CoWin App: మోగిన బడి గంట.. ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్.. వారి కోసం ఆ యాప్‌లో ప్రత్యేకమైన కేటగిరీలు
కరోనా మహమ్మారి పుణ్యమాని ఇంతకాలం మూతపడ్డ విద్యా సంస్థలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాలు స్కూళ్లను తిరిగి ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నాయి.
CoWin App for School Staff: కరోనా మహమ్మారి పుణ్యమాని ఇంతకాలం మూతపడ్డ విద్యా సంస్థలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాలు స్కూళ్లను తిరిగి ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇటు తెలంగాణలోనూ సెప్టెంబర్ 1నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు అనుమతినిచ్చింది. అయితే, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పునః ప్రారంభించాలని కేంద్ర సర్కార్ భావిస్తోంది. ఇదే క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కోవిడ్ యాప్‌లో కీలక మార్పులు చేసింది.
కరోనా వ్యాక్సిన్ల నమోదుకి ఉపయోగిస్తున్న కోవిన్ (CoWin) యాప్‌లో టీచర్లు, నాన్-టీచింగ్ సిబ్బంది కోసం 2 ప్రత్యేక కేటగిరీలు ప్రవేశపెట్టింది. తద్వారా వీలైనంత త్వరగా టీచర్లు, నాన్-టీచింగ్ సిబ్బందికి వ్యాక్సిన్లు వేయడానికి వీలవుతుందని భావిస్తోంది. దీని వల్ల స్కూళ్లకు వెళ్లే పిల్లలకు కూడా టీచర్ల ద్వారా కరోనా సోకే అవకాశం తగ్గుతుంది. అలాగే పిల్లల ద్వారా టీచర్లకు కరోనా సోకే అవకాశం కూడా తగ్గనుంది. ఇప్పుడు ఈ రెండు కేటగిరీల్లో స్లాట్ బుక్ చేసుకునే టీచర్లు, నాన్-టీచింగ్ సిబ్బందికి వ్యాక్సిన్లు వెయ్యాలంటే… ఉన్నవి సరిపోవని రాష్ట్రాలు అనే ఛాన్స్ ఇవ్వకుండా కేంద్రం అదనంగా 2 కోట్ల వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఇచ్చింది. సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం కాబట్టి.. ఆలోగా ఈ వ్యాక్సిన్లు వేయించేయాలన్నది కేంద్రం ప్లాన్‌గా తెలిసింది.
“రాష్ట్రాలు తప్పనిసరిగా అందరు చీటర్లు, నాన్-టీచింగ్ సిబ్బందికి వ్యాక్సిన్ పడేలా చెయ్యాలి. ఇప్పటికే చాలా మంది మొదటి డోస్ పొందారు. ఇప్పుడు లక్ష్యం ఏంటంటే… వారిలో సంపూర్ణమైన వ్యాధినిరోధక శక్తి ఉండాలి” అని ఇమ్యునైజేషన్‌పై ఏర్పడిన నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఛైర్మన్ ఎన్ కే అరోరా అన్నారు. అంటే మొదటి డోస్ వేసుకున్న వారు ఛాన్స్ ఉంటే… రెండో డోస్ వేసేసుకోవాలని ఆయన సూచించారు. మన దేశంలో దాదాపు 97 లక్షల మంది టీచర్లు ఉన్నారు. వారిలో 50 శాతం మందికి ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీ కే పాల్ తెలిపారు. మిగిలిన వారు కూడా త్వరలోనే వ్యా్క్సిన్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.
స్కూళ్లు మళ్లీ ప్రారంభం కావాలంటే… ఇలాంటి చర్యలు తప్పవు అని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇండియాలో కరోనా వచ్చాక 18 నెలలుగా స్కూళ్లు మూతబడి ఉన్నాయి. అందువల్ల పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల కెరీర్ దెబ్బతింటోందనీ, ఫిజికల్ యాక్టివిటీ పోయి లావు అయిపోతున్నారని ఫీలవుతున్నారు. అందువల్ల స్కూళ్లు మళ్లీ తెరవడం మంచిదే అని ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. కేంద్రం వైపు నుంచి 2 కోట్ల డోసులు వచ్చేశాయి కాబట్టి ఇక ఇప్పుడు టీచర్లకు వ్యాక్సిన్ వేయించే పని రాష్ట్రాలదే. వీలైనంత త్వరగా ఈ పని పూర్తయ్యేలా రాష్ట్రాలు త్వరపడాల్సి ఉంటుంది. దీని వల్ల తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లల్ని స్కూళ్లకు పంపినా ఏం కాదనే ధైర్యం వస్తుంది. ముఖ్యంగా రేపటి నుంచి స్కూళ్లు తెరుస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త 2 కేటగిరీలపై బాగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి.. టీచర్లు, నాన్-టీచింగ్ సిబ్బందికి వ్యాక్సిన్లు పూర్తిగా వేయించాల్సిన అవసరం ఉంది.