కారు కొనండి..వచ్చే ఏడాది డబ్బు కట్టండి: మహీంద్రా అండ్ మహీంద్రా బంపర్ ఆఫర్

కరోనా సంక్షోభంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు, అమ్మకాలను పెంచుకునేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా వినూత్న పథకాలను ప్రవేశపెట్టింది.

కారు కొనండి..వచ్చే ఏడాది డబ్బు కట్టండి: మహీంద్రా అండ్ మహీంద్రా బంపర్ ఆఫర్
Follow us

|

Updated on: May 20, 2020 | 11:15 AM

లాక్‌డౌన్ అన్ని రంగాలను కుదిపేసింది. ముఖ్యంగా వాహనాల కొనుగోలు, అమ్మకాలు లేక పలు కంపెనీలు తలలుపట్టుకునే స్థితి నెలకొంది. ఈ క్రమంలోనే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీ వాహనాల విక్రయాలను పెంచుకోవడానికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. లాక్‌డౌన్‌లో క్రమంగా సడలింపులు ఇవ్వడంతో వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి మహీంద్ర కంపెనీది నిజంగానే బంపర్ ఆఫర్‌గానే చెప్పాలి.

కరోనా సంక్షోభంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు, అమ్మకాలను పెంచుకునేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా వినూత్న పథకాలను ప్రవేశపెట్టింది. వైద్యులు, పోలీసులు, సరుకు రవాణా వాహనాల యజమానులకు విడివిడిగా కొన్ని సాధారణ వినియోగదారులకు మరిన్ని రుణ పథకాలను ఆవిష్కరించింది. సాధారణ వినియోగదారులు ఎవరైనా మహీంద్రా ఎస్‌యూవీ కొనుగోలు చేసి వచ్చే ఏడాది నుంచి ఈఎంఐ చెల్లించేలా ఆఫర్ ప్రకటించింది. 100శాతం ఆన్ రోడ్ ఫండింగ్ ఇస్తోంది. వాహనం కొనుగోలు చేసే సమయంలో వైద్యులు, పోలీసులు, మహిళలకు ప్రాసెసింగ్ ఫీజులో కూడా సగం రాయితీ ఉంటుందని మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సీఈవో విజయ్ నక్రా తెలిపారు. వాహనం కొనుగోలు చేసిన 3 నెలల తర్వాత నగదు కట్టొచ్చు.

అలాగే ఫైనాన్సింగ్ కాస్ట్ పది బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తారు. బీఎస్-6 స్టాండర్డ్స్ కలిగిన పికప్ ట్రక్, ఎస్‌యూవీ కొనుగోలు చేసిన వారు వచ్చే ఏడాది నుంచి ఈఎంఐ కట్టేందుకు అవకాశం ఇస్తారు. వాహనం కోసం తీసుకున్న లోన్ మొత్తంలో ప్రతీ లక్ష రూపాయలకు నెలకు రూ.1234 చొప్పున ఈఎంఐ కడితే సరిపోతుందని విజయ్ నక్రా తెలిపారు. అయితే ఈ ఆఫర్.. పోలీసులు, వైద్యులు, మహిళలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. కరోనా వైరస్ సందర్భంగా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులకు, అహోరాత్రులు శ్రమిస్తోన్న పోలీసులకు ప్రయోజనం కల్పించేందుకు ఈ ఆఫర్ ప్రకటించినట్లుగా వారు వెల్లడించారు.