AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid vaccine: కరోనా వ్యాక్సిన్ మిమ్మల్ని ఎంతకాలం కాపాడుతుంది?.. ఇమ్యూనిటీ కోసం బూస్టర్ డోసు అవసరమా?

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వినియోగంలో ఉన్న అగ్రశ్రేణి వ్యాక్సిన్ల వల్ల కరోనా నుంచి దీర్ఘకాల రక్షణ లభించవచ్చని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Covid vaccine: కరోనా వ్యాక్సిన్ మిమ్మల్ని ఎంతకాలం కాపాడుతుంది?.. ఇమ్యూనిటీ కోసం బూస్టర్ డోసు అవసరమా?
Covid Vaccine
Balaraju Goud
|

Updated on: Jun 04, 2021 | 3:51 PM

Share

Covid Vaccine Protect:  ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. కోట్లాది మంది కరోనా గురైతే, లక్షలాది మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే, ఇప్పటివరకు వైరస్ అంతానికి ఔషధం లేక జనం నానావస్థలు పడుతున్నాయి. అయితే, కొన్ని డ్రగ్స్ సంస్థలు రూపొందించిన వ్యాక్సిన్ వల్ల కొంత ఉపశమనం కలగవచ్చన్న నిపుణులు సూచనల మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.

ఇండియాలో రోజూ లక్షల మందికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఇప్పటికే 21.85 కోట్ల మంది వేయించుకున్నారు. ఇండియాలో ప్రస్తుతం 3 వ్యాక్సిన్లకు అనుమతి ఉంది. అవి పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ (Covishield), హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్ (Covaxin), రష్యాలో ఉత్పత్తి అవుతున్న స్పుత్నిక్ వి (Sputnik V). ఇవన్నీ రెండు డోసులు వేసుకోవాల్సిన వ్యాక్సిన్లే. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక డోస్ వేసుకున్నవారు… రెండో డోస్‌ను 12 వారాల తర్వాత 16 వారాల లోపు వేసుకోవచ్చని తెలిపింది. అలాగే… కోవాగ్జిన్‌ను 4 వారాల తర్వాత 6 వారాల లోపు వేసుకోమంది. ఇక స్పుత్నిక్ వి రెండో డోస్‌ను 21 రోజుల తర్వాత నుంచి 90 రోజుల లోపు వేసుకోమంది. జనరల్‌గా ఎవరైనా ఒక డోస్ వేసుకుంటే… చాలా వరకూ రక్షణ లభించినట్లే.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లోని డాక్టర్ క్యాథెరిన్ ఓబ్రియన్ ప్రకారం… మొదటి డోస్ వేసుకున్న 2 వారాల్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కానీ రెండో డోస్ వేసుకున్న తర్వాతే… ఇమ్యూనిటీలో చురుకుదనం వస్తుంది. రెండో డోస్ తర్వాత ఇమ్యూనిటీ పవర్ (వ్యాధి నిరోధక శక్తి) మరింత పెరుగుతుంది.

అయితే, కోవిడ్‌ 19 టీకాల వల్ల జీవితకాల రక్షణ లభిస్తుందా లేక కొంతకాలానికి బూస్టర్‌ డోసులు అవసరమవుతాయా అన్నదానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వినియోగంలో ఉన్న అగ్రశ్రేణి వ్యాక్సిన్ల వల్ల కరోనా నుంచి దీర్ఘకాల రక్షణ లభించవచ్చని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తరచూ బూస్టర్‌ డోసులు పొందాల్సిన అవసరం ఉండకపోవచ్చని చెబుతున్నారు. కొవిడ్​ 19 టీకా బూస్టర్​ డోసు అవసరమా? లేదా? అన్న విషయంపై ప్రస్తుతం అధ్యయనం జరుగుతోందని కేంద్రం వెల్లడించింది. ఏ వ్యాక్సిన్ అయినా.. వైరస్​ నుంచి పూర్తి స్థాయిలో రక్షణ ఇవ్వలేదని పేర్కొంది.

తనకు తారసపడే వైరస్‌లను మానవ శరీరం ఎలా గుర్తుంచుకుంటుందన్న అంశంపై కొత్తగా వెలుగు చూస్తున్న ఆధారాలు ఈ వాదనను బలపరుస్తున్నాయన్నారు. అయితే, కరోనా వైరస్‌లో ఉత్పరివర్తనలు ఇంకా చోటుచేసుకుంటున్నందువల్ల ఈ అంశంపై మరింత పరిశోధన అవసరమని సైంటిస్టులు సూచిస్తున్నారు. ఫైజర్‌, మోడెర్నా సంస్థలు రూపొందించిన ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు కేవలం యాంటీబాడీలపైనే ఆధారపడవని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. ప్రత్యామ్నాయ రక్షణ విధానాలుగా శరీరంలో అనేక అంచెల భద్రత ఉంటుందని పేర్కొన్నాయి. టీకా పొందాక విడుదలయ్యే యాంటీబాడీలు కొంతకాలానికి తగ్గిపోతాయి. అవి ఏ స్థాయికి పడిపోయాక.. సొంతంగా కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం తగ్గిపోతుందన్నది ఇంకా తేలలేదు. టీకా రక్షణ అపరిమితం కాదని అమెరికాలో అగ్రశ్రేణి అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఇటీవల సెనేట్‌ ఉపసంఘాన్ని తెలిపారు.

ఫ్లూకు ఇచ్చినట్లుగానే కోవిడ్‌కూ ఏటా టీకాలు ఇవ్వాల్సి ఉంటుందని ఫైజర్‌, మోడెర్నాలు చెబుతున్నాయి. ఈ మేరకు బూస్టర్‌ డోసులను సిద్ధం చేసే పనిలో పడ్డాయి. వీటిని ఎప్పుడు ఇవ్వాలన్నది ప్రభుత్వ నియంత్రణ సంస్థలే నిర్ణయించాలి. ఏటా కాకుండా కొన్నేళ్లకోసారి బూస్టర్లు అవసరమవుతాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలావుంటే, వ్యాక్సినేషన్​ ప్రక్రియలో భాగంగా ఇమ్యూనిటీని పెంచేందుకు.. బూస్టర్ డోసు అవసరం ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. దీనిపై అధ్యయనాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాలా? లేదా? అనే అంశంపై ‘కొవాగ్జిన్’ ట్రయల్స్ జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.ప్రస్తుతం రెండు డోసులు తీసుకుని జాగ్రత్తలు వహించాలని పాల్ కోరారు. బూస్టర్​ డోసుపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

Read Also….  Junior Doctors Resign: మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్ల షాక్.. తమ డిమాండ్స్ పరిష్కరించాలంటూ 3 వేల మంది వైద్యుల రాజీనామా