AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోల్‌కతా ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజ్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి! జూనియర్‌ డాక్టర్‌ అరెస్ట్‌

కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో నాల్గవ సంవత్సరం MBBS చదువుతున్న అనిందిత సోరెన్ మాల్దాలో మృతి చెందింది. ఆమె ప్రియుడు ఉజ్వల్ సోరెన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనిందిత తల్లి, ఉజ్వల్ తన కుమార్తె కు విషం ఇచ్చాడని ఆరోపించింది.

కోల్‌కతా ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజ్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి! జూనియర్‌ డాక్టర్‌ అరెస్ట్‌
Anindita Soren, Ujjwal
SN Pasha
|

Updated on: Sep 14, 2025 | 5:38 PM

Share

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్‌లో నాల్గవ సంవత్సరం ఎంబిబిఎస్ చదువుతున్న అనిందిత సోరెన్ శుక్రవారం రాత్రి మాల్డాలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ కేసుకు సంబంధించి ఆమె ప్రియుడు, మాల్డా మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ ఉజ్వల్ సోరెన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాకు చెందిన అనిందిత ఉజ్వల్‌ను కలవడానికి మాల్డాకు వెళ్లింది. ఆమె గురువారం అనారోగ్యానికి గురై మాల్డా మెడికల్ కాలేజీలో చేరినట్లు సమాచారం. ఆమె పరిస్థితి విషమంగా మారి, శుక్రవారం రాత్రి కోల్‌కతా ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మరణించింది.

ఈ సంఘటన తర్వాత అనిందిత తల్లి అల్పన తుడు పోలీసులకు ఫిర్యాదు చేసింది, ఉజ్వల్ తన కుమార్తెకు విషం పెట్టి చంపాడని, వారి వివాహాన్ని రిజిస్టర్ చేయమని ఆమె ఒత్తిడి చేస్తోందనే అతను ఈ విధంగా చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. నా కూతురిని మాల్డా మెడికల్ కాలేజీలో చేర్చారు, కానీ ఆమెకు సరైన చికిత్స అందలేదు అని అనిందిత తల్లి ఆరోపించింది. ఆమె నోటి నుండి నురగ కారింది, మేం ఆమెను కోల్‌కతాకు తీసుకెళ్తున్నప్పుడు, ఆమె సుజాపూర్ సమీపంలో మరణించింది. నాకు న్యాయం, సమగ్ర దర్యాప్తు కావాలని మృతురాలి తల్లి డిమాండ్‌ చేసింది.

అనిందిత, ఉజ్వల్ దాదాపు ఒక సంవత్సరం పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఆలయంలో వివాహం చేసుకున్నారని, కానీ ఉజ్వల్ అందరికీ తెలిసేలా వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదని ఆమె ఆరోపించింది. దీని వల్ల తరచుగా వివాదాలు, మానసిక వేధింపులు జరిగేవని తెలుస్తోంది. ఇటీవల బాలూర్‌ఘాట్‌లోని తమ ఇంటికి వెళ్లిన తన కుమార్తె మాల్డాకు చేరుకుని అకస్మాత్తుగా ఎందుకు చనిపోయిందని కూడా ఆ తల్లి ప్రశ్నించింది. కాగా ఉజ్వల్‌ను మాల్డా ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతన్ని మాల్డా జిల్లా కోర్టులో హాజరుపరిచారు, దర్యాప్తు అధికారులు ఏడు రోజుల కస్టడీని కోరుతున్నారు.

మరిన్ని క్రైమ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి