Day time thief: పగటిపూట మాత్రమే దొంగతనాలు.. గ్రామాలే టార్గెట్..పోలీసులకు చిక్కిన ఘరానాదొంగ 

దొంగతనాలు సాధారణంగా రాత్రిళ్లు జరుగుతాయి. పట్టపగలు ఇళ్లల్లో దొంగతనాలు జరగడం చాలా అరుదు. ఒక ఘరానా దొంగ మాత్రం పగలు మాత్రమే దొంగతనాలు చేస్తాడు.

  • KVD Varma
  • Publish Date - 4:45 pm, Thu, 8 April 21
Day time thief: పగటిపూట మాత్రమే దొంగతనాలు.. గ్రామాలే టార్గెట్..పోలీసులకు చిక్కిన ఘరానాదొంగ 
Day Time Thief

Day time thief: దొంగతనాలు సాధారణంగా రాత్రిళ్లు జరుగుతాయి. పట్టపగలు ఇళ్లల్లో దొంగతనాలు జరగడం చాలా అరుదు. ఒక ఘరానా దొంగ మాత్రం పగలు మాత్రమే దొంగతనాలు చేస్తాడు. అదీ దర్జాగా కారులోనే బైక్ లోనో వచ్చి మరీ తన పని కానిస్తాడు. ఇతని టార్గెట్ గ్రామాలు మాత్రమే. ఏడేళ్లుగా ఆంధ్రా, తమిళనాడుల్లో ఈ దొంగ తన చేతివాటం చూపిస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఈ పగటి దొంగ పోలీసుల చేతికి చిక్కాడు.  గంగవరం ఐడీ పార్టీ బుధవారం ఈ దొంగను అరెస్టు చేసింది.  తమిళనాడు రాష్ట్రం తిరుప్పాత్తూర్ జిల్లా కరంబూరు గ్రామానికి చెందిన గోవిందరాజన్ కుమారుడు శక్తివేలు. ఇతని వృత్తి టాక్సీ డ్రైవర్. ప్రవృత్తి పగటి దొంగతనాలు. జనసంచారం తక్కువగా ఉండే గ్రామాలను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడతాడు. ముందు తాను దొంగతనం చేయబోయే గ్రామంలో రెక్కీ నిర్వహిస్తాడు. తరువాత అక్కడ దొంగతనం ఎవరింట్లో చేయాలో డిసైడ్ చేస్తాడు. ఆనక తాపీగా తనపని కానిస్తాడు.

సాధారణంగా గ్రామాల్లో పగటి పూట ఇంటిల్లిపాదీ పనులకు పోతారు. ఆ సమయంలో వారి ఇంటికి తాళం వేసి తాళాన్ని ఏదైనా తలుపు పైన కానీ, కిటికీ అంచుల్లో కానీ ఉంచుతారు. సరిగ్గా ఇటువంటి వారి ఇళ్లనే టార్గెట్ చేసే శక్తి వేలు.. పనులపై ఇంటికి తాళం వేసి అందరూ వెళ్ళిపోగానే.. కారు లేదా బైక్ పై వచ్చి.. వారు తాళం ఉంచిన ప్రదేశం నుంచి తాళాన్ని తీసుకుని సులువుగా ఇంట్లోకి వెళ్లి తాపీగా తన పని కానిచ్చి వెళ్ళిపోతాడు.

ఇప్పటిదాకా ఏడేళ్లలో పలు ఇళ్లలో ఇలా దొంగతనాలు చేశాడు. అయితే, ఇతనిపై పోలీసులకు అందిన ఫిర్యాదులు మాత్రం 15 వరకే. పోలీసులు తమకు అందిన ఫిర్యాదు మేరకు పగటిపూట మాత్రమే దొంగతనాలు జరుగుతున్న వైనంపై ఆరునెలలుగా ఐడీ పార్టీ నిఘా పెట్టారు. తమిళనాడులోనూ ఇదేవిధంగా చోరీలు జరుగుతున్నాయని తెలుసుకున్నారు. దీంతో మరికాస్త జాగ్రత్తగా విచారణ జరిపారు. శక్తివేలు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నాడని కనిపెట్టారు. చివరకు బుధవారం శక్తివేలును బైరెడ్డిపల్లి వద్ద అరెస్టు చేశారు.