కరోనా వస్తే వాసన కోల్పోయేది అందుకేనట

కరోనా వైరస్ లక్షణాల్లో వాసనను కోల్పోడం ఒకటన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయంపై హార్వర్డ్‌ మెడికల్ స్కూల్ నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం పరిశోధన చేసింది.

  • Tv9 Telugu
  • Publish Date - 10:48 am, Sun, 26 July 20
కరోనా వస్తే వాసన కోల్పోయేది అందుకేనట

Loss of Smell in Corona Patients: కరోనా వైరస్ లక్షణాల్లో వాసనను కోల్పోడం ఒకటన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయంపై హార్వర్డ్‌ మెడికల్ స్కూల్ నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం పరిశోధన చేసింది. ఈ క్రమంలో వాసనను గుర్తించి మెదడుకు సమాచారాన్ని చేరవేరే సెన్సరీ న్యూరాన్లకు సహాయకారులుగా ఉండే ఇతర కణాల్లోకి కరోనా వైరస్‌ వెళుతుండటం వలనే రోగులు వాసనను కోల్పోతున్నారని తెలిపారు. అయితే న్యూరాన్లు మాత్రం ఈ వైరస్‌ బారిన పడకపోవడం గమనించదగ్గ విషయమని పేర్కొన్నారు. సాధారణ వైరస్‌ల వలన నెలల పాటు వాసన శక్తిని కోల్పోతే.. కోవిడ్ 19 బారిన పడ్డ వారిలో మాత్రం నాలుగు వారాల్లోనే ఆ శక్తి వస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

”కరోనా వైరస్‌ శరీర కణాల్లోకి ప్రవేశించేందుకు ఆధారంగా చేసుకునే ఏస్‌ –2 రిసెప్టర్‌ ప్రొటీన్లను ఉత్పత్తి చేసే జన్యువులు సెన్సార్‌ న్యూరాన్లలో లేవు. కానీ ఈ న్యూరాన్లకు సహాయకారులుగా ఉండే కణాల్లో ఉన్నాయి. వీటితో పాటు రక్తనాళ కణాలు, కొంతమేరకు మూలకణాల్లోనూ ఏస్‌–2 రిసెప్టర్‌ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసే జన్యువులు ఉన్నాయి. ఇక సహాయక కణాలను వైరస్‌ ఆక్రమించడం వల్లనే వాసన చూసే శక్తిని తాత్కాలికంగా కోల్పోతున్నారు” అని అధ్యయనకారులు తెలిపారు. అయితే వ్యాధి నుంచి కోలుకున్న తరువాత ఈ శక్తి మళ్లీ వారికి అందుతుందని అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త సందీప్‌ రాబర్ట్‌ దత్తా తెలిపారు. వైరస్‌ బారిన పడ్డ వారిలో శాశ్వతంగా వాసనను కోల్పోయే అవకాశాల్లేవని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు మరికొంత సమాచారం అవసరమని తెలిపారు.

Read This Story Also: రైల్వేలో 2,700 మంది ఉద్యోగులకు కరోనా