Free Cremation: కరోనా మృతులకు ఉచితంగా అంత్యక్రియలు.. కీలక నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం!
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతోంది. కరోనా అంటేనే ఆమడ దూరం పరుగులు తీసే పరిస్థితులు నెలకొన్నాయి.
Free Cremation of Covid Victims: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతోంది. కరోనా అంటేనే ఆమడ దూరం పరుగులు తీసే పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా కష్టకాలంలో రక్త సంబంధీకులు సైతం దరిచేరని పరిస్థితి. కోవిడ్‌తో చనిపోతే ఫ్యామిలీ ఆమడ దూరంలోనే ఆగిపోతోంది. ఇరుగుపొరుగు వాకిలి దాటట్లేదు. ఎన్ని ఆస్తిపాస్తులున్నా పాడెకు భుజం పట్టడానికి ఎవరూ ముందుకురావట్లేదు. వైరస్ భయంతో దూరందూరంగా జరిగిపోతున్నారు అంతా. ఇలాంటి పరిస్థితుల్లో పరిస్థితులో కోవిడ్ మృతులకి అంత్యక్రియలు చేసేందుకు స్వచ్చంధ సంస్థలు ముందుకు అంతిమక్రియలను పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలిచింది.
ఇదే క్రమంలో కోవిడ్ మృతుల దహన సంస్కారాలకు అయ్యే ఖర్చును భరించాలని జార్ఖండ్ రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. కరోనా మృతుల దహన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తాజాగా ప్రకటించారు. రామ్ ఘడ్ జిల్లాలో 80 పడకల కొవిడ్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం సోరెన్ ఈ ప్రకటన చేశారు. కోవిడ్ మృతుల దహనానికి కట్టెలను ఉచితంగా ఇస్తామని, శ్మశానవాటికలో ఖననం కోసం సమాధులు తవ్వటానికి ఎలాంటి చార్జీలు విధించమని సీఎం చెప్పారు.
జార్ఖండ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వైరస్ వ్యాప్తి చెందుతోంది. మే మొదటివారంలో 3వేల మందికి పైగా ప్రజలు కరోనాతో మరణించారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పరీక్షలు చేస్తామని, కరోనా సోకిన వారిని కొవిడ్ కేర్ కేంద్రాలకు తరలిస్తామని, ఇంటి వద్ద ఉండి చికిత్స పొందే వారికి మెడికల్ కిట్లు అందిస్తామని సీఎం చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందన్నారు. అలాగే, 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి టీకాలు అందించే కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తామని సీఎం సోరెన్ వివరించారు.