తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది..? ఉత్కంఠభరితంగా సాగిన ప్రచార పర్వం ముగిసింది. మంగళవారం 234 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌కు ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. గెలుపుపై ధీమాతో ఉన్నారు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్. అన్నాడీఎంకే బీజేపీ అండతో ఎన్ని కుట్రలు చేసినా తమదే గెలుపున్నారు.
ప్రచారం చివరిరోజు తాను పోటీ చేస్తున్న కొలత్తూరులో పాదయాత్ర చేశారు స్టాలిన్. ఆయనతో సెల్ఫీలు దిగడానికి యువత, చిన్నారులు పోటీ పడ్డారు. అయితే, ప్రచారం చివరిరోజు కూడా తమిళనాడులో చిత్ర విచిత్ర ఘటలను జరిగాయి. స్టాలిన్ సీఎం కావాలని డీఎంకే కార్యకర్త చేతి బొటనవేలిని కోసుకోవడం సంచలనం రేపింది.
విరుదునగర్ జిల్లాలో ఒళ్ళు జలదరించే విధంగా మొక్కు చెల్లించాడు డీఎంకే కార్యకర్త. డీఎంకే నేత స్టాలిన్ సీఎం అవ్వాలని చేతి వేళ్ళు నరికేసుకున్నాడు గురువయ్య. సాథుర్‌లోని మారియమ్మ ఆలయంలో స్టాలిన్ గెలుపొందాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన గురువయ్య… ఈ పిచ్చి పని చేశాడు. అమ్మవారికి తన చేతి వేళ్ళు నరికి కానుక ఇచ్చిన గురువయ్య తన సంకల్పం నెరవేతుందని అంటున్నాడు.
కమల్‌హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీ తరపున నటి సుహాసినితో పాటు ఆయన కూతురు అక్షర కూడా చివరి రోజు ప్రచారంలో పాల్గొన్నారు. టార్చ్‌లైట్ గుర్తును చూపిస్తూ కమల్ పార్టీని గెలిపించాలని డాన్స్ చేశారు. చెన్నైతో పాటు కోయంబత్తూరులో కూడా వీళ్లిద్దరు ప్రచారం చేశారు. అక్షరతో పాటు సుహాసిని కూడా అదిరేటి స్టెప్పులు వేశారు. తన బాబాయ్‌ను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు సుహాసిని.
మరోవైపు సీఎం పళనిస్వామి సేలంలో ప్రచారం చేశారు. అన్నాడీఎంకే విజయం ఖాయమన్నారు పళని. బోడినాయకర్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. మహిళలను అగౌరవపర్చిన డీఎంకేకు ఓటర్లు గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు.
తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో ఎన్‌డీఏ కూటమి విజయం సాధిస్తుందన్నారు బీజేపీ అధ్యక్షుడు నడ్డా. చెన్నైలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఆయన చివరిరోజు ప్రచారం చేశారు.