Wrestler Sushil Kumar: భారత రెజ్లర్ సుశీల్ కుమార్‌పై లుకౌట్ నోటీసులు.. ఇంటి అద్దె చెల్లించలేదని తోటి రెజ్లర్ దారుణ హత్య
భారత రెజ్లర్ సుశీల్ కుమార్‌పై ఢిల్లీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఓ హత్య కేసుకు సంబంధించి లుకౌట్ నోటీసులు ఇచ్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
భారత రెజ్లర్ సుశీల్ కుమార్‌పై ఢిల్లీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఓ హత్య కేసుకు సంబంధించి లుకౌట్ నోటీసులు ఇచ్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ నెల 4న ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియం ఆవరణంలో జరిగిన గొడవలో రెజ్లర్ సాగర్ దండక్ మృతి చెందాడు. సాగర్ అతని మిత్రులపై సుశీల్ కుమార్ టీమ్ హాకీ, బేస్‌బాల్ బ్యాట్లతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాలు సేకరించారు. ఆ దాడిలో సాగర్ తలకి తీవ్ర గాయమవగా.. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో సుశీల్ కుమార్ తోపాటు పలువురిపై హత్య కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. పరారీలో ఉన్న అతని కోసం గాలించారు.
సాగర్ దండక్ మృతి చెందిన తర్వాత సుశీల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని కోసం ఐదు రోజుల పాటు ఢిల్లీ, హర్యానా ప్రాంతాల్లో గాలించిన పోలీసులు.. తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి సుశీల్ కుమార్‌తో సాగర్‌కి మంచి సత్సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సుశీల్ ఇంట్లోనే అద్దెకి ఉన్న సాగర్.. ఇటీవల ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అద్దె విషయంలో ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే హత్యకి దారితీసినట్లు పోలీసులు తెలిపారు.
సుశీల్ కుమార్ మర్డర్ కేసులో ఇరుక్కోవడంతో భారత రెజ్లింగ్ సమాఖ్య సీరియస్‌గా స్పందించింది. గతంలో రెజ్లర్లంటే గూండాలనే వారని చెప్పుకొచ్చిన సమాఖ్య.. ఇప్పుడిప్పుడే రెజ్లర్లపై గౌరవం పెరుగుతోందని వెల్లడించింది. కానీ.. తాజాగా సుశీల్ కుమార్ గొడవ.. మళ్లీ రెజ్లర్ల పరువు తీసిందని సమాఖ్య దుయ్యబట్టింది.