AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Liquor Scam: ఇవాళ సిట్ ముందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి… ఉత్కంఠ రేపుతున్న విచారణ

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోమారు సిట్‌ నుంచి పిలుపు వచ్చింది. ఇప్పటికే ఏప్రిల్‌ 18న ఒకసారి విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. స్కామ్‌లో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డేనని, మద్యం పాలసీపై తన సమక్షంలోనే మూడు సార్లు సిట్టింగులు జరిగాయని ఆయన చేసిన వ్యాఖ్యలే సిట్ దర్యాప్తునకు ఊతమిచ్చాయి. అంతే స్పీడుతో...

AP Liquor Scam: ఇవాళ సిట్ ముందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి... ఉత్కంఠ రేపుతున్న విచారణ
Vijayasai Reddy Liquor Scam
K Sammaiah
|

Updated on: Jul 12, 2025 | 7:13 AM

Share

ఏపీలో రాజకీయాల్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణానికి 2019 ఆగస్టు నెలలో విత్తనం పడింది. వైసీపీ పవర్లోకి వచ్చిన మూడునెలల్లోనే లిక్కర్ పాలసీని సమూలంగా మార్చి, ప్రభుత్వ ఆధ్యర్యంలోనే మద్యం అమ్మకాలు జరిపేలా 3 వేలకు పైగా దుకాణాలకు అనుమతిచ్చి, నాణ్యత, ధర, బ్రాండ్లు అన్నీ తమ ఆధీనంలోనే ఉంచుకుని.. మూడువేల కోట్లకు పైగా వెనకేసుకున్నారన్నది అభియోగం.

ఈది శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ, గత ఏడాది సెప్టెంబర్లో ఎఫ్‌ఐఆర్ రాసింది. కేసు తీవ్రతను బట్టి ఎన్టీయార్ జిల్లా సీపీ ఎస్‌వీ రాజశేఖర్‌బాబు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి మద్యం స్కామ్‌ను ముందుకు జరిపింది కూటమి సర్కార్. ఐదేళ్లలో 3 వేల 500 కోట్లు ముడుపులు తీసుకున్నట్టు ప్రాధమికంగా నిర్ధారించి, మొత్తం 11 మందిని అరెస్ట్ చేసింది సిట్. రాజ్‌ కెసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెరుకూరు వెంకటేష్ నాయుడు, కె. ధనుంజయ్‌రెడ్డి, పీ. క్రిష్ణమోహన్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, దిలీప్‌కుమార్, చాణక్య.. వీళ్లందరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తొలి అరెస్టు జరిగిన 90 రోజుల్లోగా ప్రిలిమినరీ చార్జ్‌షీట్ దాఖలు చేయాలన్నది నిబంధన. అందుకే.. కేసు విచారణను స్పీడప్‌ చేసింది సిట్.

మిధున్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, రాజ్ కెసిరెడ్డి సూత్రధారులుగా స్కామ్‌ నడిచిందని, కొందరు నగదు రూపంలో కొందరు బంగారం బిస్కెట్ల రూపంలో, కొందరు షెల్ కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో ముడుపులు చెల్లించారని, ఇలా సేకరించిన పైకాన్ని ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుకు మళ్లించారని సిట్ చెబుతోంది. కానీ.. ఇవన్నీ సిట్ రిమాండ్ రిపోర్టుల్లో చేర్చిన అంశాలు. వీటిని లీగల్‌గా ప్రూవ్ చేయడం సిట్ ముందున్న అసలు ఛాలెంజ్. డబ్పులు తీసుకున్నారు సరే ఎక్కడ ఎలా ఎప్పుడు తీసుకున్నారు అనే ప్రశ్నలకు కోర్టులో సమాధానం చెబితేనే కేసు నిలబడే ఛాన్సుంది.

అటు.. లిక్కర్ కేసులో నిందితుల ఆస్తుల జప్తునకు విజయవాడ కోర్టు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని అధాన్ డిస్టిలరీస్‌కు చెందిన బ్యాంకు ఖాతాలో ఉన్న 30 కోట్లు, లీల డిస్టిలరీస్ పేరుమీద పాండిచ్చేరిలో బ్యాంకు ఖాతాలో ఉన్న 2 కోట్ల 85 లక్షలు అటాచ్ చేసింది సిట్. ఈ నగదు మొత్తం మద్యం ముడుపుల నుంచి వసూలు చేసిందేనని ఆధారాలు కూడా సేకరించింది. గత ఎన్నికల సమయంలో చిల్లకల్లు వద్ద పట్టుబడిన 8 కోట్ల నగదు లావాదేవీలతో పోల్చి చూస్తున్నారు అధికారులు. ఇప్పటికే మొదట దశలో 30 కోట్ల రూపాయల్ని అటాచ్‌ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఇదొక కీలక పరిణామం.

లేటెస్ట్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రజత్‌ భార్గవను పది గంటలపాటు విచారించింది సిట్. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన రజత్ భార్గవను ఇప్పటికే రెండుసార్లు విచారించారు. మూడోసారి పిలిచి, ఇప్పటివరకు విచారించిన వారి స్టేట్‌మెంట్లు ఆయన ముందుంచి ప్రశ్నలు సంధించి వివరాల్ని రాబట్టింది. చార్జ్‌షీట్ దాఖలుకు సంబంధించి మంచి స్టఫ్‌ను రాబట్టినట్టు తెలుస్తోంది.

ఇటు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోమారు సిట్‌ నుంచి పిలుపు వచ్చింది. ఇప్పటికే ఏప్రిల్‌ 18న ఒకసారి విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. స్కామ్‌లో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డేనని, మద్యం పాలసీపై తన సమక్షంలోనే మూడు సార్లు సిట్టింగులు జరిగాయని ఆయన చేసిన వ్యాఖ్యలే సిట్ దర్యాప్తునకు ఊతమిచ్చాయి. అంతే స్పీడుతో అరెస్టులూ జరిగాయి. ఇవాళ సిట్‌ ఇంటరాగేషన్‌లో ఇంకెలాంటి షాకింగ్‌ విషయాలు చెబుతారో అనే ఉత్కంఠ నెలకొంది. 2019లో మద్యం పాలసీని మార్చినప్పటినుంచి 2024 ఎన్నికల్లో ముడుపుల్ని ఖర్చుపెట్టే వరకు ఏమేం జరిగింది.. స్కామ్ ఏటూ జెడ్ వివరాల్ని పొందుపరుస్తూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ చార్జ్‌షీట్ దాఖలు చెయ్యబోతోంది. ఈ చార్జ్‌షీట్‌ ద్వారానే మిగతా నిందితుల పాస్‌పోర్టుల్ని సీజ్‌ చేసేందుకు కోర్టు అనుమతి తీసుకుని.. విదేశాలకు పరార్ కాకుండా చర్యలు తీసుకోవచ్చని సిట్ భావిస్తోంది.