కాలుకు సర్జరీ చేస్తే గుండె ఆగిపోయిందట!.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం12లోని TX ఆస్పత్రి నిర్వాకం

నగరంలో నకిలీ డాక్టర్లు ఎక్కువైపోతున్నారు. చూసేందుకు అచ్చం ప్రొఫెషనల్స్‌లా కనిపిస్తారు. కనీసం స్కిల్స్‌ కూడాలేని శుద్ధపప్పులు డాక్టర్‌ కోటు తొడుక్కుని జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి నకిలీగాళ్ల వలలో చిక్కి నిత్యం ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అటువంటి ఘటనే జరిగింది..

కాలుకు సర్జరీ చేస్తే గుండె ఆగిపోయిందట!.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం12లోని TX ఆస్పత్రి నిర్వాకం
Child Died After Minor Leg Surgery At Banjara Hills

Updated on: Jul 08, 2025 | 1:39 PM

హైదరాబాద్‌, జులై 8: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. కాలికి ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో ఆస్పత్రికి వచ్చిన ఐదేళ్ల బాలుడి నిండు ప్రాణాలు తీశారు వైద్యులు. ఈ ఘటన బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 12లోని టీఎక్స్‌ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవల్లి మండలం మెండపల్లి గ్రామానికి చెందిన సిరిసాట్‌ తులసీరామ్‌(5) అనే బాలుడు గత కొంతకాలంగా ఆస్టియోమైలైటిస్‌ (బోన్‌ ఇన్ఫెక్షన్‌) అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో 8 నెలల క్రితం బంజారాహిల్స్‌ రోడ్‌ 12లోని టీఎక్స్‌ ఆస్పత్రిలో చేరగా.. అక్కడి వైద్యులు సర్జరీ చేశారు. కోలుకుంటున్నాడులే అనుకుంటున్న తరుణంలో శుక్రవారం చిన్నారికి కాలికి ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో కుటుంబసభ్యులు మరోసారి టీఎక్స్‌ ఆస్పత్రిలో పరుగెత్తారు. అక్కడి వైద్యులు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బాలుడి కాలుకు ఆపరేషన్‌ చేశారు. ఆపరేషన్‌ చేసిన కాసేపటికే బాలుగి కాలు మొత్తం నీలం రంగులోకి మారింది.

దీంతో అదే రోజు రాత్రి 11గంటల ప్రాంతంలో బాలుడికి మరో సర్జరీ చేస్తామన్నారు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బాబుకు హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చిందని, ఉదయం 8 గంటలకు చనిపోయాడని పసివాడి బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో కుటుంబసభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. వైద్యుల నిర్వకం వల్లనే తమ బిడ్డ మృతి చెందాడంటూ బంధువులు నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాలుడు మృతి చెందినట్లు భావిస్తే ఫిర్యాదు ఇవ్వాలని, కేసు నమోదు చేసి విచారణ చేస్తామని తెలిపారు. అనంతరం ఆస్పత్రి యాజమాన్యం నష్టపరిహారం అందించడంతో బాలుడి మృతదేహాన్ని తీసుకుని బంధువులు వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.