Crime News: జగిత్యాల జిల్లాలో దారుణం.. అనుమానంతో సొంత భార్యను చంపేసి ఏం చేశాడంటే..?
Crime News: జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన జరిగింది. అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యనే చంపాడు ఓ కిరాతక భర్త. అనంతరం ఉరేసుకొని తాను ఆత్మహత్య
Crime News: జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన జరిగింది. అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యనే చంపాడు ఓ కిరాతక భర్త. అనంతరం ఉరేసుకొని తాను ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వారినే నమ్ముకొని ఉన్న కుటుంబాన్ని ఒంటరిగా మిగిల్చింది. ఈ విషాదకర సంఘటన కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బత్తిని దేవయ్య, ప్రమీల భార్యా భర్తలు. దేవయ్య గతంలో దుబాయ్‌లో పనిచేసేవాడు. కరోనా వల్ల సంవత్సరం క్రితం దుబాయ్ నుంచి ఇంటికి వచ్చాడు. అయితే కొంతమంది మాటలు విన్న దేవయ్య భార్యపై అనుమానం పెంచుకున్నాడు. గత కొన్ని రోజులుగా భార్యతో నిత్యం గొడవపడుతూ వేధించడం మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య గొడవలు రోజు రోజుకు పెరిగిపోయాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి దేవయ్య తన భార్య తలపై కర్రతో బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్త స్రావమై ప్రమీల అక్కడికక్కడే మృతిచెందింది.
క్షణికావేశంలో సొంత భార్యనే చంపుకున్నాడు. తర్వాత ఏం చేయాలో తెలియక తాను కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇద్దరి మృతితో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి.