crime: ఉద్యోగాల పేరుతో మహిళల అక్రమ రవాణా..
ఉన్న ఊళ్లో ఉపాధి కరువై ఎంతో మంది గల్ఫ్ దేశాలకు వలసవెళ్తుంటారు. మగవారితో పాటు ఆడవారు సైతం దేశాలు దాటి వెళ్లి పొట్టకూటి కోసం నానా అవస్థలు పడుతుంటారు. పేదరికంతో బాధపడుతున్నవారు, ఆర్థిక అవసరాలున్న వారినే లక్ష్యంగా చేసుకుని విదేశాల్లో ఉపాధి కల్పిస్తామంటూ ఆశలు చూపిస్తున్న కొందరు కేటుగాళ్లు అమాయక మహిళలను మలేషియా ముఠాలకు విక్రయించేస్తున్నారు.
ఉన్న ఊళ్లో ఉపాధి కరువై ఎంతో మంది గల్ఫ్ దేశాలకు వలసవెళ్తుంటారు. మగవారితో పాటు ఆడవారు సైతం దేశాలు దాటి వెళ్లి పొట్టకూటి కోసం నానా అవస్థలు పడుతుంటారు. పేదరికంతో బాధపడుతున్నవారు, ఆర్థిక అవసరాలున్న వారినే లక్ష్యంగా చేసుకుని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. విదేశాల్లో ఉపాధి కల్పిస్తామంటూ ఆశలు చూపించి అమాయక మహిళలను మలేషియా ముఠాలకు విక్రయించేస్తున్నారు. తీరా అక్కడికెళ్లిన తర్వాత తాము మోసపోయామని గుర్తించినా, ఆ నరక కూపం నుంచి బయటపడలేక తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది మహిళలు నేటికీ అక్కడ చిత్రహింసలు అనుభవిస్తున్నారు. ఆ నరక కూపం నుంచి ఎలాగోలా బయటపడ్డ గుంటూరు జిల్లాకు చెందిన ఓ బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విషయం వెలుగులోకి వచ్చింది.
గుంటూరు జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న మహిళల అక్రమ రవాణా విషయం బయటపడింది. ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టైంది.. మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామన్న ఆరుగురు సభ్యుల ముఠా.. మహిళలను మలేషియాలో అమ్మేసింది. ఆ మహిళలను పది రోజుల పాటు బంధించి చిత్రహింసలకు గురిచేశారు. కుటుంబ సభ్యులను సంప్రదించి అతికష్టం మీద బయటపడి ఇండియాకు చేరింది తాడికొండ మండలం రావెల గ్రామానికి చెందిన బాధితురాలు వెంకాయమ్మ.. మలేషియాలో ఓ వ్యాపారి తనను అమ్మేశాడని బోరున విలపించింది. తనను ఆరుగురు సభ్యుల ముఠా నమ్మించి మోసం చేసిందని ఆరోపించింది. తనను మోసం చేసిన ఆరుగురు సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనలా ఇంకా చాలా మంది మహిళలు అక్కడ నరకం అనుభవిస్తున్నారని చెప్పింది. ముఠా సభ్యులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరింది.