బీహార్‌లో హృదయ విదారక ఘటన.. పూరి గుడిసె తగలబడి ఆరుగురు చిన్నారుల సజీవ దహనం
సరదాగా మొక్కజొన్నలు కాల్చుకుంటుండగా చెలరేగిన నిప్పు ఆరుగురు చిన్నారులను బలితీసుకుంది. బీహార్‌లోని అరారియా జిల్లా కబయా గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
Six children burnt: సరదాగా మొక్కజొన్నలు కాల్చుకుంటుండగా చెలరేగిన నిప్పు ఆరుగురు చిన్నారులను బలితీసుకుంది. నిప్పు రవ్వలు పడి పూరి గుడిసెకు అంటుకుంది. దీంతో ఆరుగురు చిన్నారులు మంటల్లో సజీవ దహనమయ్యారు. ఈ హృదయ విదారక ఘటన.. బీహార్‌లో చోటుచేసుకుంది. అరారియా జిల్లా కబయా గ్రామంలో మంగళవారం చిన్నారులు మొక్కజొన్న కంకులు కాల్చుకుని తినేందుకు నిప్పుల కుంపటి రాజేశారు. ఇదే సమయంలో అకస్మాత్తుగా ఆ మంటలు పూరి గుడిసెపై పడ్డాయి. గడ్డితో చేసిన గుడిసెలు కావడంతో వెంటనే మంటలు దావనంలా వ్యాపించాయి. మంటల నుంచి తప్పించుకునే అవకాశమే లేకుండాపోయింది.
ఆ పిల్లల కేకలు విన్న కొందరు యువకులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు దట్టంగా అలుముకోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. పూరి గుడిసె తగలబడిందన్న సంగతి తెలిసిన వెంటనే వందల సంఖ్యలో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. పలసి పోలీస్ స్టేషన్ పరిధిలోని కబియా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఇల్లు తగలబడిన విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైర్ డిపార్ట్‌మెంట్ వాహనం వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. అయితే.. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. పోలీసులు చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తరం ఆస్పత్రికి తరలించారు.
ఆరుగురు అభంశుభం తెలియని చిన్నారులు మంటల్లో చిక్కుకుని చనిపోవడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఆ చిన్నారుల తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో అందరూ ఇంట్లో కూర్చుని ఆడుకుంటున్నట్లు తెలిసింది. చనిపోయిన ఆ చిన్నారుల వయసు 3 నుంచి 6 ఏళ్లలోపే. మరణించినవారిని గుల్నాజ్ (3), బర్కాస్ (4), అశ్రఫ్ (5), అలీ హసన్ (5), ఖుశ్ నిహార్ (5), దిల్వార్ (6)లుగా గుర్తించారు. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కలచివేస్తోంది. అయితే అంతకుముందు రోజే బిహార్‌లో కాముడి దహనం చేస్తుండగా ఆ మంటల్లో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.