AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డామిట్ కథ అడ్డం తిరిగింది.. కేసును తప్పించుకుబోయి మరో కేసు..!

మనుషుల్లో రోజురోజుకీ మానవత్వం మంటగలుస్తోంది. కనికరం లేని కసాయిలు నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎన్ని తప్పులైనా చేసేందుకు సిద్ధపడుతున్నారు.

డామిట్ కథ అడ్డం తిరిగింది.. కేసును తప్పించుకుబోయి మరో కేసు..!
Balaraju Goud
|

Updated on: Oct 07, 2020 | 9:05 PM

Share

మనుషుల్లో రోజురోజుకీ మానవత్వం మంటగలుస్తోంది. కనికరం లేని కసాయిలు నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎన్ని తప్పులైనా చేసేందుకు సిద్ధపడుతున్నారు. హత్యలు చేస్తూ, మహిళలపై అకృత్యాలు కొనసాగిస్తున్న మృగాళ్లు, ఆధారాలను మాయం చేసే క్రమంలో ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఓ భార్యభర్తలు చేసిన ఘాతకం వెన్నులో వణుకుపుట్టించేలా ఉంది.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజ్ కుమార్ అత్యాచారం హత్య కేసుల్లో నిందితుడిగా జైలుశిక్ష అనుభవించి ఇటీవలే బెయిల్ మీద బైటికి వచ్చాడు.డబ్బు ఆశజూపి ఓ వ్యక్తిని హతమార్చిన కేసులో మరోసారి అరెస్టయ్యాడు. కేసుల భయం వెంటాడటంతో ఎలాగైనా వాటి నుంచి విముక్తి పొందాలని భావించాడు. ఈ విషయం భార్య, తన అనుచరులకు చెప్పి పక్కా ఫ్లాన్ రచించాడు. తన పోలికలతో ఉన్న వ్యక్తి కోసం అన్వేషించాడు.

ఇదే క్రమంలో సెప్టెంబరు 23న బులంద్‌షహర్‌లో ఓ మద్యం దుకాణం వద్ద మత్తులో జోగుతున్న వ్యక్తికి డబ్బు ఇచ్చి మరింత మద్యం సేవించేలా ప్రోత్సహించాడు రాజ్ కుమార్. ఆ తర్వాత తన దుస్తులు కూడా ఇచ్చి వేసుకోమని చెప్పాడు. ఇందుకు అతడు వెంటనే అంగీకరించి, కుమార్‌ చెప్పినట్లుగా చేశాడు. కాసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న కుమార్‌ భార్య, అనుచరుడు, అతడిని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి హతమార్చారు. అనంతరం అతడి జేబులో రాజ్ కుమార్‌ ఆధార్‌ కార్డు, ఇతర గుర్తింపు కార్డులు పెట్టారు. ముఖం ఆనవాలు గుర్తుపట్టకుండా బండరాళ్లతో మోది నుజ్జునుజ్జు చేశారు. ఆ తర్వాత కుమార్‌ అక్కడి నుంచి పరారై అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కుమార్ భార్య మరొకరు అక్కడి నుంచి ఏం తెలియదన్నట్లు వారి ఇళ్లకు చేరుకున్నారు.

ఇదిలావుండగా గుర్తు తెలియని శవం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహం వద్ద దొరికిన కార్డుల ఆధారంగా అది రాజ్ కుమార్‌దేనని తొలుత భావించారు. అయితే, లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో రాజ్ కుమార్‌ ఇంటికి వెళ్లి అతడి భార్యను ప్రశ్నించిన పోలీసులు, ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కుమార్‌ అడ్డంగా దొరికిపోయాడు. అలీఘడ్‌లో తలదాచుకున్న కుమార్‌ని అరెస్టు చేశారు. అతడికి సహకరించిన భార్య, అనుచరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడిపై గతంలో హత్య, అత్యాచారం కేసు నమోదైందని, తన స్థానంలో మరో వ్యక్తి శవాన్ని పెట్టి, తన గుర్తింపును మాయం చేసేందుకే కుమార్‌ ఈ నేరానికి పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో తానొక్కడే కాకుండా అతని భార్యతో పాటు అనుచరుడు కటకటలాపాలయ్యారు.