శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నిత్యావసరాలకు కోసం వెళ్లి ఆరుగురు కూలీల మృతి, పలువురికి తీవ్ర గాయాలు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు.
Six killed in Road Accident : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక బృందాలు లారీ కింద ఇరుకున్న క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
శంషాబాద్ మండలం సుల్తాన్‌పల్లి ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీలు.. కూరగాయలు, ఇతర నిత్యావసరాలు కొనేందుకు శంషాబాద్ మార్కెట్‌కు లారీలో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో కళాకుమార్ సునా (20), కృపా సునా (25), గోపాల్ దీప్ (25), బుదన్ (25), హస్తా యాదవ్ (55)తో పాటు మరొకరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఘటన జరిగిన సమయంలో లారీలో సుమారు 50మంది కూలీలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరందర్నీ ఒడిశాలోని బలంగిర్ జిల్లా డాబుగా బ్లాక్ చికిలి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. రోడ్డుకు అడ్డంగా లారీ బోల్తాపడటంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఎర్పడింది. అనంతరం జేసీబీ సాయంతో లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. డ్రైవర్ మద్యం తాగి నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also… Texas Shooting: అమెరికాలో తీవ్రస్థాయికి చేరిన గన్ కల్చర్.. దుండగుడి కాల్పుల్లో మరో ముగ్గురు మృతి