లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తోన్న ఇండియన్ 2 షూటింగ్‌లో జరిగిన ప్రమాదం వార్త దక్షిణాది ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో చిత్రయూనిట్‌కు చెందిన ముగ్గురు మృతి చెందగా.. దాదాపు పది మందికి గాయాలైనట్లు సమాచారం. ప్రధాన తారాగమమైన కమల్ హాసన్, కాజల్.. ఘటన జరిగిన కొన్ని నిమిషాల ముందు అక్కడి నుంచి వెళ్లిపోగా.. వెంట్రుకవాసిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై కోలీవుడ్‌తో పాటు పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు స్పందించి.. తమ సానుభూతిని ప్రకటించారు.
మరోవైపు ఈ ఘటనపై స్పందించిన కమల్ హాసన్.. బాధిత కుటుంబాలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇస్తానని ప్రకటించారు. అయితే మూవీ షూటింగ్‌లలో ఇలాంటి ప్రమాదాలు జరగడం కొత్తేం కాదు. కానీ ఈ ప్రమాదం జరిగిన ప్రదేశం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
ఈ మూవీ షూటింగ్ చెన్నైలోని ఓ ప్రముఖ ఫిలిం సిటీలో జరిగింది. అక్కడ గతంలోనూ పలు ప్రమాదాలు జరిగాయి. రజనీకాంత్ నటించిన కాలా చిత్రంలోని కొన్ని సన్నివేశాల షూటింగ్ అక్కడే జరగగా.. ఆ సమయంలో విద్యుత్ షాక్ కొట్టి మైఖేష్ అనే ఓ టెక్నీషియన్ మృతి చెందారు. ఇక విజయ్ నటించిన బిగిల్ మూవీ షూటింగ్ కూడా కొంత భాగం అక్కడే జరగ్గా.. 100 అడుగుల క్రేన్ నుంచి ఫోకస్ లైట్ పడటంతో సెల్వరాజ్ అనే ఓ ఎలక్ట్రీషియన్ అక్కడికక్కడే మరణించారు. అంతేకాదు తమిళ బిగ్‌బాస్ రెండో సీజన్ షూటింగ్ కూడా అక్కడే జరిగింది. ఆ సమయంలో ఏసీ మెకానిక్ కన్నుమూశారు. ఇలా వరుసగా ఆ ప్రదేశంలో ప్రమాదాలు జరుగుతుండటం.. కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
Read This Story Also:క్రేన్ ప్రమాదంపై స్పందించిన కమల్..