UP Elections: చేతికి సంకెళ్లు.. మెడలో గిన్నె.. ఓట్లు అడుగుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి.. ఎందుకో తెలుసా?
బ్యాంగిల్స్ నగరం, ఫిరోజాబాద్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాందాస్ మానవ్ తనను తాను సంకెళ్లతో బంధించుకున్నారు. అతని చేతిలో గిన్నెతో ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ.. ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తూనే ఎన్నికల ఖర్చుల కోసం నోట్లను అడుక్కుంటున్నారు.

Uttar Pradesh Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Polling) తేదీలు సమీపిస్తున్నందున, అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల సంఘం కళ్ల నుంచి తప్పించుకుని కొందరు అభ్యర్థులు నీళ్లలా డబ్బులు కుమ్మరిస్తుండగా.. ప్రజల నుంచి ఓట్లతో పాటు నోట్లు కూడా డిమాండ్ చేస్తున్న అభ్యర్థి కూడా ఉన్నారు. ఈ అభ్యర్థి పేరు రాందాస్ మానవ్(Ramdas Manav), అతను బ్యాంగిల్స్ నగరం, ఫిరోజాబాద్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రాందాస్ మానవ్ తనను తాను సంకెళ్లతో బంధించుకున్నారు. అతని చేతిలో గిన్నెతో ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ.. ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తూనే ఎన్నికల ఖర్చుల కోసం నోట్లను అడుక్కుంటున్నారు. ఫిరోజాబాద్(Firozabad) నియోజకవర్గం నుంచి రాందాస్ మానవ్ ప్రచారం చేసిన తీరు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో మూడో దశలో ఫిబ్రవరి 20న పోలింగ్ జరుగనుంది. దీంతో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే, ఫిరోజాబాద్‌లో గాజుల తయారీ కార్మికుల ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చేతికి కంకణం కట్టుకునే బ్యాంగిల్స్ కార్మికుల బాధను చూసి తమ నాయకుడు రాందాస్ మానవ్ ఈసారి ఎన్నికల బరిలోకి దిగారు. ఇక్కడి కార్మికులు దోపిడీకి గురవుతున్నారని రాందాస్ మానవ్ ఆరోపిస్తున్నారు. కార్మికుల పరిస్థితి మరీ దారుణం. కార్మికుల స్థితిగతులను మెరుగుపరిచేందుకే తాను ఎన్నికల బరిలోకి దిగాల్సి వచ్చిందన్నారు.
తనను సంకెళ్లతో బంధించడమేంటన్న ప్రశ్నపై రాందాస్ మానవ్ మాట్లాడుతూ.. ఫ్యాక్టరీలు కార్మికులను సంకెళ్లలో బంధించాయని ఆయన అన్నారు. కార్మికులకు స్వేచ్ఛనివ్వడమే వారి లక్ష్యం. కార్మికులను ఎలా జైల్లో బంధిస్తున్నారో తనకు తానే సంకెళ్లు వేసి చూపించాలన్నారు. కార్మికులకు విముక్తి కల్పించడంలో విజయం సాధించినప్పుడే ఈ సంకెళ్లను తెరుస్తానని రాందాస్ చెప్పారు. అదే సమయంలో, చేతిలో గిన్నె అనే ప్రశ్నపై, రాందాస్ మానవ్ మాట్లాడుతూ, తాను ఖచ్చితంగా కార్మికుల నాయకుడిని అని, అయితే వారి కోసం ఎన్నికల్లో పోటీ చేయడానికి తన వద్ద తగినంత డబ్బు లేదని చెప్పారు. అందుకని బలవంతంగా గిన్నెని చేతిలోకి తీసుకోవలసి వచ్చిందన్నారు. ఎన్నికల్లో గెలవాలని కార్యకర్తల వద్దకు వెళ్లి ఓట్లతో పాటు నోట్లను కూడా అడుక్కుంటున్నట్లు తెలిపారు. కార్మికుల నుంచి తీసుకున్న నోట్లకు బదులు వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు చట్టసభలో పోరాడుతానన్నారు.