Gujarat drug: ప్రకంపనలు సృష్టిస్తున్న గుజరాత్ డ్రగ్స్ కేసు.. డీఆర్‌ఐ వర్గాల దర్యాప్తులో వెలుగులోకి సంచలనాలు.. రంగంలో ఎన్‌ఐఏ
గుజరాత్ డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. లింకులు ఎక్కడెక్కడో బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన సోదాల్లో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు.
Gujarat drug to NIA: గుజరాత్ డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. లింకులు ఎక్కడెక్కడో బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన సోదాల్లో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. వేల కోట్ల విలువైన డ్రగ్స్ దందా వెనుక ఎవరున్నారు ? సూత్రధారులు ఎవరు ? పాత్రధారులు ఎవరు ? అన్నదానిపై ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఎంక్వేరి చేయగా, తాజా జాతీయ నిఘా సంస్థ(NIA) రంగంలోకి దిగింది.
గుజరాత్ ముంద్రా పోర్టులో డ్రగ్స్ వ్యవహారం డీఆర్ఐ అధికారులు బయటపెట్టారు. ఈనెల 13న గుజరాత్ ముంద్రా పోర్టులో రెండు కంటైనర్లలో డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు డీఆర్‌ఐ అధికారులు. 2,988 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ని అఫ్గనిస్తాన్ నుంచి ఇరాన్ మీదుగా భారత్‌కు తరలించినట్టు అధికారులు గుర్తించారు. టాల్క్‌స్టోన్స్, టాల్కం పౌడర్‌గా పేర్కొంటూ డ్రగ్స్‌ని భారత్‌కు రవాణా చేశారు. అయితే డీఆర్‌ఐ విచారణలో నార్కోటిక్ డ్రగ్ హెరాయిన్‌గా నిర్థారించారు. భారీ ఎత్తన డ్రగ్స్ పట్టుబడటంతో ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేపట్టింది డీఆర్‌ఐ. న్యూఢిల్లీ, నోయిడా, చెన్నై, కోయంబత్తూరు, అహ్మదాబాద్, మాండ్వి, గాంధీధామ్, విజయవాడ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఢిల్లీలో 16.1 కేజీల హెరాయిన్, నోయిడాలోని నివాస ప్రాంతాల్లో 10.2 కేజీల కొకైన్, 11 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు అఫ్గనిస్తాన్ దేశస్తులు, ఒక ఉబ్జెకిస్తా్‌న్ దేశస్తుడితో పాటు మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు డీఆర్‌ఐ అధికారులు. అరెస్టయిన ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ లైసెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే, కేసును సీరియస్‌గా తీసుకున్న భారత రక్షణ సంస్థ దర్యాప్తు ముమ్మరం చేసింది. ముందుగా మనీలాండరింగ్ కోణంలో రంగంలోకి దిగిన ఈడీకి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఉగ్రవాదం కోణంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దృష్టి పెట్టి దర్యాప్తు ప్రారంభించింది. దీంతో డ్రగ్స్ అమ్మకం ద్వారా వచ్చే డబ్బుతో మారణాయుధాలు కొనుగోలు చేసేందుకు ఉగ్రవాదులు వినియోగిస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తర్వాత అఫ్ఘాన్ నుంచి వచ్చే సరుకుపై గట్టి నిఘా పెట్టాలని నిర్ణయించాయి. సరకు రవాణా ముసుగులో మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్న ఉగ్రవాదులు.. అయుధం పట్టకుండానే యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాద కోణం ఉన్నందున రంగంలోకి దిగింది ఎన్ఐఏ. డ్రగ్స్ దందా వెనుక ఎవరున్నారు ? సూత్రధారులు ఎవరు ? పాత్రధారులు ఎవరు ? అనేది తేల్చే పనిలో పడింది.
మరోవైపు ఆషి ట్రేడింగ్ కంపెనీ యాజమాన్యం డీఆర్‌ఐ కస్టడీలో ఉన్నారు. చెన్నైలో ఎం సుధాకర్, జి దుర్గాపూర్ణ, వైశాలిని అరెస్ట్ చేశారు. వీరిని గుజరాత్‌లోని భుజ్ కోర్టులో హాజరు పరిచారు. వీరిని 10 రోజుల పాటు డీఆర్‌ఐ కస్టడీకి అంగీకరించింది న్యాయస్థానం. తాజాగా ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది.
మరోవైపు, గుజరాత్ ముంద్రా ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డ హెరాయిన్‌తో రాష్ట్రానికి సంబంధాలు ఉన్నాయన్న వార్తల నేపధ్యలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ ఇచ్చారు. పెడ్లర్స్ విజయవాడను ట్రాన్స్‌పోర్ట్ అడ్రస్‌గా వాడుకున్నారే తప్పా.. దీనికి సంబంధించిన వ్యాపార కార్యకలపాలన్నీ చెన్నై కేంద్రంగా సాగుతున్నాయన్నారు. డ్రగ్స్ విషయంలో రాజకీయ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న డీజీపీ.. సీఎం ఆఫీసు పక్కన ఇదంతా జరిగిందని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. పట్టుబడిన హెరాయిన్ విషయంలో నేతలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. హెరాయిన్ ట్రాన్స్‌పోర్ట్‌పై కేంద్ర బృందాలు చేస్తున్న విచారణకు పూర్తి సహకారమందిస్తామన్నారు డీజీపీ.
ఇదిలావుంటే, డ్రగ్స్ సరఫరా కేసులో విజయవాడ కంపెనీపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఆ జీఎస్టీ కట్టినట్లు ఆధారాలు ఉన్నా ఆ కంపెనీ వ్యవహారాలపై ఎందుకు విచారణ చేయడం లేదో చెప్పాలన్నారు.
Read Also… India Warns Pakistan: పాకిస్తాన్ చెంప పగిలేలా భారత్ వార్నింగ్.. వెంటనే ఆ ప్రాంతాలు ఖాళీ చేయండి!