షుగర్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు..ఐదుగురు దుర్మరణం
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. నాగ్‌పూర్ జిల్లాలోని మానస్ అగ్రో ఇండస్ట్రీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీలో బాయిలర్ పేలి ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పేలుడు సంభవించిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

మహారాష్ట్రలో ఘోరం జరిగింది. నాగ్‌పూర్ జిల్లాలోని మానస్ అగ్రో ఇండస్ట్రీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీలో బాయిలర్ పేలి ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పేలుడు సంభవించిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. తప్పించుకునే సమయం లేకపోవడంతో ఐదుగురు వ్యక్తులు మంటల్లో కాలి అక్కడికక్కడే మృతిచెందారు. ఉమ్రేడ్ మండలం బేలా గ్రామంలో కంపెనీకి చెందిన బయోగ్యాస్ ప్లాంట్ సమీపంలో శనివారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదంలో మృతిచెందిన వారిని మంగేశ్ ప్రభాకర్ నౌకర్‌కార్ (21), లీలాధర్ ఉమన్‌రావు షిండే (42), వాసుదేవ్ లాది (30), సచిన్ ప్రకాశ్ వాగ్మేర్ (24), ప్రఫుల్ పాండురంగ్ మూన్ (25)గా పోలీసులు గుర్తించారు. మృతులంతా వాడ్గావ్ గ్రామానికి చెందినవారేనని తెలిపారు. సచిన్ వాగ్మేర్ వెల్డర్ కాగా, మిగతా నలుగురు కూలీలుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.