AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prisoner Escapes: కోర్టు నుంచి జీవిత ఖైదు పడ్డ వ్యక్తి ఎస్కేప్.. సినిమాను మించిన స్కెచ్.. పోలీసులకు చెక్!

జైలు నుంచి కోర్టుకు వచ్చిన ఒక జీవితఖైదీ పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. అచ్చం సినిమా పక్కీలో ఉడాయించాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ న్యాయస్థానం ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Prisoner Escapes: కోర్టు నుంచి జీవిత ఖైదు పడ్డ వ్యక్తి ఎస్కేప్.. సినిమాను మించిన స్కెచ్.. పోలీసులకు చెక్!
Prisoner Escape
Balaraju Goud
|

Updated on: May 07, 2022 | 10:36 AM

Share

Prisoner Escapes: జైలు నుంచి కోర్టుకు వచ్చిన ఒక జీవితఖైదీ పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. అచ్చం సినిమా పక్కీలో ఉడాయించాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ న్యాయస్థానం ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది. చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ జీవిత ఖైదీ.. వేరొక కేసు విచారణ నిమిత్తం పోలీసులు మిర్యాలగూడ కోర్టుకు తీసుకొచ్చారు. జైలులో పరిచయమైన మరో ఖైదీ బంధువులను ముందే అక్కడికి రప్పించిన ముద్దాయి.. వారి కారు తీసుకుని హఠాత్తుగా ఉడాయించాడు. ఆంధ్రప్రదేశ్‌ దిశగా పారిపోయిన అతడిని పోలీసులు ఫాస్టాగ్‌ ఆధారంగా గుర్తించారు. ఎట్టకేలకు అర్ధరాత్రి దాటాక ఏపీలోని ప్రకాశం జిల్లాలో పట్టుకోగలిగారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామానికి చెందిన ఐతం రవిశంకర్‌(46)పై తెలుగు రాష్ట్రాల్లో 40కు పైగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో 2019లో జరిగిన కిడ్నాప్‌, అత్యాచారం కేసులో రవిశంకర్‌ చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, ఎలాగైనా జైలు నుంచి తప్పించుకోవాలని ఫ్లాన్ చేశాడు. ఇందుకు మరో ఖైదీ శ్రీధర్‌తో ములాఖత్‌కు వచ్చిన అతడి బంధువులను రవిశంకర్‌ పరిచయం చేసుకున్నాడు. తాను మే నెల 5న మిర్యాలగూడ కోర్టుకు వస్తానని, అక్కడి నుంచి బయటపడేందుకు సహాకరించాలని, ఆ రోజు అక్కడికి రావాలని వారిని కోరాడు. ఇందుకు వారు సహకరించడంతో తప్పించుకునేందుకు పక్కా స్కెచ్ వేశాడు.

ఈక్రమంలోనే గురువారం ఉదయం రవిశంకర్‌ను విచారణ నిమిత్తం అంబర్‌పేట హెడ్‌క్వార్టర్‌కు చెందిన రిజర్వు పోలీసులు మిర్యాలగూడ కోర్టు తీసుకువచ్చారు. కోర్టులో ప్రక్రియ ముగిసేసరికి సాయంత్రమైంది. అక్కడికి వచ్చిన తన మిత్రులతో మాట్లాడతానని రవిశంకర్‌ పోలీసులను కోరాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న శ్రీధర్‌ బంధువులతో మాట్లాడసాగాడు. పక్కనే వారి కారు (టీఎస్‌ 08 జీఎల్‌ 8818) ఉండగా, రవిశంకర్‌ తన పథకం అమలుకు సిద్ధమయ్యాడు. కారు తాళాలు ఇగ్నిషన్‌కు వదిలేసి ఉండడంతో అతడి పని సులువైంది. ఒక్క ఉదుటున కారెక్కి వేగంగా ఉరికించాడు. అద్దంకి రహదారి దిశగా దూసుకుపోయాడు. ఈ హఠాత్ పరిణామంతో నివ్వెరపోయిన రిజర్వు పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగారు.

ఇవి కూడా చదవండి

ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దుల్లో అప్రమత్తం చేశారు. కారులో ఉన్న డ్రైవర్‌ సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ఖైదీ గురజాల వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. కాసేపటికి ఆ ఫోన్‌ స్విచాఫ్‌ చేయడంతో ఫాస్టాగ్‌ ఆధారంగా ప్రయత్నించారు. అందులో డబ్బులు నిల్వ లేకపోవడంతో అప్పటికప్పుడు రీఛార్జి చేయించి.. కారు వెళ్లే మార్గాన్ని అనుసరించారు. నల్గొండ జిల్లా పోలీసు కంట్రోల్‌ రూం నుంచి ప్రకాశం జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఒంగోలు-చెన్నై జాతీయ రహదారిపై గస్తీ నిర్వహించారు. తెల్లవారుజాము మూడు గంటల సమయంలో వల్లూరు ప్రాంతం వద్ద కారులో వస్తున్న రవిశంకర్‌ను పోలీసులు గుర్తించారు. దాదాపు ఏడు కిలోమీటర్లు వెంబడించిన టంగుటూరు టోల్‌గేట్‌ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా పోలీసులు అతడిని శుక్రవారం ఉదయం మిర్యాలగూడకు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు.

Read Also…  Indore Fire Accident: రెండంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. మహిళతో సహా ఏడుగురు సజీవ దహనం