తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడ్డారు. తమ విషయం ఇంట్లో తెలిసిపోతుందని భయపడ్డారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య (suicide) కు పాల్పడ్డారు. కుటుంబసభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో అబ్బాయి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అమ్మాయి మృతి చెందారు. ఈ ఘటన తెలంగాణ (Telangana) లోని ఆసిఫాబాద్ లో జరిగింది. తెలంగాణలోని కుమరం భీం జిల్లా ఆసిఫాబాద్ (Asifabad) మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ అబ్బాయి, ఓ అమ్మాయి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి వయసూ 18 ఏళ్ల కంటే తక్కువ. పక్కపక్క ఇళ్లలో ఉంటున్న వీరు.. గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లారు.
రాత్రి పది గంటల సమయంలో అమ్మాయి తమ బంధువులకు ఫోన్ చేసి, తాము పురుగు మందుతాగి పడి ఉన్నట్లు తెలిపింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్న ఇద్దరిని ఆస్పత్రికి తకరలించారు. మార్గమధ్యలో అబ్బాయి మరణించాడు. అమ్మాయికి ప్రథమ చికిత్స అందించి మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఆమె కూడా మృతిచెందారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరికి పంచనామా నిర్వహించారు.
మృతులు ఇద్దరు దగ్గరి బంధువులేనని.. వారు ప్రేమించుకుంటున్న విషయం తమకు తెలియదని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. విషయం తెలిస్తే సామరస్యంగా పరిష్కరించుకునేవారమని తెలిసీ తెలియని వయసులో ఇంత పని చేస్తారని అనుకోలేదని మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అమ్మాయి కస్తూర్బాలో పదో తరగతి చదువుతుండగా.. అబ్బాయి వ్యవసాయ కూలీగా జీవనోపాధి పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
Vizianagaram: ఏపీ విజయనగరంలో జై భీమ్ తరహా ఘటన.. లాక్‌అప్ డెత్‌పై విచారణకు ఆదేశం..
Health Tips: ఎక్కువగా తేనె తింటున్నారా..? అయితే ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోండి..