తెలంగాణలో టెన్త్ పరీక్షల నిర్వహణ
రాష్ట్రంలో టెన్త్ పరీక్షలపై కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెలా ...

కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండటం, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటం లాంటి పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఎంసెట్ సహా రాష్ట్రంలో మే నెలలో జరుగాల్సిన అన్ని రకాల ప్రవేశ పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడిప్పుడే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గిపోతూ వస్తోంది. దీంతో వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చిందని భావించిన సర్కార్ మెల్లిమెల్లిగా లాక్‌డౌన్ సడలింపులు మొదలు పెట్టింది. ఇప్పటికే గ్రీన్ జోన్‌లలో అన్ని కార్యాకలాపాలకు అనుమతులనిచ్చింది. ఇక ఆరంజ్ జోన్, రెడ్ జోన్లలో ఆంక్షలతో కూడిన సడలింపు కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే, మే నెల 15 కల్లా లాక్‌డౌన్‌పై పూర్తి క్లారిటీ వస్తుందని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో టెన్త్ పరీక్షలపై కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెలాఖరులో టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇప్పటికే 3 పరీక్షలు పూర్తికాగా, మిగిలినవి నిర్వహించుకోవచ్చని హైకోర్టు అనుమతి ఇవ్వగానే విద్యార్థులు రెడీ అయ్యేందుకు 7-10 రోజుల సమయమిస్తామని అధికారులు తెలిపారు. మొత్తానికి మే నెలాఖరులో ఎగ్జామ్స్ మొదలుపెట్టి జూన్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు. సెంటర్ల సంఖ్యను రెట్టింపు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.