Andhra Pradesh: గ్రామ పెద్దల నిర్వాకం.. పంచాయతీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదని కుటుంబం వెలివేత!
పంచాయతీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదని.. కుటుంబాన్ని వెలి వేశారు గ్రామపెద్దలు. కుల సంఘం చెప్పినా వాళ్లకి సపోర్ట్ చేయలేదని గ్రామం నుండి బహిష్కరించారు.
Family Evicted in West Godavari District: శాస్త్రీయంగా ఎంతో అభివృద్ధి చెందాం.. నేరాలకు పాల్పడితే సాంకేతికంగా ఛేదించి శిక్షలు విధిస్తున్న కాలం.. అయినప్పటికీ అక్కడక్కడ అనాగరికపు పద్దతులు, ఒంటెద్దు పోకడలు, గ్రామ పెద్దల దాష్టీకాలు బయటపడతూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదని.. కుటుంబాన్ని వెలి వేశారు గ్రామపెద్దలు. కుల సంఘం చెప్పినా వాళ్లకి సపోర్ట్ చేయలేదని గ్రామం నుండి బహిష్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా అకివీడు మండలం చినమిల్లిపాడులో ఈ వెలి ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
చినమిల్లిపాడు గ్రామంలో గడిచిన పంచాయతీ ఎన్నికల్లో బల్లే నాగేశ్వరరావు కుటుంబంకు మద్దతు ఇవ్వలేదని..నాగేశ్వరరావు కుటుంబాన్ని వెలి వేశారు కుల పెద్దలు. తమ కులానికి చెందిన సర్పంచ్‌కు కాకుండా.. వేరే వర్గానికి చెందిన వ్యక్తి పని చేశామనే కక్ష్యతో వెలి వేయడం జరిగిందంటున్నారు బాధిత కుటుంబం. దీంతో తమ బంధువులు సైతం తమ ఇంటి వైపు చూటడం లేదని, శుభకార్యాలకు కూడా పిలవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని.. ఆకివీడు ఎమ్మార్వో గురుమార్తికి ఫిర్యాదు చేశారు బాధితులు. వెలి ఘటనపై స్థానిక ఎస్‌ఐ కిరణ్ కుమార్ విచారణ చేపట్టారు. బాధ్యులైనవారిపై కఠినచర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.