సాయంత్రం 6 గంటల్లోపు ప్రజలంతా ఇళ్లకు చేరుకోవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో 70 వేలకు పైగా కేసులు నమోదు చేశామన్నారు. ఆరు వేల వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వారిపై కేసులు తప్పవని సిపి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లాక్ డౌన్ సడలింపు సమయాన్ని పెంచుతూ ఆమోదం తెలపడంతో సాయంత్రం ఆరు గంటల వరకు మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ 30వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఈరోజు హైటెక్ సిటీ సైబర్ టవర్, కూకట్ పల్లి JNTU చెక్ పోస్ట్, వై జంక్షన్, సనత్ నగర్, బాలానగర్ వద్ద తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… ప్రస్తుత లాక్ డౌన్ లో భాగంగా ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకోవాలన్నారు.
ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకే బయట తిరిగేందుకు అనుమతులు ఉంటాయన్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ప్రతీ ఒక్క షాప్, ఆఫీసులు సాయంత్రం ఆరు గంటల వరకు మూసివేయాలన్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఎవరైనా అనవసరంగా రోడ్ల పైన తిరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పాసులు లేకుండా బయటకు వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలందరూ తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.