సాగర్ ఉప పోరుకు సర్వం సిద్ధం.. పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.. సాయంత్రం 6గంటల తర్వాత కోవిడ్ రోగులకు అనుమతి

Sagar by election 2021:హోరాహోరీగా సాగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. శనివారం జరగనున్న ఉప ఎన్నికకు అధికారుల అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

  • Balaraju Goud
  • Publish Date - 4:58 pm, Fri, 16 April 21
సాగర్ ఉప పోరుకు సర్వం సిద్ధం.. పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.. సాయంత్రం 6గంటల తర్వాత కోవిడ్ రోగులకు అనుమతి
Nagarjunasagar By Election

Nagarjuna Sagar by election 2021: హోరాహోరీగా సాగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. శనివారం జరగనున్న ఉప ఎన్నికకు అధికారుల అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,09,228 మంది, మహిళలు 1,11,072 మంది ఉన్నారు. ఇందుకోసం మొత్తం 346 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 5వేల 535 మంది సిబ్బందిని నియమించారు.

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రంలో ఓటేయడానికి వచ్చి క్యూలైన్లలో నిల్చునే ఓటర్లకు ఎండ తగలకుండా షామియానాలు ఏర్పాటు చేశారు. ఓటేయడానికి ఓటర్లు ఒకేసారి కాకుండా విడతల వారీగా వచ్చి ఓటేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పోలింగ్‌ కేంద్రంలోకి ఓటేయడానికి వచ్చే ఓటరుకు ఈవీఎంలపై గుర్తును నొక్కడానికి ప్రత్యేకమైన గ్లవ్స్‌‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. వాటితోనే ఈవీఎంలలో ఉన్న అభ్యర్థి గుర్తుపై నొక్కాల్సి ఉంటుంది. ఎన్నికల సిబ్బంది తప్పకుండా మాస్క్‌ ధరించాలి. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో శానిటైజర్లతో పాటు ఇద్దరు ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 8వేల151కు గానూ 1,433 మంది ఓట్లు వేశారు. కోవిడ్ పేషెంట్లకు సాయంత్రం 6 గంటల తర్వాత ఓటేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్ని్కల అధికారులు తెలిపారు. ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. కాగా, ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు 45 లక్షల నగదు, 46 లక్షల విలువ చేసే లిక్కర్​ సీజ్​ చేశారు. ఇందుకు సంబంధించి 362 మందిపై వివిధ కేసులు నమోదు చేసినట్లు పోలీస్​ఉన్నతాధికారులు వెల్లడించారు. మరోవైపు ఉప ఎన్నిక పోలింగ్ సందర్బంగా నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించారు.

ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. 346 పోలింగ్ కేంద్రాల్లో 108 సమస్యాత్మకంగా కేంద్రాలుగా పోలీస్ అధికారులు గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలింగ్ కేంద్రాలపై అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ కోసం మూడు వేల మంది పోలీసు సిబ్బందిని నియమించారు. వీటికి తోడు మూడు కంపెనీల కేంద్ర బలగాలను కూడా వినియోగిస్తున్నామని డీఐజీ రంగనాథ్ తెలిపారు. పోలింగ్ సందర్భంగా హింస చెలరేగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా స్ట్రైకింగ్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద 10 మంది పోలీసు సిబ్బందిని భద్రత ఏర్పాటు చేశామన్నారు.

Read Also…  Indiana: ఇండియానాలో కాల్పుల కలకలం.. ఆగంతకుని కాల్పుల్లో 8 మంది మృతి!