Bharat Serums And Vaccines Limited: దేశంలో ఒక వైపు కరోనా కేసులు, మరణాలు పెరుగుతుంటే మరోవైపు ఆస్పత్రులు, ఇతర ఔషధాలకు సంబంధించిన గోడౌన్‌లలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుని భారీ మొత్తంలో నష్టం వాటిల్లుతోంది. ఇక ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ దొరక్క కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే వ్యాక్సిన్ల కొరత కూడా ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్ లిమిటెడ్‌లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో కంపెనీ గోడౌన్‌లోని నిల్వ ఉంచిన కరోనా మెడిసిన్స్, వ్యాక్సిన్‌లతో పాటు బ్లాక్ ఫంగస్‌కు ఉపయోగించే మందులు సైతం పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఇక ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా..? లేక ఇతర కారణాలున్నాయా..? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ప్రమాదంలో రూ.25 లక్షల వరకు ఆస్తినష్టం సంభవించినట్లు కంపెనీ యాజమాన్యం ప్రాథమికంగా అంచనా వేసింది.