PM Modi Video Conference: దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. సీఎంలకు దిశా నిర్దేశం చేసిన ప్రధాని మోదీ..
PM Modi: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండదంటూ తేల్చి చెప్పారు ప్రధాని మోదీ. కరోనా కేసులు పెరిగినా ఆందోళన చెందవద్దని సూచించారు. కరోనా కట్టడికి ఏం చేద్దాం? ఎలా ముందుకెళ్లాలి? దీనిపై ముఖ్యమంత్రులతో...
PM Modi-CMs Meeting: దేశంలో మరోసారి లాక్‌డౌన్ లేదని స్పష్టం చేశారు ప్రధానమంత్రి మోదీ. అలాగని కరోనాను లైట్ తీసుకోవద్దని రాష్ట్రాలకు సూచించారు. టెస్టులు చేయడంతో పాటు వ్యాక్సినేషన్‌లో వేగం పెంచాలని కోరారు. మాస్ వ్యాక్సినేషన్ కోసం ఏప్రిల్ 11 నుంచి 14 వరకూ వ్యాక్సినేషన్ ఉత్సవ్ నిర్వహించాలని ప్రకటించారు ప్రధాని.
ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నందున మరోసారి లాక్‌డౌన్ పెట్టే ఉద్దేశం లేదని రాష్ట్రాలకు స్పష్టం చేశారు ప్రధాని మోదీ. సెకండ్ వేవ్‌లో కరోనా కేసుల పెరుగుదల ప్రమాదకరంగా ఉందని.. దీన్ని కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా కట్టడికి రాత్రి పూట కర్ఫ్యూ మంచి ప్రత్యామ్నాయమని అన్నారు. రాత్రి పూట కర్ఫ్యూకి కరోనా కర్ఫ్యూగా పేరు పెట్టాలని కోరారు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయన్న మోదీ.. కేసుల్ని తగ్గించేందుకు టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్ తప్పదని సూచించారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచడం…కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి వైరస్ సోకిన వాళ్లను ఐసోలేట్ చేయడం ముఖ్యమని చెప్పారు.
దేశంలో ప్రస్తుతం వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో పాటు ఆరోగ్య సదుపాయాలు మెరుగయ్యాయని ప్రధాని గుర్తు చేశారు. 45 ఏళ్లు దాటిన వాళ్లందరికీ వందశాతం వ్యాక్సిన్లు అందించాలని రాష్ట్రాలను కోరారు. వ్యాక్సిన్లు వృధా చేయవద్దని కోరారు. వ్యాక్సిన్లు వృధా కాకుండా అందరికీ వ్యాక్సిన్లు ఇచ్చేందుకు వీలుగా ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహిస్తామని తెలిపారు.
వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్‌లో అక్కడక్కడా సమస్యలు ఎదురవుతున్నాయని… వీటి్ని అధిగమించేందుకు యువత అందరికీ సహకరించాలని కోరారు. కరోనాపై అవగాహన కల్పించడం, వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, ప్రముఖుల సహకారం తీసుకోవాలని కోరారు. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రులు పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి గవర్నర్లు చొరవ తీసుకుని.. ప్రజాప్రతినిధులతో వెబినార్లు నిర్వహించాలన్నారు మోదీ. టెస్టింగ్, వ్యాక్సినేషన్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్రాలను కోరారు.