కరోనా టెస్టింగుల ధర తగ్గించండి.. ల్యాబ్ లకు ఐసీఎంఆర్ లేఖ
కరోనా వైరస్ టెస్టింగులకు వసూలు చేస్తున్న చార్జీలను తగ్గించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) దేశంలోని ప్రైవేట్ ల్యాబ్ లను కోరింది...

కరోనా వైరస్ టెస్టింగులకు వసూలు చేస్తున్న చార్జీలను తగ్గించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) దేశంలోని ప్రైవేట్ ల్యాబ్ లను కోరింది. ఇలాంటి అభ్యర్థననే రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా ఈ సంస్థ కోరిన విషయం గమనార్హం. ఈ టెస్టుల కోసం ప్రైవేటు ల్యాబ్ లు ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నాయని ఈ సంస్థ అభిప్రాయపడింది. ఈ సంస్థ చేసిన అభ్యర్థనతో టెస్టింగుల కోసం ఎదురు చూస్తున్న లక్షలాదిమందికి కొంత రిలీఫ్ కలిగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ ల్యాబ్ లతో సంప్రదించి చార్జీలను ఫిక్స్ చేయాలని కోరుతూ తాము లేఖ రాసినట్టు ఐసీఎంఆర్ హెడ్ బలరాం భార్గవ తెలిపారు. ప్రస్తుతం పరీక్షా సాధనాలను దేశీయంగా, లోకల్ గానే సమకూర్చుకుంటున్నామని, అందువల్ల ధరలను తగ్గించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి వరకు వీటిని దిగుమతి చేసుకుంటూ వచ్ఛే వాళ్ళమన్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. గత మార్చి 17 న గరిష్ట ధర పరిమితి రూ. 4,500 ఉండాలని సూచించినప్పటికీ ప్రస్తుతానికి అది వర్తించదన్నారు. దేశంలో ప్రస్తుతం 610 ల్యాబ్ లు కరోనా టెస్టింగులు చేస్తున్నాయి.




