Nagarjunsagar By-Election: సాగర్ సెంటర్‌ అమీ తుమీ.. సర్వశక్తులొడ్డుతున్న ప్రధాన పార్టీలు

నాగార్జున సాగర్ అసెంబ్లీ సీటుకు జరుగుతున్న ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తమ సీటును నిలబెట్టుకునేందుకు…

  • Rajesh Sharma
  • Publish Date - 8:15 pm, Thu, 15 April 21
Nagarjunsagar By-Election: సాగర్ సెంటర్‌ అమీ తుమీ.. సర్వశక్తులొడ్డుతున్న ప్రధాన పార్టీలు
Nagarjuna Sagar Bypoll Elections

Nagarjunsagar By-Election interesting contest: నాగార్జున సాగర్ అసెంబ్లీ సీటుకు జరుగుతున్న ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తమ సీటును నిలబెట్టుకునేందుకు తీవ్రంగా యత్నిస్తుండగా.. కాంగ్రెస్ కురువృద్ధ నేత జానారెడ్డిని బరిలోకి దింపిన కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో పునర్వైభవాన్ని సాధించేందుకు సాగర్‌లో విజయం కీలకమవుతుందని భావిస్తోంది. ఇక దుబ్బాకలో సాధించిన విజయంతో దూకుడు మీదున్న బీజేపీ కూడా సాగర్‌లో గెలిచేందుకు శ్రమిస్తోంది. గురువారం సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడగా.. తెరచాటు వ్యవహారాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు వ్యూహం పన్నుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు భగత్‌కు టిక్కెట్ ఇస్తూనే ఎవరిలోను అసంతృప్తి లేకుండా జాగ్రత్త పడింది. నియోజకవర్గానికి చెందిన మరో నేతకు ఎమ్మెల్సీ ఇస్తానని ప్రకటించి అసంతృప్త నేతలు లేకుండా కేసీఆర్ జాగ్రత్త పడ్డారు. అదే సమయంలో పుంజుకుంటున్నట్లు కనిపిస్తున్న బీజేపీ నుంచి కీలక నేతలకు గులాబీ పార్టీ లాగేసింది.

ఇక కాంగ్రెస్ సీనియర్ నేత, సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేసిన కుందూరు జానారెడ్డి మరోసారి సాగర్ బరిలో నిలిచారు. 2014లో గెలిచిన జానారెడ్డి 2018 ఎన్నికల్లో నోముల నర్సింహయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. దాంతో ఇక జానారెడ్డి రాజకీయ జీవితం ముగిసిందని చాలా మంది అనుకున్నారు. ఒక దశలో ఆయన తన తనయుడిని రంగంలోకి దింపి.. తాను రాజకీయాలకు దూరమవుతారన్న ప్రచారం జరిగింది. తన తనయుడిని బీజేపీలోకి పంపుతారన్న ప్రచారమూ జరిగింది. అయితే.. అవన్నీ వదంతులేనని నిరూపిస్తూ తానే సాగర్ ఉప ఎన్నికల బరిలోకి దిగారు. దిగడమే కాదు.. గెలిచేందుకు తాను ఇంతకాలం జరిపిన ప్రచార తీరును కూడా మార్చుకుని మరీ యత్నిస్తున్నారు. గతంలో కేవలం రోడ్ షోలకు, పాదయాత్రలకు, సభలకు పరిమితమయ్యేవారు జానారెడ్డి. ప్రచారం ముగిసిన తర్వాత కీలక వర్గాలతో మంతనాలు జరిపి డైరెక్షన్ ఇస్తూ విజయం సాధించేవారాయన. కానీ ఈసారి పగలంతా ప్రచారం చేస్తూ.. రాత్రిళ్ళు కుల సంఘాలతోను, కీలక వ్యక్తులను తానే స్వయంగా కలుస్తూ ఈ ఉప ఎన్నిక తనకు, కాంగ్రెస్ పార్టీకి ఎంత కీలకమో వివరిస్తున్నారు జానారెడ్డి. దాంతో పాటు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలైన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, జగ్గారెడ్డిలను సాగర్ ఉప ఎన్నికలో విస్తృతంగా వినియోగించుకున్నారాయన.

ఇక దుబ్బాకలో విజయం సాధించిన ఉత్సాహంతో దూకుడు మీదున్న బీజేపీ.. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోను అదే తీరు ఫలితాలను రాబట్టుకుంది. అయితే.. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో చతికిలా పడింది భారతీయ జనతా పార్టీ. కానీ.. సాగర్ ఉప ఎన్నిక వచ్చే సరికి అన్ని స్థాయుల నాయక గణాన్ని ప్రచార పర్వంలోకి దింపింది బీజేపీ. స్టార్ అట్రాక్షన్ విజయశాంతితో విస్తృతంగా రోడ్ షోలు జరిపించారు కమలనాథులు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో ఫెరోషియస్ ప్రసంగాలతో సాగర్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే.. అభ్యర్థి ఎంపిక తర్వాత సాగర్ బీజేపీ టిక్కెట్ ఆశించిన వారిలో కొందరు అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరడం బీజేపీకి నెగెటివ్ పాయింట్‌గా కనిపిస్తోంది.

సాగర్ ఉప ఎన్నిక షెడ్యూలు ప్రకటనకు ముందే మండలాల వారీగా ఇంఛార్జీలను నియమించిన అధికార టీఆర్ఎస్ పార్టీ.. ఎక్కడా ఎవరికి ఛాన్స్ ఇవ్వని విధంగా వ్యూహరచనను అమలు చేసింది. మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిల సారథ్యంలో సాగర్ ఉప ఎన్నిక ప్రచార వ్యూహాన్ని పక్కాగా అమలు చేసింది గులాబీ పార్టీ. ఇదే క్రమంలో కరోనా ఆంక్షలను పక్కన పెట్టి మరీ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ సాగర్ నియోజకవర్గంలోని హాలియాలో బహిరంగ సభ నిర్వహించారు. ఎన్నికలు అనగానే ఆగమాగం కావద్దంటూ ఓటర్లకు సందేశమిచ్చారు. రాష్ట్రంలో కీలకంగా మారిన పోడు భూముల వివాద పరిష్కారాన్ని నాగార్జునసాగర్ నుంచే ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి హాలియా సభలో ప్రకటించారు. తద్వారా నియోజకవర్గంలో వున్న గిరిజనుల ఓట్లను గంపగుత్తగా పొందేందుకు ఆయన యత్నించారు. మొత్తమ్మీద సాగర్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసి.. సైలెంట్ క్యాంపెయిన్ ప్రారంభమైంది. దాంతో గ్రామాలు, వార్డుల వారీగా కింది స్థాయి నాయకులు ఓటర్లను ఇతరత్రా ప్రలోభ పెట్టేందుకు యత్నాలు ముమ్మరం చేశారు.

ALSO READ: తెలంగాణలో మరో ఓట్ల పండుగ.. కదనోత్సాహంతో రాజకీయ పార్టీలు

ALSO READ; జీఎస్టీకి జీరో దందా దెబ్బ.. ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.3500 కోట్ల ఎగవేత.. షాక్‌లో అధికారులు