దేశవ్యాప్తంగా దడ పుట్టిస్తున్న మహమ్మారి.. కరోనా మరణాలతో రద్దీగా మార్చురీలు.. ప్రభుత్వ ఆసుపత్రిలో దయనీయ పరిస్థితి!
దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఆక్సిజన్ కొరత కారణంగా 10 మంది పేషంట్స్ చనిపోయిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపింది.
India corona deaths: దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఆక్సిజన్ కొరత కారణంగా 10 మంది పేషంట్స్ చనిపోయిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపింది. అటు సూరత్ శ్మశాన వాటికలో చితి మంటలు కాలుతూనే ఉన్నాయి. ఇటు రాయ్‌పూర్‌లో చనిపోయిన వారి మృతదేహాలను దాచి పెట్టేందుకు మార్చూరీ నిండిపోయింది. ఇలా దేశంలో పలు చోట్ల హృదయ విదాకర ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి
దేశంలో ఎక్కడ చూసినా ఎటు చూసినా అత్యంత హృదయ విదారక పరిస్థితులు..దయనీయంగా మారిన ఆస్పత్రులు. బెడ్స్ నిండిపోయాయి. వెంటిలేటర్స్, ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఇక కరోనాతో మృతి చెందితే అంతే సంగతులు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ఆస్పత్రిలో దారుణం వెలుగు లోకి వచ్చింది. ఆక్సిజన్ లభించక 10 మంది కరోనా పేషంట్స్ ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మరోవైపు డెడ్‌బాడీస్‌ను తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. మార్చురీల్లోనే పేరుకుపోతున్నాయి మృతదేహాలు.
మహారాష్ట్రలో కరోనా విజృంభణతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఎటు చూసినా హృదయం ద్రవించిపోయే దృశ్యాలే. వేల సంఖ్యలో వస్తున్న కరోనా బాధితులకు ఎలా చికిత్స అందించాలో అర్థంకాక.. కటిక నేలమీదే వైద్యం అందిస్తున్నారు. ఇక మహారాష్ట్రలో అలా ఉంటే..గుజరాత్‌లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆస్పత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోయాయి. ఇటు బెడ్స్, అటు నేలమీద కూడా ఖాళీ లేక.. అంబులెన్స్‌లు ఆస్పత్రి బయటే పడిగాపులు కాస్తున్నాయి. ఒకటి, రెండు కాదు..పదుల సంఖ్యలో అంబులెన్స్‌లు..ఇలా వేచి ఉన్నాయి. ఇది..అహ్మదాబాద్‌లోని సివిల్ హాస్పిటల్ వద్ద పరిస్థితి. ఎప్పుడెప్పుడు ఖాళీ దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నాయి. దీంతో అంబులెన్సుల్లో సరైన ట్రీట్‌మెంట్ అందక..బాధితులంతా నరకయాతన అనుభవిస్తున్నారు.
ఇక ఇటు హాస్పిటల్సే అనుకుంటే..అటు శ్మశాన వాటికల్లో కూడా గుండెలు చలించిపోయే దృశ్యాలు కన్పిస్తున్నాయి. చితి మంటలు ఆరడమే లేదు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా దహన సంస్కారాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయినా సరే కుప్పలు కుప్పలుగా వచ్చిపడుతున్నాయి కరోనా డెడ్‌బాడీస్. సూరత్‌లో కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఖాళీ ఉండటం లేదు. అక్కడి గ్రేవ్ యార్డ్స్‌లో చితి మంటలు ఆరడమే లేదు.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో అతిపెద్దదైన డాక్టర్ అంబేడ్కర్ స్మారక ప్రభుత్వాస్పత్రిలో దయనీయ స్థితి. కరోనా కరాళ నృత్యానికి ఇక్కడి మార్చురీనే నిదర్శనంగా కనిపిస్తోంది. కరోనా కట్టడికి చత్తీస్‌ఘడ్ ప్రభుత్వం చాలా జిల్లాల్లో లాక్‌డౌన్ విధించింది. అయినప్పటికి పరిస్థితి అదుపు లోకి రావడం లేదు. కాగా, పెరుగుతున్న కేసుల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యాలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అవసరమైన కోవిడ్ వ్యాక్సిన్ల అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు టీకాలకు తోడు ఇతర దేశాల్లో అనుమతులు లభించిన వ్యాక్సిన్లను మన దేశానికి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Read Also… బీజేపీలో చేరిన నటి హేమ.. ఫస్ట్ స్పీచ్‌తోనే బీజేపీ నేతలకు చుక్కలు.. వైరల్‌గా మారిన వీడియో