Crime Against Women: ఆందోళన కలిగిస్తున్న మృగాళ్ళ నేర ప్రవృత్తి.. కలవరపెడుతున్న అకృత్యాల లెక్కలు

ఆంధ్రప్రదేశ్‌లో అయితే మరింతగా ప్రేమ వేధింపుల కేసులు, నేరాలు పెరుగుతున్నాయి. అమ్మాయిలపై మృగాళ్ల ఆగడాలు శృతి మించుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ డిగ్రీ స్టూడెంట్‌ని చంపేసి కాల్వలో పడేశాడు ఓ యువకుడు.

Crime Against Women: ఆందోళన కలిగిస్తున్న మృగాళ్ళ నేర ప్రవృత్తి.. కలవరపెడుతున్న అకృత్యాల లెక్కలు
Rajesh Sharma

|

Feb 25, 2021 | 3:34 PM

Violence in the name of Love increasing in Telugu states: ఉత్తరాది రాష్ట్రాలను లవ్ జిహాదీ అంశం కుదిపేస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రేమ పేరిట దాడులు, మోసాలు, హింసాత్మక చర్యలు పెరిగిపోతున్నాయి. కొన్నాళ్ళు ప్రేమించడం లేదా వెంట పడడం ఆ తర్వాత ప్రేమ వికటించినా, తిరస్కారానికి గురైనా హింసాత్మక దాడులకు తెగబడడం పెరిగిపోతోంది.  తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ తరహాలో జరిగిన ఉదంతం తెలుగు రాష్ట్రాలకు కుదిపేసింది. మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు దిగాయి.

ఆంధ్రప్రదేశ్‌లో అయితే మరింతగా ప్రేమ వేధింపుల కేసులు, నేరాలు పెరుగుతున్నాయి. అమ్మాయిలపై మృగాళ్ల ఆగడాలు శృతి మించుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ డిగ్రీ స్టూడెంట్‌ని చంపేసి కాల్వలో పడేశాడు ఓ యువకుడు. నరసరావుపేటలో డిగ్రీ చదువుతున్న విద్యార్థినిని సహ విద్యార్థే అతి దారుణంగా హత్య చేశాడు. నమ్మకంగా తీసుకువెళ్లి గొంతు పిసికి చంపేసి కాల్వలో పడేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన ప్రేమోన్మాది విష్ణువర్దన్ రెడ్డి ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఈ హత్యోదంతాన్ని ఖండిస్తూ విద్యార్థులు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఇటీవలే తిరుపతిలో నడిరోడ్డు మీద ఓ యువతిని కత్తితో నరికి చంపాడు ఢిల్లీ బాబు అనే యువకుడు. ప్రేమించలేదనే కారణంతో వైజాగ్‌లో ఇటీవల ఓ యువతిని హతమార్చగా… ఇంకో యువతిపై మరో మృగాడు కత్తితో దాడి చేశాడు. బెజవాడలో ఓ యువతిని దారుణంగా హతమార్చాడు నాగేంద్ర బాబు. ఇలాంటి సంఘటనల్లో నిందితులకు కఠిన శిక్ష పడాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ నేపధ్యంలో ఏపీలో క్రైమ్ రేటును ఒక్కసారి పరిశీలిస్తే గణాంకాలు నివ్వెర పరుస్తున్నాయి.

ఈ తరహా ప్రేమోన్మాదులు హింసాత్మక సంఘటనలకు పాల్పడగా.. 2019లో 784 హత్యలు జరిగాయి. 2020లో వీటి సంఖ్య 731గా నమోదైంది. 2019లో 915 కిడ్నాపులు జరగ్గా.. 2020లో 721 కిడ్నాపులు చోటుచేసుకున్నాయి. 2019లో 1,629 హత్యాయత్నాలు జరిగాయి. 2020లో 1,269 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. బాధితులు తీవ్రంగా గాయపడిన కేసులు 2019లో 1,117 కాగా.. ఈ సంఖ్య 2020లో 902గా నమోదైంది.

ఇక మహిళలపై జరిగిన నేరాల లెక్కలను పరిశీలిస్తే.. 2019లో అత్యాచారం కేసులు 875 కాగా.. 2020లో 865గా రేప్ కేసులు నమోదయ్యాయి. ఇందులో నమ్మించి అత్యాచారం చేసిన ఘటనలు 2019లో 259 కాగా.. 2020లో 258గా వుంది. ప్రేమ లేదా ఇతర కారణాలతో మహిళలను వేధించిన కేసులు 2019లో 7,856 కాగా.. 2020లో ఈ తరహా కేసుల సంఖ్య 6,391. వరకట్నం వేధింపులతో జరిగిన హత్యల సంఖ్య 2019లో 107 కాగా.. ఈ తరహా కేసుల సంఖ్య 2020లో 108గా నమోదైంది. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉదంతాలలో 2019లో 4,688 కేసులు నమోదయ్యాయి. 2020లో ఈ తరహా కేసుల సంఖ్య 5,197గా నమోదైంది. కాగా పోక్సో చట్టం కింద నమోదైన కేసుల సంఖ్య 2019లో 1,386 కాగా.. 2020లో పోక్సో కేసుల సంఖ్య 1,538గా వుంది. మహిళలను దారుణంగా హత్య చేసిన ఉదంతాలు ఏపీవ్యాప్తంగా పరిశీలిస్తే గుంటూరు జిల్లాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో జరిగిన హత్యలను పరిశీలిస్తే.. 2017లో 22, 2018లో 22, 2019లో 22, 2020లో 21 మంది మహిళలు హత్యగావించబడ్డారు.

ఇటు తెలంగాణలోను మహిళల పట్ల దారుణాలు తక్కువేం లేవు. హైదరాబాద్ నగరంలోని నల్లకుంటలో రెండేళ్ళ క్రితం ఓ యువకుడు ఓ యువతిపై కొబ్బరిబొండాలను నరికే కత్తితో దాడి చేస్తే ఆ యువతి చాన్నాళ్ళు చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడింది. ఔటర్ రింగురోడ్డు సమీపంలో ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారం చేసి.. అతి దారుణంగా పెట్రోల్ పోసి తగుల బెట్టిన ఉదంతం ఎవ్వరు మరిచిపోలేని దారుణ ఘటన. కఠిన శిక్షల కోసం ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా.. మహిళలపై దారుణాలు ఆగకపోవడం వెనుక కారణాలను విశ్లేషించి, తగిన చర్యలు తీసుకోవాల్సి వుంది. అదే సమయంలో ప్రేమ పేరిట మగాళ్ళని వంచించే మహిళల పట్ల కూడా శాసనకర్తలు దృష్టి సారించాల్సి వుంది.

ALSO READ: ఎంఐఎం ఎంట్రీతో పొలిటికల్ హీట్.. ప్రభావంపై లెక్కల మీద లెక్కలు.. ఇంతకీ నష్టమెవరికంటే?

ALSO READ: రెండేళ్ళ ముందే కసరత్తు షురూ.. దీదీకి ధీటుగా కమలం వ్యూహం

ALSO READ: బెంగాల్‌లో పోల్ టెన్షన్.. ఎర్ర సామ్రాజ్యానికి దీదీ చెక్.. తాజాగా పెరిగిన బీజేపీ దూకుడు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu