CORONA THIRD-WAVE: దేశంలో కరోనా థర్డ్ వేవ్ షురూ.. ఫిబ్రవరిలో పీక్‌‌లెవెల్లో కేసులు.. WHO వార్నింగ్ ఇదే..!

దేశంలో ఒమిక్రాన్‌ ప్రభావం కొత్త కేసుల సంఖ్యపై స్పష్టంగా కన్పిస్తోంది. గత కొద్ది రోజులుగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్ర, న్యూఢిల్లీలలో ఒమిక్రాన్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉంది.

CORONA THIRD-WAVE: దేశంలో కరోనా థర్డ్ వేవ్ షురూ.. ఫిబ్రవరిలో పీక్‌‌లెవెల్లో కేసులు.. WHO వార్నింగ్ ఇదే..!
Coronavirus
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 06, 2022 | 8:35 PM

CORONA THIRD-WAVE HITS MANY COUNTRIES INCLUDING INDIA: ఒకింత భయం…. దానికి తోడు ఆ.. ఏం అవుతుందిలే అన్న నిర్లక్ష్యం వెరసి యావత్ ప్రపంచం కరోనా థర్డ్ వేవ్ ముంగిట వాలనే వాలింది. ప్రతీ రోజు లక్షల్లో కేసులు నమోదవుతుండడంతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. వారం రోజుల క్రితం రెండు, మూడు వేల కేసులకే రోజూ వారీ సంఖ్య నమోదైన మన దేశం.. ఉన్నట్లుండి ప్రతీరోజు లక్షకు చేరువలో కేసులు నమోదయ్యే ప్రమాదకరమైన పరిస్థితికి చేరుకుంది. దేశంలో థర్డ్‌ వేవ్‌ ముప్పు ముంచుకొచ్చింది అనడానికి ఈ గణాంకాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదా..? ఈప్రశ్న ఇపుడు చాలా మందిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. సగం మంది జనాభా కరోనాకు బలైపోవడం ఖాయమా? అన్న భయాందోళన వ్యక్తమవుతోంది. ఇంతకు ముందెన్నడు చూడని అత్యంత ఘోర విపత్తును చూడబోతున్నామా? రానున్న రెండు నెలల్లో ఏం జరగబోతోంది? దేశంలో అంతకంతకూ రెట్టింపవుతున్న కరోనా.. ఒమిక్రాన్‌ కేసులు టెన్షన్‌ పెడుతున్నాయి.. మరోవైపు న్యూ వేరియంట్‌ ఒమిక్రాన్‌ విలయం సృష్టిస్తోంది. రాకెట్‌ వేగంతో విస్తరిస్తోంది. కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు మూడువేలకు చేరువయ్యాయి. ముఖ్యంగా వాణిజ్య రాజధాని ముంబయిలో కరోనా కోరలు చాచింది. జనవరి 5వ తేదీన ఒక్కరోజే 18వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దాంతో 653కు చేరాయి ఒమిక్రాన్‌ కేసులు. జనవరి 6న సాయంత్రం వెల్లడైన గణాంకాల ప్రకారం ముంబయి నగరంలో 20వేలకు పైగ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో 382మందికి ఒమిక్రాన్‌ నిర్థారణ అయింది. కేసులు పెరుగుతుండటంతో వీకెండ్‌ కర్ఫ్యూ విధించింది ఢిల్లీ సర్కార్‌.

ఇక కర్నాటకలోనూ ఒమిక్రాన్ కల్లోలం సృష్టిస్తోంది. ఒకేరోజు 149 న్యూ వేరియంట్‌ కేసులు వెలుగులోకొచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 226కు చేరింది. కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం..వీకెండ్‌ కర్ఫ్యూ విధించింది. మెడికల్‌ కాలేజీలు మినహా అన్ని కాలేజీలు బంద్‌ చేసింది. 1 నుంచి 9తరగతుల వారికి ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తోంది. ఇక జమ్ము వైష్ణోదేవి యూనివర్సిటీలోనూ కరోనా కలకలం రేగింది. 140 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఒమిక్రాన్‌ వ్యాప్తితో గత కొన్ని రోజులుగా దేశంలో కొత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. మూడో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వచ్చే రెండు వారాలు అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అందరూ అనుకుంటున్నట్టు ఒమిక్రాన్‌ సాధారణ జలుబు లాంటి వ్యాధి కాదు. ఆరోగ్య వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రభావం చూపించొచ్చు. కేసులు అకస్మాత్తుగా, భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. పరీక్షలు చేయడం, రోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం అని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది. భారత్‌లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, వచ్చే రెండు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరొచ్చని డబ్ల్యూహెచ్‌వో భిప్రాయపడింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి తొలి వారం మధ్యలో కరోనా ఉద్ధృతి గరిష్ఠ స్థాయిలో ఉండొచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వ్యక్తం చేశారు. అయితే డెల్టా దశతో పోలిస్తే ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు దేశం సంసిద్ధంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపడటంతో పాటు వ్యాక్సిన్లు కూడా వైరస్‌ ఉద్ధృతిని తగ్గించేందుకు దోహదపడతాయని చెబుతున్నారు.

దేశంలో ఒమిక్రాన్‌ ప్రభావం కొత్త కేసుల సంఖ్యపై స్పష్టంగా కన్పిస్తోంది. గత కొద్ది రోజులుగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్ర, న్యూఢిల్లీలలో ఒమిక్రాన్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పటికే దేశ రాజధానిలో వారాంతపు కర్ఫ్యూ విధించగా.. ముంబయిలోనూ కఠిన ఆంక్షలు అమలు చేయాలని అక్కడి సర్కారు భావిస్తోంది. ఇదిలా ఉండగా.. కఠిన నిబంధనలతోనే కరోనా మూడో దశ ఉద్ధృతిని అదుపులోకి తేవొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ ఆంక్షలతో పాటు, వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో టీకా పంపిణీని ముమ్మరం చేస్తే కేసుల పెరుగుదలను అరికట్టవచ్చని అంటున్నారు. కొత్తగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో 50శాతం వరకూ ఒమిక్రాన్‌ వేరియంట్‌వే ఉంటున్నాయి. వచ్చే రెండు నెలల్లో ప్రపంచం అత్యంత ఘోర విపత్తును ఎదుర్కోబోతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో మొత్తం కేసులన్నీ ఒక లెక్క… ఒక్క GHMC పరిధిలో నమోదయ్యే కేసులు మరో లెక్క. వారం రోజుల్లో కేసులు ఆరేడు రెట్లు పెరిగిపోయాయంటే హైదరాబాద్‌లో కరోనా మళ్లీ ఏ రేంజ్‌లో విజృంభిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణలో ఒక్కరోజు (జనవరి 5న) 1052 కేసులు నమోదైతే… అందులో, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌లోనే 884 ఉన్నాయి. అటు ఏపీలో కరోనా కల్లోలం రేపుతోంది. వారం రోజుల క్రితంతో పోలిస్తే ఇప్పుడు మూడు రెట్లు పెరిగిపోయాయి కేసులు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం రేపుతోంది. ఒక్కరోజులో లక్షల్లో కేసులు.. ముందు ముందు పెను విపత్తు ముంచుకొస్తోందా..? గతంలో ఎన్నడూ లేని విధంగా ఒమిక్రాన్‌ ప్రళయం సృష్టించబోతోందా..? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా..జరగబోయే విపత్తును ఊహించలేమంటున్నారు. ఈ నెల రోజులు అత్యంత కీలకమంటున్నారు వైద్యులు. ఇప్పటికే ఒక్కరోజులోనే లక్ష కేసులు నమోదవుతున్నాయి. ఇక ఫిబ్రవరిలో కరోనా కేసులు పీక్ లెవెల్‌కు చేరుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక ఒమిక్రాన్‌ ధాటికి ప్రపంచదేశాలన్నీ విలవిలలాడిపోతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా రోజుకు లక్షల్లో నమోదవుతున్న కేసులతో అల్లాడిపోతోంది. తాజాగా 24 గంటల్లో 7లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక ఫ్రాన్స్‌లోనూ సేమ్‌ సీన్‌. న్యూ వేరియంట్‌ ఇహూ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో అక్కడ ఒక్కరోజులోనే 3లక్షల మందికి పైగా కరోనా సోకింది. ఇప్పటికే దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ షురూ అయిపోయింది. సెకండ్‌ వేవ్‌కు మించి డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. ఎన్నడూ లేని విధంగా రాకెట్‌ వేగంతో పరుగులు పెడుతోంది. కేవలం 4 రోజుల్లోనే లక్షకు చేరాయి కొవిడ్‌ కేసులు. 24 గంటల్లోనే 90వేల 928 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 325 మంది కరోనా కాటుకు బలయ్యారు. యాక్టివ్‌ కేసులు 2 లక్షల 85 వేల 401కి చేరాయి. అంతకు మించి అన్నట్టుగా ఒమిక్రాన్‌ కూడా విలయం సృష్టిస్తోంది. డిసెంబర్‌ 21న 200 ఒమిక్రాన్‌ కేసులుంటే.. తాజాగా 2,630కి చేరాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు రెట్టింపవుతున్నాయి. తెలంగాణలో పాజిటివిటీ రేటు అమాంతం 4 రెట్లు పెరిగిపోయింది. అయితే 90శాతం కేసుల్లో లక్షణాలు లేవంటున్నారు డీహెచ్ శ్రీనివాసరావు. ఐనా 4 వారాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వాలు కరోనా కట్టడి చర్యలు చేపట్టాయి. ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఐతే ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కేసులు పెరుగుతున్నాయన్నది వాస్తవం. మనం బ్రతకాలంటే జాగ్రత్తలు మస్ట్‌. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నా..ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దు. మాస్క్‌ ధరించడం, ఫిజికల్‌ డిస్టెన్స్‌ కంపల్సరీ. లేదంటే భారీ మూల్యం తప్పదంటున్నారు.

అయితే ప్రజల నిర్లక్ష్యం, విదేశాల నుంచి వచ్చిపడిన ఒమైక్రాన్‌ ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ తెరలేచింది. రోజురోజుకు కరోనా, ఒమైక్రాన్‌ కేసులు అధికమవుతుండడంతో తమిళనాడు ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ‘కఠిన’ నిర్ణయం తీసుకుంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. అంతేగాక రాత్రిపూట కర్ఫ్యూ కూడా విధించింది. జనవరి 6 రాత్రి నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. రాత్రి 10 నుండి వేకువజాము 5గంటల వరకూ ఈ కర్ఫ్యూ అమలులో వుంటుంది. ప్రతి ఆదివారం కఠిన నిబంధనలతో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది స్టాలిన్‌ సర్కార్‌. రాష్ట్రంలో వారం రోజుల వ్యవధిలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 605 నుంచి 3 వేలు దాటడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, హోటళ్లు, టీషాపులు, సినిమా థియేటర్లు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. నిత్యావసర సేవలు మినహా రాష్ట్రమంతటా రాత్రిపూట సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించారు. ఆస్పత్రులు, ఏటీఎంలు, సరకుల వాహన సేవలు, పెట్రోలు, డీజిల్‌ వాహన సేవలకు అనుమతించారు. ప్రభుత్వ, ప్రైవేటు రవాణా, మెట్రోరైలు సర్వీసుల రద్దు చేశారు. హోటళ్ళలో ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటలకు పార్శిల్‌ విక్రయాలకు అనుమతించారు. ఇతర దుకాణాలకు అనుమతి లేదు.

ఓవైపు దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నియంత్రణలో అమలు చేయాల్సిన విధివిధానాలను సవరిస్తూ కొత్త ఉత్తర్వులను జనవరి అయిదవ తేదీన వెల్లడించింది. అదే క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జనవరి 7వ తేదీన వర్చువల్‌గా భేటీ కాబోతున్నారు. తాజా థర్డ్ వేవ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, అనుసరించాలనని విధానాలను, కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను ప్రధాని వివరించే అవకాశం వుంది. అయితే అందరిలోను ఒక్కటే చర్చ వినిపిస్తోంది. మరోసారి దేశంలో లాక్ డౌన్ విధిస్తారా ? ఈ ప్రశ్న అందరిని వేధిస్తోంది. అయితే.. తాజా వేవ్‌లో కరోనా సోకినప్పటికీ లక్షణాలు లేకపోవడం.. వైరస్ నియంత్రణలో వైద్య వ్యవస్థ మెరుగైన విధానాలను అనుసరిస్తుండడం, మరణాల రేటు గణనీయంగా తగ్గడం వల్ల లాక్ డౌన్ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయకపోవచ్చంటున్నారు. అయితే, ఐసోలేషన్ నిబంధనలను మార్చడం, వైద్య సౌకర్యాలను పెంచడం, అవసరాన్ని బట్టి కంటైన్మెంట్ జోన్లను ప్రకటించడం వంటి చర్యలకు రాష్ట్రాలు ఉపక్రమించే అవకాశం వుంది. అదేసమయంలో విదేశీ విమానాల రాకలపై మరింత నిఘా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాక్సినేషన్ వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపునివ్వనున్నట్లు సంకేతాలున్నాయి.

Latest Articles
ఎస్ఐపీ పేమెంట్ మిస్ అయ్యిందా..? తర్వాత జరిగేది తెలిస్తే షాకవుతారు
ఎస్ఐపీ పేమెంట్ మిస్ అయ్యిందా..? తర్వాత జరిగేది తెలిస్తే షాకవుతారు
ఆ ఓట్లు కూడా చెల్లుతాయన్న ఈసీ.. అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్..
ఆ ఓట్లు కూడా చెల్లుతాయన్న ఈసీ.. అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్..
ఐపీఎల్ ఫైనల్.. టాస్ గెలిచిన SRH.. డ్యాషింగ్ ప్లేయర్ ఎంట్రీ
ఐపీఎల్ ఫైనల్.. టాస్ గెలిచిన SRH.. డ్యాషింగ్ ప్లేయర్ ఎంట్రీ
మడమల పగుళ్లకు కొబ్బరినూనె దివ్యౌషధం.. ఇలా వాడితే దూదిలాంటి పాదాలు
మడమల పగుళ్లకు కొబ్బరినూనె దివ్యౌషధం.. ఇలా వాడితే దూదిలాంటి పాదాలు
నెలకు రూ.1000 పెట్టుబడితో కోటి రూపాయల రాబడి..!
నెలకు రూ.1000 పెట్టుబడితో కోటి రూపాయల రాబడి..!
టాస్ గెలిచిన SRH.. ఇంపాక్ట్ ప్లేయర్ గా కివీస్ విధ్వంసకర ప్లేయర్
టాస్ గెలిచిన SRH.. ఇంపాక్ట్ ప్లేయర్ గా కివీస్ విధ్వంసకర ప్లేయర్
బయటి ఫుడ్డు.. హెల్త్‌ ఫట్టు
బయటి ఫుడ్డు.. హెల్త్‌ ఫట్టు
ఏంటా ధైర్యం.. ఏకంగా కలెక్టర్‌‎తోనే ఆటలా.. నకిలీ అకౌంట్ ఓపెన్ చేసి
ఏంటా ధైర్యం.. ఏకంగా కలెక్టర్‌‎తోనే ఆటలా.. నకిలీ అకౌంట్ ఓపెన్ చేసి
డయాబెటిస్‌లో చర్మ సంరక్షణ నిర్లక్ష్యం చేయకండి.. ఇలా సన్‌స్క్రీన్‌
డయాబెటిస్‌లో చర్మ సంరక్షణ నిర్లక్ష్యం చేయకండి.. ఇలా సన్‌స్క్రీన్‌
ఆ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్..ఆధార్ లేకుండానే సెటెల్‌మెంట్
ఆ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్..ఆధార్ లేకుండానే సెటెల్‌మెంట్