రగా కోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ మనిషినని, కేంద్రంలో బీజేపీ (BJP) అధికారంలో ఉండాలని, మోడీ గెలవాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకరిని అని పేర్కొన్నారు. తాను రియల్ హీరోనని, విద్యార్థుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టారంటూ మోహన్‌బాబు వ్యాఖ్యానించారు. కాగా.. మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అయితే కోర్టుకు పాదయాత్ర ద్వారా హాజరయ్యారు.. ఏదైనా కారణం ఉందా అంటూ మీడియా ప్రశ్నించగా. పాదయాత్రగా వచ్చానని ఎవరు చెప్పారంటూ మోహన్ బాబు ప్రశ్నించారు. తాను రియల్ హీరోనని.. తనకు చాలామంది అభిమానులు ఉన్నారని వారితో ఆత్మీయంగా మాట్లాడేందుకే నడుచుకుంటూ వచ్చానన్నారు.
మోహన్ బాబు, ఆయన తనయులైన సినీ హీరోలు విష్ణు, మనోజ్‌పై 2019 మార్చి 22న కేసు నమోదైంది. విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం ధర్నా చేయడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో ఉన్న శ్రీ విద్యా నికేతన్ విద్యార్థులతో కలిసి మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌లు రోడ్డుపై బైఠాయించారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ఉల్లంఘిస్తూ ధర్నా చేసినందుకు చంద్రగిరి పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.