West Bengal Election 2021: ప్రధాని ఫొటోలను 72 గంటల్లో తొలగించండి.. ఎన్నికల సంఘం ఆదేశాలు.. ఎందుకంటే..?
PM Narendra Modi Hoardings: పశ్చిమ బెంగాల్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఎనిమిది విడతల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో..
PM Narendra Modi Hoardings: పశ్చిమ బెంగాల్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఎనిమిది విడతల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోలను కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రకటనలకు సంబంధించిన హోర్డింగ్‌ల నుంచి తొలగించాలని భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 72 గంటల్లో హోర్డింగ్‌ల నుంచి ప్రధాని మోదీ ఫొటోలను తొలగించాలంటూ.. పెట్రోల్ పంప్ డీలర్లతో పాటు, ఇతర ఏజెన్సీలను ఆదేశిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. హోర్డింగ్‌లల్లో, తదితర ప్రదేశాల్లో ప్రధానమంత్రి ఫొటోను ఉపయోగించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (model code of conduct) ఉల్లంఘించడమేనని పశ్చిమ బెంగాల్ ముఖ్య ఎన్నికల అధికారి పేర్కొన్నారు. వాటిని మూడు రోజుల్లో తొలగించాలంటూ ఉత్తర్వులు జారీ చేశఆరు.
ఈ విషయానికి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం ఎన్నికల అధికారులను కలిసింది. వివిధ కేంద్ర పథకాలు, హోర్డింగ్‌లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోల వినియోగంపై టీఎంసీ నేతలు అభ్యంతరం వ్యక్తంచేశారు. అయితే.. గత నెల 26న రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. కోడ్ అమలులో ఉన్నా.. హోర్డింగ్‌లలో ప్రధాని ఫొటోలు ఉండడంపై టీఎంసీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో 8 విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడత ఎన్నికలు మార్చి 27న.. చివరి విడుత ఏప్రిల్ 29న జరుగనున్నాయి.
పోలింగ్ తేదీలు: తొలి విడత: మార్చి 27 రెండో విడత: ఏప్రిల్ 1 మూడో విడత: ఏప్రిల్ 6 నాలుగో విడత: ఏప్రిల్ 10 ఐదో విడత: ఏప్రిల్ 17 ఆరో విడత: ఏప్రిల్ 22 ఏడో విడత: ఏప్రిల్ 26 ఎనిమిదో విడత: ఏప్రిల్ 29
Also Read: