Tollywood: సౌందర్య వాళ్ల అన్నను పెళ్లి చేసుకోమని ఆమె తండ్రి అడిగారు.. సినిమాలో నటిస్తానని చెప్తే ఏమన్నారంటే.. టాలీవుడ్ హీరోయిన్..
టాలీవుడ్ హీరోయిన్ ఆమని ప్రస్తుతం సీరియల్స్ ద్వారా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే టాలీవుడ్ టాప్ హీరోయిన్ తండ్రి తనను కోడలిగా చేసుకోవాలని అనుకున్నారని.. అదే విషయాన్ని తనతోనూ చెప్పారని గుర్తు చేసుకున్నారు.

హీరోయిన్ ఆమని దివంగత నటి సౌందర్యతో, ఆమె కుటుంబంతో తనకున్న బలమైన అనుబంధాన్ని ఒక ఇంటర్వ్యూలో వివరించారు. సౌందర్య కుటుంబం వచ్చినప్పుడు వారితోనే ఎక్కువగా గడిపేదానినని, షాట్ పూర్తవగానే వారి పక్కన కూర్చునేదానినని ఆమని తెలిపారు. తాను సౌందర్య కుటుంబంలో ఒకరిలా కలిసిపోయేదానినని, అవుట్ డోర్ షూటింగ్స్ కు వెళ్ళినప్పుడు సౌందర్య రూమ్ లోనే ఆమె పక్కనే పడుకునేదానినని గుర్తుచేసుకున్నారు. డిన్నర్, లంచ్ కలిసి చేసేవారని చెప్పారు. సౌందర్య తండ్రి గారిని తాను కూడా అప్పాజీ అని పిలిచేదానినని ఆమని వెల్లడించారు. సౌందర్య తండ్రి ఒకసారి తనను కోడలిగా చేసుకోమని, తన కొడుకు అమర్ కు ఇచ్చి పెళ్లి చేయమని అడిగారని ఆమని తెలిపారు. అప్పుడు తాను సరదాగా అడుగుతున్నారేమో అనుకున్నానని, “సార్, నేను హీరోయిన్ ను కదా, సినిమాదే దాన్ని. నన్ను ఎలా చేసుకుంటారు?” అని అడిగానని, దానికి ఆయన “మా అమ్మాయి కూడా సినిమా లోనే ఉంది కదమ్మా, తప్పేముంది?” అని అన్నారని వివరించారు. ఆ సమయంలో ప్రముఖ నటి శకుంతల కూడా పక్కనే ఉన్నారని ఆమని తెలిపారు. అయితే, సౌందర్యతో ఈ విషయంపై తాను ఎప్పుడూ చర్చించలేదని చెప్పారు.
తర్వాత సౌందర్య మరణానంతరం, ఒకసారి శకుంతల గారిని కలిసినప్పుడు, ఆమె “నిన్ను సౌందర్య వాళ్ళ నాన్నగారు అడిగారు కదా” అని గుర్తు చేశారని, దానికి తాను “అమ్మ, నేను పక్కనే ఉన్నాను కదా, ఎలా మర్చిపోతాను. ఒకవేళ చేసుకుని ఉంటే నేను కూడా ఫ్లైట్లో పోయేదాన్నేనేమో” అని అన్నానని ఆమని వివరించారు. ఆ మాటలకు శకుంతల “ఎందుకు అలా అనుకుంటావు, నీ మాంగల్య బలం గట్టిగా ఉంటే తను బతికే ఉండేవాడేమో” అని అన్నారని తెలిపారు.
సౌందర్య తండ్రి మరణించినప్పుడు సౌందర్య తనకు ఫోన్ చేసి, “నాన్నగారు పోయారు, రావే” అని చాలా ఏడ్చిందని, “మేము అమ్మ, నేను, అన్నయ్య, నాన్న నాలుగు పిల్లర్స్. ఇప్పుడు ఒక పిల్లర్ పోయింది” అని చెప్పిందని ఆమని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తాను కూడా షూట్ లో బిజీగా ఉండటం వల్ల వెళ్ళలేకపోయానని తెలిపారు. సౌందర్య తన వ్యక్తిగత విషయాలు అన్నీ తనతో పంచుకునేదని, తన పర్సనల్ విషయాలు తాను సౌందర్యతో చెప్పుకునేదానినని ఆమని వివరించారు. బెంగళూరు వెళ్ళినప్పుడు, సౌందర్య ఫ్రీగా ఉంటే ఇంటికి రమ్మనేదని, కానీ సమయం కుదిరేది కాదని చెప్పారు. సౌందర్య తన తండ్రి మరణానంతరం సొంతంగా ఒక ఆర్ట్ ఫిలిం తీసిందని, దాని కోసం హాసన, సోమనాథ్‌పూర్ వంటి ప్రదేశాలలో షూటింగ్ చేశారని ఆమని తెలిపారు. సౌందర్య నిర్ణయాలన్నీ తన తండ్రి, ఆ తర్వాత తన సోదరుడు అమర్ తీసుకునేవారని, సౌందర్య ఒక చిన్నపిల్లలా ఇంట్లో చెప్పిన మాట వినేదని ఆమని అన్నారు. సౌందర్య మరణించిన తర్వాత, దాదాపు ఒక నెల తర్వాత తాను వారి ఇంటికి వెళ్ళానని, అప్పుడు ప్రవేశ ద్వారం వద్దే సౌందర్య, ఆమె తండ్రి, ఆమె సోదరుడు అమర్ ల పెద్ద ఫోటోలు చూసి చాలా బాధ పడ్డానని ఆమని వెల్లడించారు. సౌందర్య తల్లి పాపం ఒంటరిగా కూర్చొని ఉండటం చూసి “కన్నతల్లి కదా, భర్త, ఇద్దరు పిల్లలు పోయారు. ఈవిడ ఎలా భరిస్తుంది” అని తనకు చాలా బాధ కలిగిందని ఆమని అన్నారు. సౌందర్య తన జీవితంలో చాలా ఆస్తులు సంపాదించిందని, కానీ వాటిని అనుభవించలేకపోయిందని ఆమని విచారం వ్యక్తం చేశారు. బెంగళూరులో ఆమె ఎంతో ఇష్టపడి కట్టుకున్న పెద్ద ఇల్లు ఇప్పుడు దెయ్యాల కొంపలా ఉందని, దానిని చూస్తే బాధేస్తుందని ఆమని అన్నారు. సౌందర్య నటిగా వంద సినిమాలు పూర్తి చేసుకున్నదని, చాలా మంచి ఆర్టిస్ట్ అని, చాలా అందంగా ఉండేదని, ఆమెకు దురదృష్టం పట్టిందని ఆమని వాపోయారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : బాబోయ్.. నెట్టింట గత్తరలేపుతున్న దండుపాళ్యం బ్యూటీ.. ఆమె ఇన్ స్టా చూస్తే..
సౌందర్య, ఆమని..

Soundarya, Aamani
ఎక్కువ మంది చదివినవి : Serial Song : పేరుకే సీరియల్ సాంగ్.. కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసిన పాట ఇది.. ఇప్పటికీ యూట్యూబ్లో తగ్గని డిమాండ్..
