AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Stocks: బంగారమంటే మోజే మోజు.. తమిళనాడు ఎన్నికల్లో అంతా గోల్డు మయమే.. ఎవరిదగ్గరెంతంటే?

‘‘ నీ ఇల్లు బంగారం కాను.. నా వొళ్లు సింగారం కాను... ’’ ఓ సినీ పాటల రచయిత రాస్తే.. సినీ ప్రియులు తమ ఇల్లే అలా అవుతుందన్నంతగా సంబరపడిపోయారు. ఈ పాట వింటే భారతీయులకు బంగారం అంగే ఎంత ప్రియమో..

Gold Stocks: బంగారమంటే మోజే మోజు.. తమిళనాడు ఎన్నికల్లో అంతా గోల్డు మయమే.. ఎవరిదగ్గరెంతంటే?
Tamil Politics
Rajesh Sharma
|

Updated on: Mar 20, 2021 | 4:43 PM

Share

Gold Stocks among Tamil Politicians: భారత దేశం పేద దేశమో.. ధనిక దేశమో అర్థం కాని పరిస్థితి. దేశంలో సంపన్నులకు కొదవ లేదు. అదే సమయంలో పేద వారికి కొరత అస్సలే లేదు. కోటీశ్వరులు పదులు, వందల కోట్లకు పడగలెత్తుతూ ప్రపంచ ధనికుల సంపన్నుల్లో చేరుతుంటే.. పేద వాడు మరింత పేదవాడవుతున్న పరిస్థితి.. 135 కోట్ల జనాభాలో పేద వారి సంఖ్య ఏటా పెరిగిపోతున్న పరిస్థితి. మరి మన దేశం పేద దేశమా? ధనిక దేశమా? ఈ ప్రశ్నకు అంతేలేదు. అయితే.. దేశంలో కొందరి వద్ద పేరుకుపోయిన, పేరుకుపోతున్న బంగారం నిల్వలను చూస్తే మాత్రం సందప కొందరి చెంతకే చేరుతుందన్న వాదన బలపడక తప్పదు.

‘‘ నీ ఇల్లు బంగారం కాను.. నా వొళ్లు సింగారం కాను… ’’ ఓ సినీ పాటల రచయిత రాస్తే.. సినీ ప్రియులు తమ ఇల్లే అలా అవుతుందన్నంతగా సంబరపడిపోయారు. ఈ పాట వింటే భారతీయులకు బంగారం అంగే ఎంత ప్రియమో తెలిసిపోతుంది. మన దేశంలో మహిళలకు బంగారు ఆభరణాల మీద మోజు ఎక్కువే. ఏ పేరంటానికి వెళ్లినా బంగారు ఆభరణాలు ధరించడం వాళ్లకు అలవాటు.. కాదు కాదు చాలా ఇష్టం. ఎంత ఖరీదైన నగలు ధరిస్తే అంతటి గుర్తింపు లభిస్తుందన్న అభిప్రాయంతో చాలా మంది మహిళలు వుంటారు. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల సందర్భంగా ఒక్కొక్కరు వెల్లడిస్తున్న బంగారం నిల్వల గణాంకాలను గమనిస్తే.. నివ్వెర పోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆస్తులు మాములుగా లేవు. అందులోను వారి దగ్గర బంగారం నిల్వలను పరిశీలిస్తే మరింత షాక్ తగలక మానదు. ఎవరెవరి దగ్గర ఎంత బంగారం స్టాక్ ఉందో ఒక్కసారి చూద్దాం.

కుష్బూ…

సినీనటి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన ఖుష్బూ దగ్గర ఎనిమిదిన్నర కిలోల బంగారం ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరపున థౌజండ్‌ లైట్స్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఖుష్బూ. ఇటీవల నామినేషన్‌ దాఖలు చేశారు ఖుష్బూ. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలు ప్రకటించారామె. తనకు మొత్తం 40.96 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఇందులో రూ. 6.39 కోట్ల విలువైన చరాస్తులు. రూ.34.56 కోట్ల విలువైన స్థిరాస్తులు. వీటితో పాటు 8.5 కేజీల బంగారం, 78 కేజీల వెండి ఉన్నట్టు ప్రకటించారు. భర్త సుందర్ వద్ద 495 గ్రాముల బంగారం, 9 కిలోల వెండి ఉన్నట్లు ప్రకటించారు. 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఖుష్బూ వార్షిక ఆదాయం 1.50 కోట్ల రూపాయలు. పోయినేడు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు ఖుష్బూ.

హరినాడార్…

తమిళనాడులో ఓ బంగారు బాబు ఉన్నాడు. ఆయన పేరే హరి నాడార్. ఒంటి నిండా కిలోలకొద్దీ బంగారం ధరిస్తాడు. తమిళనాడులోని అళంగుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు హరినాడార్. నామినేషన్ దాఖలు చేసేందుకు తన ఒంటిమీద దాదాపు 5 కిలోల బంగారం ధరించి వచ్చాడు. ఆయన వద్ద మొత్తంగా 11.2 కేజీల బంగారం ఉంది. నామినేషన్ పత్రాల్లోను అదే విషయాన్ని ప్రస్తావించాడు హరినాడార్. బంగారంతో దుస్తులు కూడా కుట్టించుకున్న వాళ్లు తమిళనాడులో చాలా మందే ఉన్నారు.

బంగారు ఆభరణాలపై తమిళనాడు మాజీ సీఎం, పురుచ్చితలైవి జయలలిత మోజు గురించి అందరికీ తెలిసిందే. 2016 ఎన్నికల సమయంలో జయలలిత తన అఫిడవిట్లో పేర్కొన్నదాని ప్రకారం… అమెకు 21.283 కేజీల బంగారు ఆభరాణాలు, 1,250 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. అయితే అక్రమాస్తుల కేసులో అవన్నీ పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు వెల్లడించారామె అప్పట్లో. ఈ సందర్భంగా ఆమె మొత్తం ఆస్తుల విలువ 117 కోట్లుగా పేర్కొన్న జయలలిత.

అత్యంత ధనవంతుడు సుబ్బయ్య..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరిలో అత్యంత ధనవంతుడు అన్నాడీఎంకే అభ్యర్థి ఇసక్కి సుబ్బయ్య. ఆయన ఆస్తి అక్షరాల రూ. 246 కోట్లు. అన్నాడీఎంకే మాజీ మంత్రి ఇసక్కి సుబ్బయ్య 2011 ఎన్నికల్లో పోటీ చేశాడు. అప్పుడు ఆయన ఆస్తి విలువ రూ.60 కోట్లు. 2016 ఎన్నికల్లో సీటు దక్కలేదు సుబ్బయ్యకు. కానీ ఇప్పుడు తిరునల్వేలి జిల్లా అంబాసముద్రం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు సుబ్బయ్య.

సెకండ్ ప్లేస్… మోహన్ దే

చెన్నై అన్నానగర్‌లో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి ఎంకే మోహన్‌ అత్యంత ధనవవంతుల్లో రెండో స్థానంలో ఉన్నాడు. ఆయన ఆస్తి విలువ రూ.211 కోట్లుగా ప్రకటించాడు. నామినేషన్ల దాఖలు సమయంలో ఆయన ఇచ్చిన ఆస్తుల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాడు మోహన్. ఇక మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్‌ ఆస్తి రూ.177 కోట్లుగా ప్రకటించగా.. అదే పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్‌ ఆస్తి రూ.160 కోట్లుగా ఉంది. ఇక విపక్ష నేత, ప్రస్తుతం డీఎంకే కూటమి సీఎం క్యాండిడేట్ ఎం.కే.స్టాలిన్ ఆస్తుల విలువ 7.2 కోట్ల రూపాయలు. ఆయన భార్య దుర్గా స్టాలిన్ పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.1.7 కోట్లు. ఆ దంపతుల ఆస్తుల విలువ మొత్తం రూ. 8.89 కోట్లుగా నామినేషన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు స్టాలిన్. తమిళనాడు సిఎం పళనిస్వామి ఆస్తుల విలువ కేవలం రూ.47 లక్షలు మాత్రమే. ఆయన భార్య పేరిట 1.04 కోట్ల ఆస్తి ఉంది. గతంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి.. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా వున్న పన్నీర్ సెల్వం ఆస్తి విలువ రూ. 5.19 కోట్లు. 2001లో ఆయన ఆస్తి 17.44 లక్షలు మాత్రమే. అదంతా బోగస్ అని తాము సిఎం అయితే పన్నీర్ సెల్వం ఆస్తులపై విచారణ జరుపుతామని ఇప్పటికే స్టాలిన్ ప్రకటించిన విషయం ఇప్పుడు హాట్ టాపికైంది.

తాజా ఎన్నికల్లో పార్టీల బంగారు హామీలు

పెళ్లి సమయంలో ఇచ్చే బంగారు కానుకను 4 గ్రాముల నుంచి 8 గ్రాములకు పెంచుతామని అధికారిక ఏఐడిఎంకే ఇప్పటికే హామినివ్వగా… మహిళలు సహకార బ్యాంకుల్లో 5 సవర్ల వరకూ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల మాఫీ చేస్తామని డిఎంకే ప్రకటించింది. ఫలితంగా ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పర్వంలో అందరు బంగారం గురించే చర్చించుకుంటున్నారు.

ALSO READ: సంతోషమా నీ జాడేది? వెతుక్కుంటున్న భారతీయులు.. గ్లోబల్ ఇండెక్స్‌లో లోయెస్ట్