Custodial Death: మరియమ్మ కస్టోడియల్ డెత్ హైకోర్టు సీరియస్.. మృత దేహానికి రీపోస్టుమార్టం చేయాలని ఆదేశం..

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసు స్టేషన్​లో జరిగిన కస్టోడియల్ డెత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

Custodial Death: మరియమ్మ  కస్టోడియల్ డెత్ హైకోర్టు సీరియస్.. మృత దేహానికి రీపోస్టుమార్టం చేయాలని ఆదేశం..
Telangana High Court
Follow us

|

Updated on: Jun 25, 2021 | 9:44 AM

Adda Gudur Police Station Custodial death: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసు స్టేషన్​లో జరిగిన కస్టోడియల్ డెత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో జ్యుడీషియల్ దర్యాప్తుకు ఆదేశించింది హైకోర్టు. మరియమ్మ డెడ్ బాడీకి రీ పోస్టుమార్టం చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రీపోస్టుమార్టం రిపోర్టు షీల్డ్ కవర్‌లో సమర్పించాలని తెలిపింది. సివిల్ ప్రొసిజర్ కోడ్ 17A ప్రకారం మెజిస్ట్రేట్ తో ఎందుకు విచారణ జరిపించలేదని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. ఈనెల 28న పూర్తి నివేదిక సమర్పించాలని విచారణ వాయిదా వేసింది హైకోర్టు. పోలీసుల వేధింపుల వల్లే మరియమ్మ చనిపోయిందని కోర్టుకు వివరించారు పిటిషనర్ జంధ్యాల. బాధిత కుటుంబానికి రూ.5 కోట్ల పరిహరం అందేలా ఆదేశాలివ్వాలని కోరారు.

మరోవైపు, మరియమ్మ కస్టోడియల్‌ డెత్‌కు కారకులైన పోలీసులపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తదితరనేతలు.. డీజిపీ మహేందర్‌ రెడ్డిని కలిసి అన్యాయంపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలతోపాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై జరుగుతోన్న దాడులను ఫిర్యాదులో ప్రస్తావించారు. సస్పెండ్​ సరిపోదు..మరియమ్మ ఘటనలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తే సరిపోదని నేతలు మండిపడ్డారు. ఘటనకు కారకులైన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అసలేం జరిగిందంటే..

తెలంగాణలోని ఖమ్మం జిల్లా చింతాకణి గ్రామానికి చెందిన మరియమ్మ (40).. యాదద్రి-భువనగిరి జిల్లాలోని గోవిందపురం గ్రామంలో బాలశౌరి అనే పూజారి ఇంట్లో వంట మనిషిగా పనిచేసింది. అయితే , తన ఇంటి నుంచి మరియమ్మ రూ .2 లక్షలు దొంగిలించిందని ఆరోపిస్తూ .. పూజారి ఆమెపై అడ్డగూడురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జూన్ 15 న మరియమ్మ కుమారుడు ఉదయ్ కుమార్, అతని స్నేహితుడు శంకర్‌ ఈ నేరానికి పాల్పడినట్లు అరెస్టు చేసి, చింతాకణి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. రెండు రోజుల తరువాత, ఈ కేసులో ఆమెను కూడా అరెస్టు చేశారు.

కాగా, ముగ్గురు నిందితులను జూన్ 18 న ఉదయం 7 గంటలకు అడ్డగూడురు పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఉదయ్,శంకర్ తాము డబ్బును చోరి చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో మరియమ్మను విచారణ కోసం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పీఎస్ పోలీసులు తీసుకొచ్చారు. అడ్డగూడూరు పీఎస్​లో జూన్​ 18న అనుమానాస్పద స్థితిలో మరియమ్మ మృతిచెందింది. దొంగతనం కేసు విచారణలో పీఎస్​కు తరలిస్తుండగా ఆవరణలోనే స్పృహతప్పి పడిపోవడంత.. ఆమెను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు ఎస్సై మహేశ్ చెప్పుకొచ్చారు. అయితే, పోలీసులు కొట్టడంతోనే మరియమ్మ మరణించినట్లు భారీ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశిస్తూ.. చర్యలు చేపట్టారు.. లాకప్ డెత్ కేసులో పోలీసులపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ చర్యలు తీసుకున్నారు. స్థానిక ఎస్సై మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యపై బదిలీ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారిని భువనగిరి జోన్ డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.

నేషనల్ ఎస్సీ కమీషన్ సీరియస్

పోలీస్ కస్టడీలో మరియమ్మ అనే దళిత మహిళ మృతిపై  జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ చీఫ్ సెక్రటరీ,డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటన సంబంధించిన సమాచారం, వాస్తవాలు, ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని అదేశించింది. అలాగే, రాచకొండ పోలీసు కమిషనర్కి, యాదాద్రి భువనగిరి డిప్యూటీ కమిషనర్కి నోటీసులు జారీ చేసింది. వారంలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది జాతీయ ఎస్సీ కమిషన్.

రాచకొండ సీపీకి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నోటీసులు

మరోవైపు, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు కస్టోడియల్ డెత్‌పై నివేదిక సమర్పించాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌కు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ బహుజన విద్యార్థి సమాఖ్య హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై జులై 28 లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ మహేష్ , కానిస్టేబుళ్లు రషీద్, జానయ్య విచక్షణారహితంగా కొట్టడం వల్లే ఆమె చనిపోయిందని ఎస్‌సీ, ఎస్‌టీ సంఘాల నాయకులు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. రాచకొండ సీపీ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ వారిపై సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులిపేసుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని మానవ హక్కుల కమిషన్‌ను వారు కోరారు.

Read Also…  Robbery : సింగిల్‌గా వచ్చాడు.. సింపుల్‌గా దోచుకెళ్లాడు.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు..