AP SSC Exams: విద్యార్థులకు అలెర్ట్.. పదో తరగతి పరీక్ష ఉందా లేదా.. కీలక ప్రకటన చేసిన విద్యాశాఖ..
ఏపీలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. మంగళవారం సోషల్ స్టడీస్ పరీక్షపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మొద్దని కోరారు. దీనిపై ఓ పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఈ సమాచారాన్ని చేరవేయాలని కోరారు. పరీక్షలపై ఎలాంటి వదంతులను నమ్మొద్దని ప్రశాంతంగా పరీక్ష్ పూర్తి చేయాలని విద్యార్థులకు సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం (01.04.2025) సోషల్ స్టడీస్ పరీక్ష యథావిధిగా నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ విజయ్ రామరాజు.వి. ఐఏఎస్, ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుందన్నారు. దీంతో పరీక్ష నిర్వహణకు సంబంధించిన అందరూ అధికారులు ఎలాంటి అపోహలు లేకుండా పరీక్ష సజావుగా నిర్వహించాలని సూచించారు. ఈ విషయాన్ని ఆర్జేడీలు, జిల్లా విద్యాశాఖాధికారులు, సంబంధిత అధికారులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తెలపాలని కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదట ఈ పరీక్షలు మార్చి 17 నుంచి 31 వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ, రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో, ఆ రోజు జరగాల్సిన సోషల్ స్టడీస్ పరీక్షను ఏప్రిల్ 1కి వాయిదా వేశారు విద్యాధికారులు.
అయితే, మంగళవారం నిర్వహించాల్సిన పరీక్షపై సందేహాలు తలెత్తాయి. సోషల్ మీడియాలో ఈ విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఏపీ సర్కార్ మంగళవారాన్ని ఆప్షనల్ సెలవుగా ప్రకటించడం. పరీక్షల సమయంలో ఆప్షనల్ హాలిడే ఇవ్వడంతో, ఆ రోజు పరీక్ష జరుగుతుందా లేదా అనే అయోమయం విద్యార్థుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. ఆప్షనల్ హాలిడేకు పరీక్షలకు ఎలాంటి సంబంధం లేదని, దాని వల్ల పరీక్ష వాయిదా వేయడంలాంటిది ఏమీ లేదని విద్యార్థులంతా పరీక్షకు హాజరు కావాలని తెలిపారు.