AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Elections: క్లయిమాక్స్‌కు చేరిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తంతు.. పదిన పడనున్న శుభంకార్డు!

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ఆఖరు దశకు చేరుకుంది. చివరి దశ పోలింగ్‌తో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగుస్తుంది.. గురువారం వెలువడే ఫలితాల కోసం యావత్‌ భారతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Assembly Elections: క్లయిమాక్స్‌కు చేరిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తంతు.. పదిన పడనున్న శుభంకార్డు!
Up Elections
Balu
| Edited By: Balaraju Goud|

Updated on: Mar 07, 2022 | 1:42 PM

Share

Assembly Elections 2022: ఉత్తరప్రదేశ్‌(Uttar  Pradesh) అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ఆఖరు దశకు చేరుకుంది. చివరి దశ పోలింగ్‌తో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగుస్తుంది.. గురువారం వెలువడే ఫలితాల కోసం యావత్‌ భారతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆ ఉత్కంఠకు కారణం ఈ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌లాంటివి కాబట్టి. భారతీయ జనతాపార్టీ(BJP)కి ఇవి అత్యంత కీలక పరీక్షగా నిలుస్తున్నాయి కాబట్టి.. అయిదు రాష్ట్రాలలో అధికారం తమదేనని బీజేపీ ఎంత గట్టిగా చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలతో బీజేపీ బలం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. జాతీయ రాజకీయాలపై పట్టు బిగించాలంటే ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో విజయం సాధించడం అత్యంత అవసరం. రానున్న రాజ్యసభ(Rajya Sabha), రాష్ట్రపతి ఎన్నికల్లో(President Election) ఈ విజయం ప్రభావం తప్పకుండా ఉంటుంది. అందుకే బీజేపీ వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.

ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఆయా రాష్ట్రాలలో పట్టు నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది. పంజాబ్‌లోనూ గెలిచి తీరుతాం అని ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాలు చెబుతున్నారు కానీ, అది అంత సులభం కాదని అందరికీ తెలుసు. నిజానికి స్థానిక కేబర్‌ కూడా పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కనీసం నాలుగు రాష్ట్రాలలో విజయం సాధించకపోతే మాత్రం జాతీయ రాజకీయాలలో బీజేపీ పట్టు సడలుతోందని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ బీజేపీ అంచనాలు తలకిందులు అయితే మాత్రం ప్రమాద ఘంటికలు మోగినట్టే.. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అందుకు కారణం ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజే! అయితే ఆ తర్వాత వివిధ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అంతగా విజయాలను సాధించలేకపోయింది. అందుకే ప్రస్తుత అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరికీ అంత ఆసక్తి.

ఈ సంవత్సరం రాజ్యసభలో 73 ఖాళీలు ఏర్పడబోతున్నాయి. ఏప్రిల్‌లో కొందరు సభ్యుల పదవీకాలం ముగియనుంది. అలాగే జూన్‌లో మరికొందరి సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. జులైలో జరగాల్సిన రాష్ట్రపతి ఎన్నికల కంటే ముందుగానే రాజ్యసభ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. వీటిల్లో ఉత్తరప్రదేశ్‌ నుంచి 11, పంజాబ్‌ నుంచి ఏడు, ఉత్తరాఖండ్‌ నుంచి ఒక స్థానం, అంటే మొత్తంగా 19 స్థానాలకు ఈ మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికలు జరిపించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన స్థానాలన్నీ ఎన్టీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనే ఖాళీ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపోటముల ప్రభావం కచ్చితంగా రాజ్యసభ ఎన్నికలపై ఉంటుంది.

రాజ్యసభ ఎన్నికలతో పాటు రాష్ట్రపతి ఎన్నికపై కూడా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపబోతున్నాయి. ఈ ఏడాది జులైతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ముగుస్తుంది. కొత్త రాష్ట్రపతిగా బీజేపీ అభ్యర్థి ఎన్నిక అవ్వాలంటే మాత్రం ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలలో ఆ పార్టీకి తప్పనిసరిగా మెజారిటీ వచ్చి తీరాలి. పార్లమెంట్ సభ్యులు, వివిధ రాష్ట్రాల శాసనసభ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లో జనాభా ఎక్కువ కాబట్టి ఎలక్టోరల్‌ కాలేజీలో యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ ఎక్కువ. అంటే అతి పెద్ద రాష్ట్రమైన యూపీ రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకపాత్ర పోషించబోతున్నదన్నమాట! ఇక్కడి ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉంది. యూపీ అసెంబ్లీలో మొత్తం 403 మంది ఎమ్మెల్యులు ఉన్నారు కాబట్టి వీరి మొత్తం ఓటు విలువ 83,824 అవుతుంది. పంజాబ్‌లో ఎమ్మెల్యే ఓటు విలువ 116గా ఉంది. మొత్తం శాసనసభ్యులు 117 మంది. అంటే పంజాబ్‌లో ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువ 13,572 అవుతుంది.

ఉత్తరాఖండ్‌లో ఎమ్మెల్యే ఓటు విలువ 64. ఉన్న ఎమ్మెల్యేలు 70 మంది. అంటే మొత్తం ఓటు విలువ 4.480 కానుంది. గోవాలో ఎమ్మెల్యే ఓటు విలువ 20. ఉన్న ఎమ్మెల్యేలు 40 మంది. అంటే టోటల్‌ 800. మణిపూర్‌లో ఎమ్మెల్యే ఓటు విలువ పద్దెనిమిదే! అసెంబ్లీ సభ్యుల సంఖ్య 60. అంటే మొత్తం విలువ 1,080 అవుతుంది. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, జార్ఖండ్‌, ఢిల్లీ, చత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో ప్రాంతీయ పార్టీలు, బీజేపీ వ్యతిరేక జాతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంతకు ముందు రామ్‌నాథ్‌ కోవింగ్‌కు మద్దతు ఇచ్చారేమో కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. బీజేపీ అంటేచాలు టీఆర్‌ఎస్‌ అంతెత్తున మండిపడుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏ స్టాండ్‌ తీసుకుంటారో తెలియదు. ఒడిషా పరిస్థితి కూడా అంతే. రెండోసారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత శివసేన, అకాలీదళ్‌ వంటి పార్టీలు ఎన్డీయే నుంచి బయటకు వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాస్త్రపతి అభ్యర్థిని గెలిపించుకోవాలంటే బీజేపీకి కొత్త మిత్రులు ఎంతో అవసరం.

పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, కేరళ, జార్ఖండ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, బీజేపీ వ్యతిరేక జాతీయ పార్టీలు అధికారంలో ఉండటంతో అందరూ కలసికట్టుగా రాష్ట్రపతి అభ్యర్థిని బరిలోకి దించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఎన్నికలయ్యే రాష్ట్రాల నుంచి రాజ్యసభకు కూడా ఈ సారి 19 మంది సభ్యులు ఎన్నికవుతారు. వారు కూడా రాష్ట్రపతి ఓటింగ్‌లో పాల్గొంటారు. అందుకే ఈసారి ఎన్నికలు బీజేపీకి గట్టి సవాల్‌గానే మారాయి. టీఆర్‌ఎస్‌ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలనుకుంటోంది. పార్టీ అధినేత కేసీఆర్‌ విపక్ష నేతలను కలుస్తున్నారు. వారి మద్దతు కోరుతున్నారు. బీజేపీయేతర పార్టీలు ఉమ్మడిగా ఓ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంది. ఎన్టీయేలో చీలక తెచ్చేందుకు బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలనుకుంటున్నాయి. అయితే నితీశ్‌ ఇందుకు అంగీకరిస్తారా అన్నది మాత్రం అనుమానమే! మొత్తంగా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అటు బీజేపీకి, ఇటు బీజేపీయేతర పార్టీలకు చాలా కీలకంగా మారాయి.

Read Also….

సరిహద్దులో పాక్ డ్రోన్ కలకలం.. సంచిలో నిషేధిత వస్తువులు.. అధికారులు అప్రమత్తం