PMGKP Scheme: కోవిడ్ వారియర్స్‌కు పెద్ద ఊరట.. ఏప్రిల్ 24 నుంచి కొత్త బీమా విధానం : కేంద్ర ఆరోగ్య శాఖ
కరోనా యోధులకు బీమా కవర్ చేసేందుకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద ఇన్సురెన్స్ కంపెనీ చేత అన్ని క్లెయిమ్స్ పరిష్కరించనున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Relief Covid 19 Warriors: యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తోంది. ప్రస్తుతం కరోనా రెండో వేవ్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా యోధులకు బీమా కవర్ చేసేందుకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద ఇన్సురెన్స్ కంపెనీ చేత అన్ని క్లెయిమ్స్ పరిష్కరించనున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 24లోపు ఇన్సురెన్స్ కంపెనీ చేత సెటిల్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. కరోనా వారియర్స్ ను కవర్ చేసే ఈ నూతన పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఇన్సురెన్స్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్లు ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ(పీఎంజీకేపీ) కింద కోవిడ్ 19 వారియర్స్‌కు ఏప్రిల్ 24వ తేదీ నుంచి కొత్త బీమా విధానం అమల్లోకి రానుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అప్పటిలోగా బీమా క్లెయిమ్‌ల చెల్లింపులను పూర్తి చేస్తామని ప్రకటించింది. కరోనా వారియర్స్ కోసం కొత్తగా అమల్లోకి తేనున్న బీమా కవరేజీ విధానంపై న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. కరోనా వారియర్స్‌కు సంబంధించి 287 క్లెయిమ్‌ల చెల్లింపులను ఇప్పటి వరకు బీమా కంపెనీ పూర్తి చేసినట్లు ట్విట్టర్‌లో వివరించింది. విధి నిర్వహణలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఆరోగ్య కార్యకర్తల కుటుంబాలకు దీని ద్వారా రూ.50 లక్షలు అందుతాయి.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ పథకం మార్చి 2020న ప్రకటించారు. దీన్ని ఏప్రిల్ 24, 21 వరకు మూడు సార్లు దీన్ని పొడిగించారు. కోవిడ్ 19 వల్ల ఏదైనా ప్రతికూలత ఎదురైతే ఆరోగ్య కార్మికులకు భద్రతా సదుపాయాన్ని అందించడానికి దీన్ని ప్రారంభించిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం కింద రూ.50 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించామని వెల్లడించింది. కోవిడ్ తో పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తల్లో మనో ధైర్యాన్ని పెంచడంలో ఈ పథకం ఓ ముఖ్యమైన పాత్ర పోషించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
మరోవైపు, దేశంలో కరోనా చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. రికార్డు స్తాయిలో రోజువారీ పాజిటివ్ కేసుల మంగళవారం 2.59 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో భారతదేశం 1,761 కోవిడ్ మరణాలను నమోదు చేసింది, మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 1.53 కోట్లకు పైగా ఉంది. దీంతో పలు రాష్ట్రాల్లో కఠినమైన కరోనా ఆంక్షలు అమలవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ వారం రోజుల పూర్తి లాక్‌డౌన్ ప్రకటించగా, మరో కరోనా ప్రభావిత రాష్ట్రం మహారాష్ట్ర కూడా లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తోంది.