Corona Vaccine: దేశ వ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్.. టీకాలు అందక జనం కష్టాలు.. ఇంతకీ ఏ రాష్ట్రం వద్ద ఎన్ని ఉన్నాయంటే..?
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ అందరినీ భయపెడుతోంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు వ్యాక్సిన్‌నేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా కొనసాగుతోంది.
India Corona Vaccine status: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ అందరినీ భయపెడుతోంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు వ్యాక్సిన్‌నేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. మే 1 నుంచి అందరికీ వ్యాక్సిన్ అని చెప్పిన ఆరు రోజులు గడిచినా ఇంకా సమస్యలే. ధర్డ్ ఫేజ్ వ్యాక్సినేషన్లో బాగంగా 18 – 45 ఏళ్ల వయస్సు వారికి టీకా వేసే కార్యక్రమం చాలా రాష్ట్రాల్లో అసలు ప్రారంభం కాలేదు. కేవలం 9 రాష్ట్రాల్లోనే కొద్ది శాతానికి వ్యాక్సిన్లు వేశారు. రాష్ట్రాలన్నీ కేంద్రం తమకు అవసరమైనన్ని వ్యాక్సిన్లు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నాయి. వ్యాక్సిన్లన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు వెళుతున్నాయనేది మరో ఆరోపణ. 18 ఏళ్ల పైబడిన మూడున్నర కోట్ల మంది కోవిన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరిలో కేవలం రెండు శాతం మందికి మాత్రమే టీకాలు అందినట్లు అయా రాష్ట్రాలు చెబుతున్నాయి,
అయితే, దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వాక్సిన్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని రాష్ట్రాలను వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 89లక్షల వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. వచ్చే మూడు రోజుల్లో మరో 28లక్షల వ్యాక్సిన్‌లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకూ రాష్ట్రాలలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 17 కోట్ల15 లక్షల 42 వేల 410 వ్యాక్సిన్ డోస్‌లను ఉచితంగా అందించినట్లు తెలిపింది. ఇందులో మొత్తం 16,26,10,905 వ్యాక్సిన్ డోసులను ఇప్పటి వరకు ప్రజలకు అందించారు.
‘ఈ లెక్కన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 89లక్షల వ్యాక్సిన్ డోస్‌లు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో వినియోగం కూడా అధికంగానే ఉంది. కేంద్రం అందిస్తున్న వ్యాక్సిన్‌లను రాష్ట్రాలు సరిగా సర్దుబాటు చేసుకోకపోవడం వల్ల కొన్ని చోట్ల వ్యాక్సిన్ కొరత కనిపిస్తోంది. రాబోయే మూడు రోజుల్లో 28లక్షల వ్యాక్సిన్‌లు అందిస్తామని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్ మార్గదర్శకాలను కేంద్రం సవరించిన సంగతి తెలిసిందే. కొవిడ్ పోర్టల్ లేదా ఆరోగ్యసేతులలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా దగ్గరిలోని ఆరోగ్య కేంద్రం వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
ఇదిలావుంటే, 18 – 44 ఏళ్ల కేటగిరిలో గుజరాత్‌లో రెండు లక్షలు, రాజస్థాన్‌లో లక్ష 26వేలు, మహారాష్ట్రలో కోటి 11 లక్షల మందికి వ్యాక్సిన్ అందినట్లు సమాచారం. గుజరాత్, రాజస్థాన్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్ అందుబాటులో ఉంది. మహారాష్ట్రలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ రెండూ ప్రజలకు అందాయి. హర్యానాలో దాదాపు లక్ష మందికి టీకా అందగా.. ఢిల్లీలో 80 వేల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో మూడో దశ ఇంకా ప్రారంభం కాలేదు. రష్యా నుంచి స్పుత్నిక్ వి టీకాతో పాటు అమెరికా నుంచి వ్యాక్సిన్ డోసులు త్వరలో భారత్ రానున్నాయి. అవన్నీ వస్తే.. వ్యాక్సినేషన్ కార్యక్రమం పికప్ అవుతుందని అంటున్నారు అధికారులు.
ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాత కర్నాటకలో కేసులు ఎక్కువగా ఉన్నాయి. కర్నాటక ప్రభుత్వం 18 ఏళ్ల పైబడిన వాళ్లందరికీ వ్యాక్సిన్లు వెయ్యడం ఇప్పట్లో సాధ్యం కాదని ప్రకటించింది. ఫస్ట్ డోస్ వేసుకున్న వారికి సెకండ్ డోస్ వెయ్యడానికి అష్టకష్టాలు పడుతోంది యడ్యూరప్ప ప్రభుత్వం. గుజరాత్, మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వ్యాక్సినేషన్ వేస్తున్నారు. జనవరిలో ప్రారంభించినా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 3.2 కోట్ల మందికే రెండు డోసులు వ్యాక్సిన్ వేశారు. 13 కోట్ల మందికి ఫస్ట్ డోస్ వేశారు. కావలసినన్ని డోసులు అందుబాటులో లేకపోవడం… కేసులు పెరుగుతూ ఉండటంతో రాష్ట్రాలు లాక్‌డౌన్ పెడుతున్నాయి.
ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి అలానే ఉంది. ఏపీలోని కొన్ని వ్యాక్సినేషన్ సెంటర్లలో వృద్ధులు వ్యాక్సిన్ కోసం వచ్చి గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఈ నెల 15లోగా 9 లక్షల వ్యాక్సిన్ డోసులు వస్తాయని.. వాటిని45 ఏళ్లు పైబడిన వారికి రెండో డోసుగా వేస్తామని ఏపీ సర్కారు ప్రకటిచింది. వాళ్లకు వేసిన తర్వాత మిగిలిన డోసుల్ని 45 ఏళ్లు నిండిన ఆర్టీసీ, బ్యాంకు ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు మొదటి డోసుగా వేస్తామంది. ఏపీలో కర్ఫ్యూ ఆంక్షల్ని కఠినంగా అమలు చేస్తున్నారు. అక్కడ ప్రతీ రోజూ 20వేల కేసులు వస్తున్నాయి. వ్యాక్సిన్లతో పాటు ఆక్సిజన్ కొరత కూడా పెరుగుతోంది.
మూడో విడత వ్యాక్సినేషన్ ప్రారంభించే నాటికి కొన్ని రాష్ట్రాల దగ్గర ఐదు లక్షల డోసులు ఉంటే.. మరి కొన్ని రాష్ట్రాల దగ్గర లక్ష డోసులే ఉన్నాయి. తమకు వ్యాక్సిన్లు కావాలంటా రాష్ట్రాలన్నీ సీరం ఇన్‌స్టిట్‌ట్యూట్‌కు లేఖలు రాస్తున్నాయి. తెలంగాణలోనూ వ్యాక్సిన్ల కొరత ఉంది. ఉన్న వ్యాక్సిన్లను 45 ఏళ్ల పైబడిన వారికే వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రైవేటు ఆసుపత్రులు వ్యాక్సిన్ వెయ్యవచ్చని.. అయితే, వాళ్లు సొంతంగా సమకూర్చుకోవాలని సూచించింది తెలంగాణ ఆరోగ్యశాఖ.
మరోవైపు, దేశవ్యాప్తంగా ఇప్పటి వకూ 8 లక్షల డోసులు వృధా అయినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం రోజూ 18 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇదే స్పీడుతో దేశ ప్రజలందరికీ టీకాలు వెయ్యాలంటే రెండేళ్లు పట్టే అవకాశముందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Also… Oxygen Scarcity: ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితుల ఆక్రందనలు.. పెరిగిన ఉత్పత్తి.. అయినా సమస్యే ఎందుకంటే?